
సీఐడీ ఆయుధంగా కౌంటర్ ఎటాక్
ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ సీఎం చంద్రబాబు టీ సర్కార్‌పై చేయనున్న కౌంటర్ ఎటాక్‌కు ఏపీ నేర పరిశోధన విభాగాన్ని (సీఐడీ) ప్రధాన ఆయుధంగా వినియోగించుకుంటున్నారు.
వ్యూహం సిద్ధం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
మత్తయ్య కేసు దర్యాప్తు బాధ్యతలు సీఐడీకి బదిలీ
సాక్షి, హైదరాబాద్/ విజయవాడ: ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ సీఎం చంద్రబాబు టీ సర్కార్‌పై చేయనున్న కౌంటర్ ఎటాక్‌కు ఏపీ నేర పరిశోధన విభాగాన్ని (సీఐడీ) ప్రధాన ఆయుధంగా వినియోగించుకుంటున్నారు. తెలంగాణ ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరుసలేం మత్తయ్య విజయవాడ సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు దర్యాప్తు బాధ్యతల్ని బుధవారం అధికారికంగా సీఐడీకి అప్పగించారు. మత్తయ్య న్యాయస్థానంలో సీఆర్‌పీసీ 164 సెక్షన్ కింద ఇచ్చిన వాంగ్మూలంలో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురి ప్రముఖులపై ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ (పీసీ) యాక్ట్ కింద చర్యలు తీసుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం నుంచి అందిన మౌఖిక ఆదేశాల మేరకు సీఐడీ పోలీసులు ఆ దిశగా దృష్టి సారించారు. ఈ కేసులో సీఐడీ ఎస్పీ కోటేశ్వరరావు దర్యాప్తు అధికారిగా ఏర్పాటైన 3 ప్రత్యేక బృందాలు సత్యనారాయణపురం పోలీసుస్టేషన్ నుంచి కేసుకు సంబంధించిన ఫైళ్లను బుధవారం సేకరించాయి.
విజయవాడ సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌కు మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదులో కేవలం బెదిరింపులకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. ఆయన స్థానిక మున్సిఫ్ కోర్టులో ‘164’ కింద ఇచ్చిన వాంగ్మూలంలో అవినీతి, లంచానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారని, ఇప్పుడు దాని ఆధారంగా కేసీఆర్‌పై పీసీ యాక్ట్ మేరకు చర్యలకు ఉపక్రమించాలన్న ఆలోచన చేస్తున్నారు. అయితే మత్తయ్య చెబుతున్న లంచాల వ్యవహారం తెలంగాణలో జరిగింది కావడంతో ఏపీలో కేసు నమోదు చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ‘సత్యనారాయణపురం కేసు’ దర్యాప్తులో ఈ వివరాలు వెలుగులోకి వచ్చినట్లు రికార్డులు రూపొందించి దాని ఆధారంగా సీఐడీ అధికారులు సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌కు బదిలీ అయిన కేసును రీ-రిజిస్టర్ చేస్తూ అందులో పీసీ యాక్ట్ సెక్షన్లను పొందుపరచాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి సంబంధిత న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనున్నారు. ఆపై మత్తయ్య వాంగ్మూలంలో వెలుగులోకి వచ్చిన పేర్ల ఆధారంగా తెలంగాణ సీఎం కేసీఆర్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌లతోపాటు పలువురికి నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
పోలీసు రక్షణలో మత్తయ్య?
ఓటుకు కోట్లు కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న మత్తయ్య ఏపీ పోలీసు రక్షణలో, విజయవాడలోనే ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. విజయవాడ పోలీసులు ఆయన రక్షణపై భరోసా ఇచ్చినట్లు సమాచారం.