ఆనం వివేకాకు సమన్లు జారీ చేసిన కోర్టు
- మార్చి 8న హాజరుకావాలని ఆదేశం
- ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కారణం
సాక్షి, హైదరాబాద్/నెల్లూరు సిటీ: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా దాఖలు చేసిన పరువునష్టం కేసులో టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 8న కోర్టు ముందు హాజరుకావాలని న్యాయస్థానం బుధవారం ఆయన్ని ఆదేశించింది. తన పరువుకు భంగం కలిగించేలా వివేకానందరెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ రోజా గతంలో కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం విచారించారు.
రోజా తరఫున వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. 2016, ఫిబ్రవరి 29న వివేకానందరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రోజాను కించపరిచేలా, ఆమె పరువుకు భంగం కలిగేలా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సీడీని న్యాయస్థానానికి సమర్పించారు. ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి పిటిషన్‌ను విచారణకు స్వీకరించి.. వివేకానందరెడ్డికి సమన్లు జారీ చేశారు.