నెల్లూరు(విద్య) : ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భారీ పోలీసు బందోబస్తు నడుమ కౌన్సెలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. గత కౌన్సెలింగ్‌లకు భిన్నంగా హెల్ప్‌లైన్ సెంటర్ల వద్ద ప్రైవేటు కళాశాలల పీఆర్‌ఓలు, మీడియేటర్ల జాడ కనబడలేదు. పోలీసుల కనుసన్నల్లో కౌన్సెలింగ్ జరగడం విద్యార్థులకు ఒకింత భయం కలిగించినప్పటికీ ప్రశాంతమైన వాతావరణం నెలకొనడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రచారకార్యక్రమాలు, ప్లెక్సీలకు అవ కాశం ఇవ్వలేదు. నిబంధనలను పోలీసులు పకడ్బందీగా పాటించడంతో ప్రలోభాలకు అవకాశం లేకుం డాపోయింది. కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందు ఓ యువకుడు తమ కళాశాలకు చెందిన కరపత్రాలు పంచుతుండగా పోలీసులు అడ్డుకుని పంపించివేశారు. అయితే విద్యార్థి సంఘాలు మాత్రం హడావుడి చేశాయి. వినతిపత్రాలను అధికారులకు అందజేశారు. ప్లెక్సీలను తొలగించాలని కోరారు. కొన్ని ప్రైవేటు కళాశాలలకు కొన్ని విద్యార్థి సంఘాలు కొమ్ముకాస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కోవడం గమనార్హం.
సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ
స్థానిక దర్గామిట్ట ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో 1 నుంచి 7,500 ర్యాంకుల వరకు నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియలో 185 విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్పీ గజరావు భూపాల్ కౌన్సెలింగ్ నిర్వహణ తీరును పరిశీలించారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. విద్యార్థి సంఘాల ఆరోపణలపై వాస్తవాలను తెలియజేయాల్సిందిగా సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. డీఎస్పీ మగ్బూల్, నాల్గో నగర సీఐల ఆధ్వర్యంలో భారీ బందోబస్తును కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. కౌన్సెలింగ్ నిర్ణీత సమయానికి ఎస్టీ విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించాల్సిన అధికారి రాకపోవడంతో ఆ విద్యార్థులు ఆందోళన చెందారు. ఎస్టీ అభ్యర్థుల పరిశీలనా అధికారి ఆలస్యంగా రావడంతో ఆ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది.
వెంకటేశ్వరపురం ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 7,501 నుంచి 15వేల ర్యాంకుల వరకు జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనలో 250 మంది హాజరయ్యారు.
నేటి కౌన్సెలింగ్‌లో...
వెంకటేశ్వరపురం బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 7,501 నుంచి 15,000 ర్యాంకుల వరకు, దర్గామిట్ట ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం 15,001 నుంచి 22,500 ర్యాంకు వరకు, సర్టిఫికెట్ల పరిశీలనా ప్రక్రియ నిర్వహిస్తామని ప్రిన్సిపల్స్ రామమోహన్, నారాయణలు తెలిపారు.
అవకతవకలు లేకుండా చూడాలి:
కౌన్సెలింగ్ ప్రక్రియలో అవకతవకలకు తావివ్వకుండా నిర్వహించాలని వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు వెంకటేశ్వరపురంలోని బాలుర పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు సర్వేపల్లి విశ్వరూపాచారి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
విద్యాసంస్థల పీఆర్‌ఓలు ఒక్కో విద్యార్థికి రూ.10వేలు అందజేస్తామని, తమ కళాశాలలో చేరాలంటూ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్‌కుమార్‌రెడ్డి, నాయకులు జగదీష్, మన్సూర్, సమి, అశోక్, శివ, గణేష్ వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు.
సక్రమంగా నిర్వహించాలి...
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను సక్రమంగా నిర్వహించాలని ఏపీ ప్రత్యేకహోదా విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ దాసరి అంజయ్య డిమాండ్ చేశారు. స్థానిక దర్గామిట్ట మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్‌కు ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. తల్లిదండ్రులను మోసం చేసే ప్రైవేట్ యాజమాన్యాల చర్యలను అరికట్టాలని కోరారు. వై. రాజా, ఎన్.ఉదయ్, రామకృష్ణ, టోనీ తదితరులు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు.
పోలీసు పహారాలో కౌన్సెలింగ్
Published Sat, Jun 13 2015 2:09 AM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM
Advertisement