లచ్చిరెడ్డికి కౌన్సెలింగ్ ఇస్తున్న తహసీల్దార్ వెంకటేశ్వరరావు, రూరల్ ఎస్‌ఐ లోకేశ్వరరావు, గ్రామపెద్దలు
గుంటూరు, మాచర్లరూరల్:ఆధ్యాత్మిక భావనతో జీవసమాధిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధుడికి అధికారులు కౌన్సెలింగ్ ఇవ్వవలసివచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన తాతిరెడ్డి లచ్చిరెడ్డి అనే వృద్ధుడు ఇహలోక ఈతిబాధల నుంచి విముక్తి పొందేందుకు సజీవ సమాధిలోకి వెళ్లనున్నట్టు కుటుంబసభ్యులకు, బంధువులకు తెలిపాడు. అందుకు గాను 10 అడుగుల గొయ్యి కూడా సిద్ధం చేసుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అవడంతో జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.
దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మాచర్ల తహసీల్దార్ డి.వెంకటేశ్వరరావు, రూరల్ ఎస్‌ఐ లోకేశ్వరరావు ఆగమేఘాలపై గన్నవరం గ్రామానికి వెళ్లి లచ్చిరెడ్డి, అతని కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మానవ జీవితం ఎంతో విలువైనదని, బతికుండగా జీవసమాధి చేసుకోవడం నేరమని లచ్చిరెడ్డికి కౌన్సెలింగ్ ఇచ్చారు. లచ్చిరెడ్డి మానసిక స్థితిని గమనించి, ఆయన మళ్లీ ఇటువంటి ప్రయత్నాలు చేసుకోకుండా బాధ్యత తీసుకోవాలని కుమారులు రామకృష్ణారెడ్డి, అక్కిరెడ్డిలకు తెలిపారు. వీఆర్‌వో బి.వెంకటేశ్వర్లు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment