
కదిరి కౌన్సిల్‌లో దుమారం
తొలగించిన కార్మికులకు న్యాయం చేయాలని సమావేశంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల డిమాండ్
కదిరి: నోటీసు ఇవ్వకుండా స్థానిక మునిసిపాలిటీలో పనిచేస్తున్న 55 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో దుమారం లేచింది. 23వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ పార్నపల్లి షాహినా బే గం ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై చర్చ జరగాలని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. కార్మికులకు న్యాయం జరిగే వారికి అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు.
ఇందుకు చైర్‌పర్సన్ సురయాభాను మాట్లాడుతూ కార్మికులను తొలగించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ హయాం నుంచే వచ్చింద న్నారు. అప్పుడు మీరు కౌన్సిలర్‌గా ఉన్నారు కదా.. ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ రాజశేఖర్‌రెడ్డి నుద్దేశించి అన్నారు. దీంతో ఆయన స్పందిస్తూ ఁమీరు తొలిసారిగా కౌన్సిల్‌లో అడుగు పెట్టారు. ఆ రోజే నేను కార్మికులకు అండగా నిలిచాను. మీకు తెలియకపోతే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లను అడిగి తెలుసుకోండి* అని చైర్‌పర్సన్‌కు చురకంటించారు.
రెండు రోజుల్లో తొలగించిన కార్మికులకు న్యాయం చేస్తామని ఆమె చెప్పడంతో సమస్య సద్దుమనిగింది. అంతకు మునుపు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌లు కిన్నెర కళ్యాణ్‌కుమార్, ఖాదర్‌బాషా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడ జూసినా ఆక్రమణలు ఎక్కువయ్యాయని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ కౌన్సిలర్ షబ్బీర్ అంబేద్కర్ కూడలిలో కొంత ప్రభుత్వ స్థలం ఉందని, ఇప్పుడు అక్కడ అత్తార్ రెసిడెన్సీ వెలసిందన్నారు.
ఖాదర్‌బాషా సమాధానమిస్తూ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ హిందూపూర్ సర్కిల్‌లోని వక్ష్ బోర్డు స్థలాన్ని ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆక్రమణల విషయంపై ఇరుపార్టీలకు చెందిన కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు సాగాయి. ఆక్రమణ అంశాన్ని లేవనెత్తిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు తన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వైస్ చైర్‌పర్సన్ వసంత తెలిపారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ మైనుద్దీన్ కౌన్సిల్, టీడీపీ కౌన్సిలర్ షబ్బీర్ మాట్లాడుతూ తమ వార్డులో అర్హులైనవారి పింఛన్లు తొలగించారని సమావేశం దృష్టికి తెచ్చారు.
ఎక్స్‌అఫియో సభ్యుడు ఎవరు?
మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యులు ఎవరు హాజరు కావచ్చునని చైర్‌పర్సన్‌ను వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ ఖాదర్‌బాషా ప్రశ్నించారు. ఇందుకు ఆమె కాసేపు మౌనం వహించి, తనకు తెలియదన్నారు. పక్కనే ఉన్న వైస్ చైర్‌పర్సన్ వసంత కలుగజేసుకొని ఇంకా నియమించలేదన్నారు.
టీడీపీ కౌన్సిలర్ రాజశేఖరాచారి మాట్లాడుతూ స్థానిక శాసన సభ్యుడు అత్తార్ చాంద్‌బాషా ఎక్స్‌అఫియో సభ్యుడని తెలపడంతో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ అవాక్కయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యుడికి మున్సిపాలిటీ తరపున గాంధీ జయంతి రోజు ఎందుకు ఆహ్వానం పంపలేదని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ ఖాదర్‌బాషా నిలదీశారు. ఇలాంటి పొరపాటు పునరావృతం కాకుండా చూస్తామని చైర్‌పర్సన్, కమిషనర్ వెంకటరమణ తెలిపారు.