
బదిలీలకు కౌంట్‌డౌన్
జోరుగా పైరవీలు
చేతులు మారుతున్న సొమ్ము
{పజాప్రతినిధుల సిఫార్సులకే పెద్దపీట
విశాఖపట్నం: రెండ్రోజులే గడువుండడంతో బదిలీలకు పైరవీలు జోరందుకున్నాయి. ముఖ్యంగా రెండు శాఖల్లో కీలక పోస్టుల కోసం లక్షలు కుమ్మరిస్తున్నారు. మధ్యవర్తులను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు భారీగానే దండుకుంటున్నారు.
అస్మదీయులు..తస్మదీయులనే తేడా లేకుండా సిఫార్సులేఖలు ఇచ్చేస్తుండడంతో ఆయాశాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు. బదిలీలకు ఈ నెల మొదటి వారంలో సర్కార్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. జెడ్పీ, పంచాయితీ రాజ్‌తో సహా పీఆర్ ఇంజనీరింగ్, ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖల్లో బదిలీలకు శాఖలవారీగా మార్గ దర్శకాలిచ్చింది. గడువు రెండ్రోజులు ఉండడం..చివరి రోజు నగరంలో రాష్ర్ట స్థాయి స్వాతంత్య్రవేడుకలు జరుగనుండడంతో బదిలీల ప్రక్రియను శుక్రవారం సాయంత్రం కల్లా పూర్తిచేసేందుకు ఆయా శాఖలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి.
జెడ్పీలో 200 మందికి తప్పని స్థానచలనం
జెడ్పీలో 381 మందిలో 200 మందికి బదిలీ జరిగే అవకాశాలున్నాయి. మెజార్టీ ఎంపీడీఓలు గతేడాది బదిలీల్లోనే జిల్లాకు వచ్చారు. అయినప్పటికీ కనీసం పది మందిని బదిలీ చేసే అవకాశాలున్నాయి. నగరానికి ఆనుకొని ఉన్న భీమిలి,పెందుర్తి,ఆనందపురం,పరవాడలతో పాటు అనకాపల్లి, సబ్బవరం, యలమంచలి, నక్కపల్లి మండలాల్లో ఎంపీడీఒలతో పాటు ఈఒపీఆర్‌డీ పోస్టుల కోసం జోరుగా పైరవీలు సాగుతున్నాయి. జెడ్పీలోని మినిస్టీరియల్ స్టాఫ్ లో కనీసం 70 శాతం మందికి స్థానచలనం కలగనుంది. పంచాయితీరాజ్‌లో ఇప్పటికే డీఎల్‌పీలబదిలీలు కొలిక్కివచ్చాయి. డిఎల్‌పీఒ గా పనిచేస్తున్న మోహనరావును విజయనగరం బదిలీ చేయగా, నర్సీపట్నం, పాడేరు డీఎల్‌పీఒ లు సత్యనారాయణ, రాంప్రసాద్‌లను శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేసారు. విజయ నగరం నుంచి డి. మోహనరావు, డిఎం సెల్వియా, శ్రీకాకుళం నుంచి పి.శేషారాణిలు బదిలీపై రాగా, వీరికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. డీపీఒ కార్యాలయ ఎఓ ఆర్ నారాయణరావును శ్రీకాకుళం బదిలీ చేయగా,విజయనగరం నుంచి ఎస్‌ఎస్‌ఎస్‌ఎన్ మూర్తిని ఇక్కడకు బదిలీ చేశారు. 925 పంచాయితీలకు 395పంచాయితీలకు మాత్రమే కార్యదర్శులుండగా, వారిలో మార్గదర్శకాల ప్రకారం 130 మంది కార్యదర్శులకు స్థానచలం తప్పేటట్టు కన్పించడం లేదు.
పీఆర్ ఇంజనీరింగ్‌లో బదిలీలన్నీ ఈఎన్‌సీ పరిధీలో జరుగనున్నాయి. ఈ శాఖలో 294మంది ఉండగా,150మందికి పైగా బదిలీలు గురయ్యే అవకాశాలున్నాయి. మండల జేఈలు, ఏఈ ల్లో కనీసం వందమంది, డీఈల్లో 15 మందికి స్థానచలనం తప్పదని చెబుతున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ 205మంది ఉండగా, వారిలో కనీసం 60మంది బదిలీ తప్పదంటున్నారు. వారం రోజులుగా బదిలీలకు గురయ్యే వారు..కోరుకునే వారు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. జెడ్పీలో రాజ్యాంగేతర శక్తితో పాటు ఓ సీనియర్ మంత్రి ఈ బదిలీల్లో చక్రం తిప్పు తున్నారు. ఎమ్మెల్యేలు కూడా ఎవరికి వారు తమ నియోజకవర్గాల్లో కోరుకున్న వార్ని తెచ్చు కునేందుకు పావులు కదుపుతున్నారు. బదిలీ కోరుకునే వారి నుంచి బదిలీకి గురయ్యే వారి నుంచి వీరంతా భారీగానే దండుకుంటున్నట్టు తెలుస్తోంది.ఏఈ, జేఈ, ఎంపీడీఒ స్థాయి పోస్టులకు ఐదు నుంచి పదిలక్షలు చేతులు మారుతున్నట్టు వినికిడి. కొంత మంది ప్రజాప్రతి నిధులు అనుచరుల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది.