
నకిలీ చెలామనీ
ఈ ఇద్దరే కాదు జిల్లాలో రోజూ ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్న వారెందరో... ఫిర్యాదు చేస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయేమోనని ఎవరికి వారు మిన్నకుంటున్నారు. అందుకే ఇలాంటి ఘటనపై పెద్దగా కేసులు నమోదు కాకున్నా నకిలీ నోట్ల చెలామణి మాత్రం విస్తృతమైంది.
వినుకొండకు చెందిన వినీల్‌కుమార్ ఓ ప్రయివేటు సంస్థలో చిరుద్యోగి. పోటీ పరీక్షలకు సిద్ధమతున్న తన మేనకోడలిని వెంటబెట్టుకుని కోచింగ్ సెంటర్‌కు వెళ్లాడు. రెండు నెలల శిక్షణ కోసం రూ.8 వేల ఫీజు చెల్లించాడు. తాను ఇచ్చిన రూ.500 నోట్లలో మూడు నకిలీవని కోచింగ్ సెంటర్ నిర్వాహకులు చెప్పగా విని వినీల్ నోరెళ్లబెట్టాడు. తాను ఇక్కడికి వస్తూ ఏటీఎం సెంటర్‌లో ఆ డబ్బు డ్రా చేశానని చెప్పినా వినకపోవడంతో ఆ నోట్లు తీసుకుని మరో రూ.1,500 ఇచ్చి వెనుదిరిగాడు.
ఇటీవల పొలం అమ్మిన డబ్బుతో భార్యకు బంగారు గొలుసు చేయిద్దామని శ్రీనివాసరావు ప్రముఖ జ్యూవెలరీ దుకాణానికి వెళ్లాడు. దాదాపు రెండున్నర లక్షల రూపాయల విలువైన హారం ఆర్డర్ ఇచ్చాడు. అడ్వాన్‌సగా రూ.50 వేలు చెల్లించాడు. కౌంటర్ లోని మెషిన్‌లో డబ్బు లెక్కించిన గుమాస్తా అందులో రూ.500 నోట్లు నాలుగింటిని శ్రీనివాసరావుకు తిరిగిచ్చేసి, వేరే నోట్లు ఇవ్వమని కోరాడు. నకిలీవని గుర్తించడానికి కూడా వీల్లేనంతగా ఉన్న ఆ నోట్లు తాను పొలం రిజిస్ట్రేషన్ చేసిన రోజు కొనుగోలుదారుల నుంచి అందుకున్నవే.
గుంటూరు క్రైం : జిల్లాలో రాష్ర్ట రాజధాని ఏర్పాటు నిర్ణయం మంచితోపాటు చెడునూ మోసుకొస్తోంది. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు పెరిగాయి. కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతున్నాయి. వీటితో పాటే నకిలీ నోట్లు కూడా పెద్ద మొత్తంలో చేతులు మారుతున్నాయి. ఒకరి నుంచి మరొకరికి చేరి చెలామణి అవుతున్నాయి. వడ్డీ వ్యాపారులు, కమిషన్ దుకాణాల వద్దే కాకుండా బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల నుంచి కూడా నకిలీ నోట్లు వస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.
ఆర్థిక సమస్యల కారణంగా అధిక వడ్డీలకు వడ్డీ వ్యాపారుల నుంచి డబ్బు తీసుకుని కూడా మోసపోతున్నారు. ఆ డబ్బులో నకిలీ నోట్లు ఉండటంతో అవాక్కవుతున్నారు. అదేవిధంగా ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసిన సందర్భాల్లో నకిలీ నోట్లు రావడాన్ని గుర్తించి, ఖాతాదారులు లబో దిబోమంటున్నారు. నకిలీ కరెన్సీ కూడా అసలు నోట్లు మాదిరిగానే వుండటంతో వాటిని గుర్తించలేక సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకు అధికారులను సంప్రదించినా ప్రయోజనం లేకపోవడం.. పోలీసుల వద్దకు వె ళ్లి ఫిర్యాదు చేసేందుకు బాధితులు జంకుతుండటంతో ఈ వ్యవహారం చాపకింద నీరులా విస్తరిస్తోంది. పెద్దగా నిఘా కూడా లేకపోవడంతో నకిలీ కరెన్సీ జిల్లాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా కేవలం ఐదు కేసులే నమోదయ్యాయి.
చిరువ్యాపారులు, కూలీలే లక్ష్యం...
వ్యాపార అవసరాలకు డ బ్బు కోసం తమను ఆశ్రయించే చిరు వ్యాపారులకు అసలు నోట్లతో పాటు కొన్ని నకిలీవి కలిపి ఇస్తూ వడ్డీ వ్యాపారులు మోసగిస్తున్న సందర్బాలు ఉన్నాయి. అవి ప్రజల చేతుల మీదుగా చెలామణి అవుతుండటంతో వీరి దందా మూడు అసలు నోట్లు ఆరు నకిలీ నోట్లు అన్న చందంగా దర్జాగా సాగిపోతోంది. ఈ వ్యవహారం గుంటూరు మేడికొండూరు మండలం, పేరేచర్ల, నరసరావుపేట, వినుకొండ, పిడుగురాళ్ళ, దాచేపల్లి, మాచర్ల, ప్రాంతాల్లో ఎక్కువగా కొనసాగుతున్నట్లు సమాచారం.
ఆయా ప్రాంతాల్లో దినసరి కూలీలు, ఉపాధి కోసం వలస వచ్చిన ఇతర రాష్ట్రాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొందరు వడ్డీ వ్యాపారులు నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్లు గతంలో ఫిర్యాదులు వచ్చాయి. స్పెషల్ బ్రాంచ్ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు చేసి, కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన ఘటనలు ఉన్నాయి. శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న పోలీసులతోపాటు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండి నకిలీ నోట్ల చెలామణీని అరికట్టాల్సిన అవసరం ఉంది.