దేశానికి మోడి నాయకత్వం అవసరం | country needs modi 's leadership | Sakshi
Sakshi News home page

దేశానికి మోడి నాయకత్వం అవసరం

Published Mon, Aug 26 2013 5:44 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

country needs modi 's leadership

రెంజల్, న్యూస్‌లైన్ : అవినీతి కుంభకోణాల్లో ప్రపంచ దేశాల్లోనే అగ్రభాగాన ఉన్న మన దేశానికి దశ, దిశానిర్దేశించే గుజరా త్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి నాయకత్వం అవసరమని శాసన సభాపక్ష నేత, అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆదివారం రెంజల్ మండలం దూపల్లి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. గుజరాత్ రాష్ట్ర అభివృద్ధి మాంత్రికుడు మోడితోనే దేశభద్రత కలుగుతుందని, యువత ఆయన నాయకత్వాన్ని ఆశిస్తున్నారని గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వం బొగ్గు, అగస్త్య, కామన్వెల్త్ క్రీడలు, 2జీ స్ప్రెక్టం తదితర కుంభకోణాలతో దేశ ప్రజల ధనాన్ని దోచుకుందని ఆరోపించారు. గుజరాత్‌లో మోడీ నాయకత్వం చేపట్టక ముందు * 2,500 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయన్నారు. స్థానిక వనరులను వినియోగించుకుని ప్రస్తుతం * 643 కోట్ల నిల్వలతో ప్రగతిని సాధించారని గుర్తుచేశారు. పాకిస్తాన్ చొరబాటుదారులకు ఆస్కారం లేకుండా కాపాడే నాయకుడు మోడీయేనని అన్నారు.
 
 తెలంగాణ బిల్లుపెట్టాలి..
 ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం తెలగాణ ప్రత్యేక రాష్ట్రబిల్లు పెట్టాలని యెండల డిమాండ్ చేశారు. దేశంలో మోడి ప్రభంజనం సాగుతుందని గుర్తించిన కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో లబ్ధిపొందాలని ముందస్తుగా తెలంగాణ ప్రకటణ చేసిందన్నారు. అంతకుముందు దూపల్లి గేట్ నుంచి మోటార్ సైకిళ్ల ర్యాలీతో యెండలకు ఘనంగా స్వాగతం పలికారు. మండలంలోని పలు గ్రామాల యువకులు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గంగామణితో పాటు పార్టీ నాయకులు సంతోష్, సాయిలు, పోశెట్టి, భాస్కర్‌రెడ్డి, శోభన్, బుజ్జి, కటికెల సత్యనారాయణ, శ్రీనివాస్, రాజు, గంగాధర్, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement