వనరులను కాపాడే
ప్రధాన ట్రస్టీని: ప్రధాని మోదీ
ఏడాది పాటు అవినీతి రహిత పాలన అందించాం
దేశాన్ని దోచుకున్నవారికే చెడ్డరోజులు
నగ్ల చంద్రభాన్(మథుర): సంవత్సరం పాటు అవినీతి, కుంభకోణాలు లేని పాలన అందించామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఎన్డీయే సర్కారు ఏడాది పాలనపై సోమవారం ప్రోగ్రెస్ కార్డును విడుదల చేసిన మోదీ.. తాను ఈ దేశానికి ప్రధానమంత్రిని కాదని, దేశ వనరులకు రక్షణగా నిలిచే ప్రధాన సెంట్రీని, ప్రధాన సేవకుడిని అని అభివర్ణించుకున్నారు. ఎన్డీయే సర్కారుకు ఏడాది పూర్తై సందర్భంగా.. భారతీయ జన సంఘ్ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్వగ్రామమైన ఉత్తరప్రదేశ్‌లోని నగ్ల చంద్రభాన్(దీన్‌దయాళ్ ధామ్)లో సోమవారం జరిగిన ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. మహాత్మాగాంధీ, రామ్ మనోహర్ లోహియా, దీన్‌దయాళ్ ఉపాధ్యాయలు చూపిన బాటలో తమ పాలన సాగుతోందని, అందుకే ఏడాది పాలనలో తాము సాధించిన విజయాలను పంచుకునేందుకు దీన్‌దయాళ్ స్వగ్రామాన్ని వేదికగా చేసుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా.. యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు. మరో ఏడాది యూపీఏ అధికారంలో ఉంటే.. దేశం పూర్తిగా నాశనమయ్యేదని ధ్వజమెత్తారు.
‘ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ మంచి రోజులొచ్చాయి కానీ అవినీతి పరులకు, దళారీలకు, గత 60 ఏళ్లుగా దేశాన్ని దోచుకున్నవారికి మాత్రం చెడ్డ రోజులే వచ్చాయి’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. తాము వచ్చాక రాజకీయ నాయకుల అల్లుళ్లు, కొడుకుల పాత్ర ఉన్న అవినీతి కుంభకోణాల కథలు వినిపించడం లేదని చురకలేశారు. దాదాపు గంటపాటు ప్రసంగించిన మోదీ.. విపక్ష విమర్శలను కొట్టేస్తూ.. తనది రైతులు, పేదల అనుకూల ప్రభుత్వమని నొక్కి చెప్పారు. వివాదాస్పద భూ సేకరణ బిల్లు గురించి మాత్రం ప్రస్తావించలేదు. మోదీ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సీనియర్ నేతలు పాల్గొనేలా దాదాపు 200 సభలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.
మోదీ ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు..
నేను భారతదేశ ప్రధాన మంత్రిని కాదు. ఈ దేశ వనరులను కాపాడేప్రధాన సెంట్రీని. ప్రధాన సేవకుడిని. ప్రధాన ధర్మకర్తను. దేశ వనరులు దోపిడీకి గురికావడాన్ని నేను అనుమతించను.
గత 60 ఏళ్లుగా చక్రం తిప్పిన అధికార కేంద్రాలను నాశనం చేశాం. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు పద్మవ్యూహంలోని 8 కేంద్రాలను నాశనం చేస్తే.. మేం అధికారంలోకి వచ్చాక వందలాది అధికార కేంద్రాలను రూపు మాపాం.
దేశ వనరులపై ఎవరి చేయి(కాంగ్రెస్ పార్టీ గుర్తును గుర్తు చేస్తూ..) పడనివ్వబోనని ఎన్నికల సమయంలోనే చెప్పిన దాన్నే ఆచరిస్తున్నాను.
మేం అధికారంలోకి వచ్చిన తరువాత కొందరికి చెడ్డ రోజులొచ్చాయి. వాళ్లే ఇప్పుడు మా పాలనను విమర్శిస్తూ గొంతు చించుకుంటున్నారు. ఎందుకంటే, గత 60 ఏళ్లుగా ఢిల్లీలో వారి దోపిడీనే కొనసాగింది. వారికి చెడ్డ రోజులే ముందున్నాయి. గతంలో రిమోట్ కంట్రోల్ పాలన ఉండేది. రోజుకో అవినీతి కుంభకోణం బయటపడేది. ఇప్పుడా పరిస్థితి ఉందా? సంక్షేమ పథకాలకు సంబంధించి రూపాయికి 15 పైసలే నిజమైన లబ్ధిదారుడికి చేరుతున్నాయని రాజీవ్‌గాంధీ చెప్పారు. మేంరూపాయికి రూపాయి లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకున్నాం. కొత్త ప్రభుత్వం కొలువుతీరిన తరువాత అద్భుతాలు చోటు చేసుకున్నాయి.మరో ఏడాది యూపీఏ పాలన కొనసాగి ఉంటే దేశం మరెంత లోతుకు మునిగిపోయేదో ఆలోచించండి. మీరు తీసుకున్న ఒక మంచి నిర్ణయంతో దేశానికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి.
యూపీఏ పాలనలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవి. విలువైన బొగ్గు క్షేత్రాలను అత్యంత చవగ్గా అయినవారికి కట్టపెట్టారు. మేం అధికారంలోకి వచ్చాక కేవలం 29 బొగ్గు గనులను వేలం వేసి 3 లక్షల కోట్ల ఆదాయం సంపాదించాం. యూపీఏ హయాంలో రూ. 3 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు రాగా.. ఒక్క సంవత్సరంలోనే రూ. 25వేల కోట్ల విదేశీ పెట్టుబడులు సాధించాం.
మాది రైతులు, అణగారిన వర్గాల అనుకూల ప్రభుత్వం. వారి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.ఇప్పుడు వేప పొడి పూత ఉన్న యూరియా అందుబాటులోకి వచ్చింది. ఇక యూరియాను రసాయన పరిశ్రమలు వినియోగించుకోవడం కుదరదు. ఇకపై కొరత ఉండదు.
దేశానికి ప్రధాన సెంట్రీని!
Published Tue, May 26 2015 1:45 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement