48 గంటలే..  | countdown started | Sakshi
Sakshi News home page

48 గంటలే.. 

Published Tue, May 21 2019 2:53 PM | Last Updated on Fri, Jul 12 2019 6:06 PM

countdown started - Sakshi

కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వీరపాండియన్‌

43 రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. ఐదేళ్లపాటు అధికారంలో ఉండేది ఎవరో తేలనుంది. ఏప్రిల్‌ 11న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన లెక్కింపు 23న 
జరగనుంది. అదే రోజు ఫలితం వెలువడనుండటంతో అందరిలోనూ టెన్షన్‌ నెలకొంది. ఎగ్జిల్‌ పోల్స్‌ అన్నీ 
వైఎస్సార్‌ సీపీ వైపే మొగ్గుచూపగా... కౌంటింగ్‌ రోజుకోసం అభ్యర్థులు..పార్టీల అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.
 

సాక్షి, అనంతపురం అర్బన్‌ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ఈనెల 23న జరగనుంది. ఓట్ల లెక్కింపుపై 43 రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇందుకోసం జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌కు 1,380 మంది సిబ్బందిని నియమించారు. అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ (ఈటీపీబీ) ఓట్లు లెక్కిస్తారు. ఆ తరువాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన ఐదు వీవీప్యాట్‌లను లెక్కిస్తారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ఫలితాలను వెల్లడిస్తారు. 
ఓట్ల లెక్కింపు ఇలా... 
అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో నిర్వహిస్తారు. అలాగే హిందూపురం పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఎస్కేయూలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో జరుగుతుంది. 23వ తేదీ ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లు, ఈటీపీబీ (సర్వీస్‌ ఓట్లు) లెక్కిస్తారు. ఇక ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు 8 గంటలకు ప్రారంభిస్తారు. పార్లమెంట్‌ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు చొప్పున రెండు పార్లమెంట్‌ నియోజవర్గాలకు 196 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గానికి 14 టేబుళ్లు చొప్పన 196 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్, ఒక కౌంటింగ్‌ అసిస్టెంట్, ఒక సూక్ష్మ పరిశీలకుడు చొప్పున. 392 టేబుళ్లకు 1,176 మంది నియమించారు. రౌండ్‌ల వారీగా లెక్కించిన ఓట్ల వివరాలను ముందుగా సువిధ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత కలెక్టర్, జేసీ, జేసీ–2, ఎన్నికల కమిషన్, మీడియా సెంటర్‌కు మెయిల్‌ ద్వారా వివరాలు పంపిస్తారు. 
పోస్టల్‌ బ్యాలెట్, ఈటీపీబీ లెక్కింపు 
పోస్టల్‌ బ్యాలెట్, ఈటీపీబీ ఓట్ల లెక్కింపునకు సంబంధించి రెండు పార్లమెంట్‌ నియోజకర్గాలకు 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 40 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి లెక్కింపునకు దాదాపు 204 మంది సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపులో ఇతర విధులకు 1,200 మందిని నియమించనున్నారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేకంగా చెక్క బాక్స్‌లు సిద్ధం చేశారు. ఈటీపీబీ లెక్కింపునకు కంప్యూటర్లు, స్కానర్లు ఏర్పాటు చేశారు. 
బరిలో 186 మంది అభ్యర్థులు 
అనంతపురం, హిందూపురం పార్లమెంట్, 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 186 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి 14 మంది, హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి 9 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 163 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరందరి భవితవ్యం 23న తేలనుంది. 
పోలైన ఓట్లు 26.54 లక్షలు 
జిల్లాలో మొత్తం 32,39,517 ఓట్లు ఉండగా 26,54,257 ఓట్లు పోలయ్యాయి. 82.22 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. ఇందులో పురుషులు 6,70,501 మంది (82.93 శాతం), మహిళలు 6,49,589 మంది (81.52 శాతం), థర్డ్‌ జెండర్‌ 50 మంది (22.89 శాతం) ఓటుహక్కు వినియోగించుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement