అవును.. మేము కరోనాపై గెలిచాం | Covid-19 Victims Comments After they Discharge | Sakshi
Sakshi News home page

అవును.. మేము కరోనాపై గెలిచాం

Published Sun, Apr 26 2020 3:51 AM | Last Updated on Sun, Apr 26 2020 5:03 AM

Covid-19 Victims Comments After they Discharge - Sakshi

ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్‌ బారిన పడి చికిత్స పొందిన పలువురు కోలుకుని శనివారం డిశ్చార్జి అయ్యారు. ఇళ్లకు వెళ్తున్న వారిని కరతాళ ధ్వనులతో అభినందిస్తున్న ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది. ఇదే రోజు కర్నూలులో కూడా పెద్ద సంఖ్యలో డిశ్చార్జ్‌ అయ్యారు. మంచి వైద్యం అందిందని వీరంతా ప్రభుత్వానికి, వైద్యులకు కృతజ్ఞతలు చెప్పారు.

కరోనా కోణం–1
కరోనా.. కరోనా.. కరోనా.. మన ఊళ్లో గల్లీ నుంచి అగ్రరాజ్యం అమెరికా దాకా అందరి నోటా ఇదే మాటే.. ఈ మహమ్మారి కరోనా వైరస్‌ మానవాళిని ముప్పు తిప్పలు పెడుతోంది.. 
కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.. అదిగో అక్కడ ఓ పాజిటివ్‌ కేసంట.. ఇదిగో ఈ పక్క వీధిలో కూడా వచ్చిందట..‘ఏవండీ మనకూ వస్తుందా? మనకేమన్నా అయితే అప్పుడు మన పిల్లల సంగతేంటి?’ అని భర్తతో భయాందోళన వ్యక్తం చేసిన మహిళలెందరో..ఏ టీవీ చానల్‌ పెట్టినా కరోనా వార్తలే.. చర్చోపచర్చలు.. వాట్సాప్‌ చూస్తే చాలు.. అవే వార్తలు.. కుప్పలు తెప్పలు.. యూట్యూబ్‌ చానళ్ల వార్తలు చూస్తుంటే బీపీ పెరిగిపోతోంది.

కరోనా కోణం–2
అవును.. కరోనా వైరస్‌ మన దేశంలోకి వచ్చింది. మన ఊరికి కూడా వచ్చింది. మనకు తెలిసినోళ్లకు కూడా వచ్చింది. వాళ్లందరూ 14 రోజుల నుంచి 20 రోజుల దాకా వైద్యం పొంది తిరిగి ఇల్లు చేరుకున్నారు. కరోనా సోకిందనగానే భయపడింది వాస్తవమే అయినా భయపడినంత ఏమీ జరగలేదని చెబుతున్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే చాలు.. అదే మనల్ని బయట పడేస్తుందంటున్నారు. బీ పాజిటివ్‌ అని ధైర్యం చెబుతున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారించాక, ఆసుపత్రిలో గడిపిన తీరు, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, సహాయం, అందిన వైద్యం, వసతి, భోజనం వెరసి ఎంతో మంది క్షేమంగా ఇల్లు చేరారు. వారంతా ‘మేం కరోనాపై గెలిచాం’ అంటున్నారు. ఆ సంగతులేవో వారి మాటల్లోనే.. 

వయో వృద్ధుని విజయం
నా పేరు ఆర్‌.సుల్తాన్‌. నా వయస్సు 84 ఏళ్లు. నా కుమారుడు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చాడు. కడప రిమ్స్‌లో మార్చి నెలాఖరులో పరీక్షలు చేయడంతో నా కుమారుడితో పాటు నాకూ కరోనా వచ్చినట్లు నిర్దారించారు. తిరుపతి స్విమ్స్‌లో 20 రోజులపాటు ఉన్నాను. గొంతునొప్పి వల్ల ఆహారాన్ని తీసుకోలేకపోయాను. కేవలం మూడు రోజుల్లో గొంతునొప్పిని పోగొట్టారు. షుగర్‌ వల్ల సమస్య అవుతుందేమో అనుకున్నా. కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. మొన్ననే ఇంటికి చేరాను. 

 నిర్భయంగా చికిత్స చేయించుకోండి 
పంజాబ్‌లోని జలంధర్‌లో ఎంటెక్‌ చదువుతున్న నేను మార్చి 1న మా ఊరికి వచ్చా. కొద్దిరోజుల తర్వాత కరోనా లక్షణాలు కన్పించాయి. దీంతో స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకున్నా. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మార్చి 16న కర్నూలులోని విశ్వభారతి కోవిడ్‌ ఆసుపత్రిలో చేరా. అక్కడ బాగా చూసుకున్నారు. మంచి చికిత్స అందించారు. సంపూర్ణ ఆరోగ్యంతో నేడు (శనివారం) డిశ్చార్జ్‌ అయ్యా. కరోనా అంటే భయపడాల్సిన అవసరమే లేదు. లక్షణాలు ఉన్నవారు నిర్భయంగా చికిత్స చేయించుకోండి.  
– యువరాజు, డోన్, కర్నూలు జిల్లా

 స్వచ్ఛంద పరీక్షలు చేయించుకుంటే మంచిది
నా వయసు 62 ఏళ్లు. నేను గత నెల 13న ఢిల్లీకి వెళ్లి 18న తిరిగొచ్చాను. అదే నెల 29న కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ క్వారంటైన్‌కు వెళ్లాను. 30వ తేదీ కోవిడ్‌–19 పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ వచ్చింది. ఈ నెల 2న నంద్యాల సమీపంలోని శాంతిరామ్‌ వైద్యశాలలో చేర్చారు. చికిత్స సమయంలో అన్ని సౌకర్యాలు కల్పించారు. భోజనం, ఇతర సదుపాయాలన్నీ చాలా బావున్నాయి. మంచి వైద్యం అందించారు. ఈ నెల 20వ తేదీన డిశ్చార్జ్‌ చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు, వైద్యులు, అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. భయాందోళన అవసరం లేదు.
–షేక్‌ సయ్యద్‌ సాహెబ్, బనగానపల్లె, కర్నూలు జిల్లా  

 కార్పొరేటు స్థాయి సౌకర్యాలు
మార్చిలో ఢిల్లీ నుంచి రైలులో వచ్చాను. ఏప్రిల్‌ 1వ తేదీన వైద్య పరీక్షలు చేయించుకున్నాను. పాజిటివ్‌ రావడంతో ఆసుపత్రిలో చేరి వైద్యం పొందాను. ప్రభుత్వం కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా సౌకర్యాలు కల్పించింది. వైద్య చికిత్స కూడా అదే స్థాయిలో అందించింది. మంచి పౌష్టికాహారం సమకూర్చింది. వైద్యులు ఎంతో సహనంతో ప్రతి పాజిటివ్‌ వ్యక్తికి ప్రత్యేక శ్రద్ధతో వైద్యం అందించారు. మానసిక వైద్యులు సైతం నాకు కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో నాలో ఉన్న భయం పోయింది. వైద్య సిబ్బంది, శానిటైజేషన్‌ కార్మికులు చేస్తున్న సేవ అమోఘం. ఆప్యాయంగా పలకరిస్తూ సేవ చేశారు. ప్రభుత్వానికి, వైద్యులకు నేను రుణపడి వున్నాను. నేను బుధవారం డిశ్చార్జ్‌ అయ్యాను.
– షేక్‌ యూనస్, రేణిగుంట, చిత్తూరు జిల్లా

 వైద్యుల సేవలు భేష్‌
నాపేరు ఆండాళ్‌. చిత్తూరు జిల్లా తిరుపతి యశోదనగర్‌లో కాపురం ఉంటాను. అదిలాబాద్‌లో బంధువుల పెళ్లికి వెళ్లి మార్చి 19వ తేదీన రైలులో తిరిగి వచ్చాను. ఆ రైలులో మర్కజ్‌ నుంచి కొంత మంది వచ్చినట్లు తర్వాత తెలిసింది. ట్రైన్‌లో సింక్‌ వాడకంలోగానీ, అటూ ఇటూ తిరిగినప్పుడు గానీ నాకు వైరస్‌ సోకి ఉండొచ్చు. మార్చి 20న తిరుపతికి చేరుకున్నాను. ఎందుకో అనుమానం వచ్చి కరోనా టెస్ట్‌ చేయించుకున్నాను. పాజిటివ్‌ రావడంతో స్విమ్స్‌ కోవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందాను. వైద్యుల సేవలు మరచిపోలేనివి. నిత్యం పర్యవేక్షణతో వైద్యం అందించిన డాక్టర్లకు జోహార్లు. ఏప్రిల్‌ 25 శనివారం డిశ్చార్జ్‌ అయి ఇంటికి చేరుకున్నాను. 

మనో బలాన్ని మించిన మందు లేదు  
నాపేరు షేక్‌ మస్తాన్‌వలి. గుంటూరు జిల్లా మండల కేంద్రమైన క్రోసూరుకు చెందిన నన్ను గత నెల 29న ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చేర్పించారు. నేను అప్పుడు, ఇప్పుడూ ఆరోగ్యంగానే ఉన్నాను. కానీ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిందన్నారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో మూడుసార్లు పరీక్షలు చేశారు. నెగటివ్‌ వచ్చింది. దాంతో ఇంటికి పంపించారు. ప్రతిరోజు టిఫిన్, భోజనం అందించారు. బాగా చూసుకున్నారు. వచ్చేటప్పుడు రూ.2 వేలు నగదు ఇచ్చారు. ఇప్పటికీ నాలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి పది రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రావద్దన్నారు. ప్రతి ఒక్కరూ డాక్టర్లు సూచించినట్లు భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఎటువంటి ప్రమాదం దరి చేరదు. ప్రశాంతంగా, ధైర్యంగా ఉండటం అలవర్చుకోవాలి. ఆ మనోబలమే మనకు ఆరోగ్యాన్నిస్తుంది.

కోలుకుంటాననుకోలేదు..
నా పేరు మురళీకృష్ణ. నేను ఢిల్లీకి పనిమీద వెళ్లి, మా ప్రొద్దుటూరు నివాసులైన ముస్లిం సోదరులతో కలిసి అదే ట్రైన్‌లో వచ్చాను. గత నెల 31వ తేదీన కోవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. మరుసటి రోజున (ఏప్రిల్‌1)న ఫాతిమా వైద్య కళాశాలలో చేర్పించారు. అప్పటి నుంచి వైద్యులు, వైద్య సిబ్బంది బాగా చూసుకున్నారు.  అయినా ఇల్లు చేరుతానా.. లేదా అనే అనుమానంతో బిక్కుబిక్కు మంటూ రోజులు లెక్కపెట్టాను. రోజులు గడిచేకొద్దీ ధైర్యం పెరిగింది. మూడు పూటలా పౌష్టికాహారం అందించారు. పరీక్షల్లో నెగిటివ్‌ రావడంతో ఈనెల 16న డిశ్చార్జ్‌ చేశారు. పోషకాహార కిట్‌తో పాటు, రూ.2000 నగదు ఇచ్చారు. ఇంకా కొన్నాళ్ల పాటు ఇంట్లోంచి బయటకు వెళ్లను.     
–  మురళీకృష్ణ, ప్రొద్దుటూరు, వైఎస్‌ఆర్‌ జిల్లా.  

బిడ్డకు సోకని వైరస్‌

మా బంధువు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చాడు. దీంతో మమ్మల్ని ఏప్రిల్‌ 6వ తేది నగరిలో మా స్వాబ్స్‌ తీసి తిరుపతికి పంపించారు. 8వ తేది పాజిటివ్‌ అని రావడంతో గుండె ఆగినంత పని అయింది. మమ్మల్ని చిత్తూరు కోవిడ్‌ ఆస్పత్రికి పంపించారు. చిత్తూరులో తొలుత అడ్మిట్‌ అయింది మేమే. కరోనా గురించి వింటున్న పుకార్లు చూసి చాలా భయమేసింది. మాకు ఏమైనా అయితే మాతో పాటు ఉన్న ఏడాదిన్నర చిన్నారి భవిష్యత్‌ ఏలా అని రోజు బాధపడేవాళ్లం. కనిపించని దేవుడి ఆశీస్సులు, కనిపిస్తున్న వైద్యులు, సిబ్బంది చికిత్సలు, సౌకర్యాలతో మాకు బాగా అయింది. రోజూ పౌష్టికాహారం పెట్టారు. డాక్టర్లు, నర్సులు ప్రేమతో మాట్లాడేవారు. మాతో పాటే ఉన్న చిన్నారికి పాజిటివ్‌ రాకపోవడం భగవంతుడి దయ అనిపిస్తోంది. మేం శనివారం డిశ్చార్జి అయ్యాం.    
– చిత్తూరులోని ఐసోలేషన్‌ వార్డు నుంచి డిశ్చార్జి అయిన రెహానా (బిడ్డతో), జమీబీ

 వైద్యం చేయించుకోబట్టే బయటపడ్డా..
ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాను. మొదట్లో నాకు ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. అధికారులు నాకు గత నెల 24న వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. వెంటనే ట్రీట్‌మెంట్‌ ప్రారంభించారు. 20 రోజులపాటు వైద్యశాలలోనే ఉన్నా. మంచి వైద్యం, మంచి ఆహారం అందజేశారు. అక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈనెల 15న ఒకసారి, 18న మరోసారి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. దీంతో నన్ను డిశ్చార్చ్‌ చేశారు. వైద్యశాలకు వెళ్లి మంచి వైద్యం చేయించుకో బట్టే కరోనా బారినుండి బయట పడగలిగాను. వచ్చేటప్పుడు పౌష్టిక విలువలతో కూడిన ఆహారం తీసుకునేందుకు రూ.2000 ఇచ్చారు. 
– ఓ వ్యక్తి, అచ్చంపేట, పెదకూరపాడు మండలం, గుంటూరు

హ్యాట్సాఫ్‌ టు సీఎం 
హిందూపురానికి చెందిన 60 ఏళ్ల(జిల్లాలో నమోదైన మూడవ కేసు) వృద్ధుడు ఈ నెల 4న మరణించాడు. ఆయనకు కోవిడ్‌ ఐసీయూలో ఉంచి సేవలందించాం. ఆ బృందంలో నేను ఓ వైద్యుడిని. మృతునికి పరీక్షలు చేయగా కోవిడ్‌గా తేలింది. దీంతో కాస్త భయపడ్డా. ముందుగా నాకు కోవిడ్‌ పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. కానీ ఎలాంటి కోవిడ్‌ లక్షణాలు లేవు. కలెక్టర్‌ గంధం చంద్రుడు, తదితరులు జిల్లాలోని కిమ్స్‌–సవీరాలో అడ్మిట్‌ చేశారు. 14 రోజుల పాటు అక్కడి వైద్యులు మెరుగైన సేవలందించారు. సీఎం పేషీ నుంచి డాక్టర్‌ హరికృష్ణ తదితరులు ఫోన్‌లో మాట్లాడి ధైర్యం నింపారు.  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కోవిడ్‌ వ్యాప్తి నివారణకు చేస్తున్న కృషి ఎంతో గొప్పది. సీఎం స్థాయిలో ఎప్పటికప్పుడు పాజిటివ్‌ కేసుల ఆరోగ్య పరిస్థితి తెలుకున్నారు. నేను ఈ నెల 22న డిశ్చార్జ్‌ అయ్యా. హ్యాట్స్‌ ఆఫ్‌ టు సీఎం. 
– డాక్టర్‌ విష్ణుభాస్కర్, సీనియర్‌ రెసిడెంట్, సర్వజనాస్పత్రి, అనంతపురం 

కార్పొరేట్‌ వైద్యాన్ని అందించారు 
కరోనా వైరస్‌ సోకిన ఓ వృద్ధుడికి సేవలందించడంతో నాకూ వైరస్‌ సోకింది. కోవిడ్‌ అనగానే చాలా భయపడ్డా. మా కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ నెల 8న కిమ్స్‌–సవీరాకు పంపారు. అక్కడ మంచి వైద్యాన్ని అందించారు. వైద్యులు, సిబ్బంది ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అధికారులు ఫోన్‌లో మాట్లాడి మనోధైర్యాన్ని నింపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే త్వరగా కోలుకున్నాం. 
– నీరజ, స్టాఫ్‌నర్సు, సర్వజనాస్పత్రి, అనంతపురం

వైద్యులు, నర్సుల సేవలు అభినందనీయం  
మేం ఢిల్లీకి వెళ్లి వచ్చాం. మాకు వ్యాధి లక్షణాలు ఏమీ బయటపడలేదు. కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు చెప్పడంతో మార్చి 31న మమ్మల్ని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. పాజిటివ్‌ రావడంతో ప్రత్యేక వైద్య చికిత్స అందించారు. వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మంచి చికిత్స అందించారు. నాణ్యమైన పౌష్టికాహారం ఇచ్చారు. మానసికంగా ధైర్యాన్నిచ్చారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం, పౌష్టికాహారం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందించారు. కరోనా వైరస్‌ పట్ల ప్రజలు భయపడకుండా సొంతంగా ఎవరికి వారే జాగ్రత్తలు పాటించాలి. ఏలూరు కోవిడ్‌ ఆస్పత్రిలో సదుపాయాలు మంచిగా ఏర్పాటు చేశారు. వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, ఇతర సిబ్బంది సేవలు మరిచిపోలేం.  
– నసీరుద్దీన్, (ల్యాబ్‌ టెక్నిషియన్, ఏలూరు) ఎస్‌కే మహర్, భీమవరం 

వైద్యుల కృషితోనే కోలుకున్నాం
మేము ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చాం. వైద్య శాఖ అధికారులు కరోనా వార్డుకు తరలించి పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌గా గుర్తించారు. వారికి అన్ని విధాలుగా సహకరించాం. వైద్యులు బాగా చూసుకున్నారు. పారిశుధ్య సిబ్బంది సేవలు ఎనలేనివి. ప్రభుత్వం మంచి ఆహారంతో పాటు పండ్లు కూడా అందజేసింది. వైద్యులు ధైర్యం చెప్పారు. కచ్చితంగా కోలుకుంటారని భరోసా ఇచ్చారు. మంచి వైద్యం అందించారు. ప్రతిరోజు ఆరోగ్య జాగ్రత్తలు సూచించారు. బీపీ, జ్వరం ఉందో లేదో చూసే వారు. రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు మంచి ఆహారం అందించారు. ఫలితంగా క్రమేణా కోలుకున్నాం. మేము ఇంటికి తిరిగి క్షేమంగా వెళ్లామంటే వైద్యులు, నర్సులు అందించిన సేవలే ప్రధాన కారణం. 
–ఎస్‌కే మస్తాన్‌ (60), అబ్దుల్‌ రెహమాన్‌ (60)– నెల్లూరు  

భరోసా ఇచ్చారు
ప్రార్థనల కోసం గాజువాక, లంకెలపాలెం, పరవాడకు వెళ్లాను. అక్కడకు మర్కజ్‌ నుంచి వచ్చిన వారితో ప్రార్థనల్లో పాల్గొన్నాను. ఆ తరువాత జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడం ఇబ్బందితో అనిపిస్తే అనుమానం వచ్చి నాకు నేనే ప్రభుత్వ ఛాతి ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నాను. అందులో పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. 21 రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నాను. వైద్యులు స్నేహపూర్వకంగా ఉన్నారు. మంచి వైద్యం అందించడంతో నయమవుతుందని భరోసా ఇచ్చారు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. 
– ఎస్‌.కె.రెహ్మాన్, పూర్ణామార్కెట్, విశాఖపట్నం.

ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు
మెకానిక్‌గా పని చేసే నేను ఢిల్లీ వెళ్లి రాగానే కరోనా సోకింది. ఒంగోలు కిమ్స్‌ వైద్యశాలలో మంచి వైద్యం అందించారు. అనంతరం రెండు సార్లు పరీక్షించినా నెగిటివ్‌గా నివేదికలు రావడంతో శనివారం డిశ్చార్జి చేశారు. నాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా 25 రోజుల పాటు వైద్య చికిత్సను అందించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. మంచి భోజనం అందించారు. వైద్యులు, నర్సులు ఆప్యాయంగా మెలిగారు. వారందరి సేవల వల్లే కోలుకున్నా.
 – ఎస్‌డి జాఫర్‌ జిలానీ, పీర్లమాన్యం, ఒంగోలు

ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం
కరోనా పాజిటివ్‌ వచ్చిన నన్ను మార్చి 21న కాకినాడ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పౌష్టికాహారం, మందులు, దుస్తులు అందించారు. ప్రభుత్వం మెరుగైన వైద్యం, సౌకర్యాలు కల్పించడంతో త్వరితగతిన కోలుకున్నాను. పాజిటివ్‌ ఉన్న వ్యక్తితో విమానంలో నాలుగు గంటలు ప్రయాణించడం వల్ల నాకు కూడా కరోనా సోకింది. 14 రోజులు క్వారంటైన్‌లో ఉండడం వల్ల వైరస్‌ నుంచి బయట పడవచ్చు. మన రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఇలాంటి వైద్య సేవలు లభిస్తాయని ఇప్పుడే తెలిసింది. 
– పెండ్యాల హర్ష, రాజమహేంద్రవరం

మంచిగా రెస్పాండ్‌ అయ్యారు
నేను స్వీడన్‌లో ఉద్యోగం చేస్తున్నా. అక్కడ కరోనా వైరస్‌ సోకుతుండటంతో సొంత ఊరికి వచ్చేశా. వచ్చినప్పుడు బాగానే ఉంది. పది రోజులకు జ్వరం, దగ్గు రావడంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. 17 రోజుల పాటు చికిత్స అందించారు. రెండు సార్లు పరీక్ష చేసి నెగిటివ్‌ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అక్కడ వైద్యులు తరచూ వచ్చి పరీక్షలు చేయడంతో పాటు, అధికారులు ఫోన్‌లో ఆరోగ్య విషయాలు తెలుసుకునే వారు. సౌకర్యాలన్నీ బాగా కల్పించారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది.   
 – ఓ యువకుడు, విజయవాడ

చాలా బాగా చూశారు
నేను మక్కా వెళ్లి వచ్చాను. అక్కడకు వెళ్లి వచ్చినప్పుడు బాగానే ఉంది. కొన్ని రోజులకు జ్వరం రావడంతో మార్చి 28న విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లాను. అక్కడి వైద్యులు పరీక్ష చేసి నాకు పాజిటివ్‌ వచ్చిందని తేల్చారు. అక్కడే చికిత్స అందించారు. నా వయస్సు 65 సంవత్సరాలు. షుగర్‌ ఉంది. దీంతో వైద్యులు ఒక్కోసారి రెండు గంటలకు ఒకసారి వచ్చి పరీక్ష చేసేవారు. తొలుత ప్రభుత్వాస్పత్రి అంటే బాగా చూడరు అనుకున్నా. కానీ అక్కడ చికిత్స పొందిన తర్వాత తెలిసింది. వారు చాలా మంచి వైద్యం చేసారని. 15 రోజుల చికిత్స అనంతరం రెండుసార్లు పరీక్షలు చేసి, 16వ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.     
– జమ్‌షీర్, వ్యాపారి, విజయవాడ

ఆలస్యంగా మేల్కొన్న కేసుల్లోనే..
ఇప్పటి వరకు మృతి చెందిన వారి కేసులు పరిశీలిస్తే వైరస్‌ సోకడంతో పాటు నియంత్రణలో లేని మధుమేహం, అధిక రక్తపోటు, మూత్ర పిండాల వ్యాధులు కలిగి.. చివరి క్షణం వరకు నిర్లక్ష్యం చేయడం వల్లే మరణాలు సంభవించినట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కరోనా వల్ల ఏ ఒక్కరు కూడా మృతి చెందకూడదనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పని చేస్తోంది. అందుకే లక్షణాలు ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి త్వరితగతిన చికిత్స పొందాలంటోంది. చివరి క్షణం వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించి సీరియస్‌ అయ్యాక ఆసుపత్రులకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని మరీ మరీ చెబుతోంది. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉంది. 
– సాక్షి నెట్‌వర్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement