జేసీ ఫిర్యాదు..అధికారుల వత్తాసు!
తాడిపత్రి, న్యూస్‌లైన్ : తాడిపత్రి మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మునిసిపాలిటీకి బకాయి ఉన్నారన్న కారణం చూపుతూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి రమేష్‌రెడ్డి 10, 18వ వార్డుల్లో వేసిన నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివరామకృష్ణ తిరస్కరించారు. మునిసిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని కుట్రపూరితంగా తన నామినేషన్లను రద్దు చేశారంటూ రమేష్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. వివరాలిలా ఉన్నాయి. మునిసిపాలిటీలోని మొత్తం 34 వార్డులకు వైఎస్సార్‌సీపీ తరఫున 99 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఇందులో జేసీ సోదరులకు అత్యంత సన్నిహితంగా ఉన్న తాడిపత్రి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్, మాజీ కౌన్సిలర్ రమేష్‌రెడ్డి నాలుగు రోజుల క్రితం వైఎస్సార్‌సీపీలోకి చేరి, చురుకైన పాత్ర పోషించి అన్ని వార్డులకూ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. దీన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో శనివారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా 10, 18వ వార్డులో నామినేషన్ వేసిన రమేష్‌రెడ్డి మునిసిపాలిటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడని, ఆయన 2001లో జరిగిన వేలం పాటలో మునిసిపాలిటీకి రూ.లక్షల్లో బకాయిపడ్డారని లిఖిత పూర్వకంగా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న అధికారులు ఆరు గంటల హైడ్రామా అనంతరం రమేష్‌రెడ్డి నామినేషన్లను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికారులపై పదేపదే ఒత్తిడి తేవడంపై అభ్యంతరం తెలిపిన రమేష్‌రెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ పేరం నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, అశోక్‌రెడ్డి, రజనీకాంత్‌రెడ్డి మాటలను అధికారులు ఖాతరు చేయలేదు.
తాను సంజాయిషీ చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలని, మీరే నోడ్యూస్ సర్టిఫికెట్ ఇచ్చి మీరే బాకాయి ఉందని ఎలా చెబుతారు అంటూ రమేష్‌రెడ్డి అధికారులతో వాదించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఒక దశలో మునిసిపల్ అధికారులు టీడీపీ నాయకులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. కావాలనే తనపై కుట్ర పన్ని ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసి బయటకి వెళ్లి పోయారు.