మాట్లాడుతున్న సీపీఐ ఏపీ కార్యదర్శి
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హత్యాయత్నం ఘటనపై తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సంస్కారం కాదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదని సీపీఐ ఏపీ కార్యదర్శి కే రామకృష్ణ హితవు పలికారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రతిపక్ష నేతపై ఇలాంటి దాడి జరుగుతుందని ఊహించలేదని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు తీరు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. జగన్‌పై దాడి జరిగిన ఐదు గంటల తర్వాత ముఖ్యమంత్రి మంత్రి స్పందించటం సరికాదన్నారు. మీడియా సమావేశంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సభ్యత కాదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఎంతో, ప్రతిపక్ష నేత కూడా అంతేనని చెప్పారు. సీఎం చంద్రబాబు.. వైఎస్ జగన్‌ను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కనీసం ఫోన్లో పరామర్శించే తీరిక చంద్రబాబుకు లేదా అని అడిగారు.
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరగాలని కోరారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘ఏపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని వైఎస్సార్ సీపీ అంటోంది. విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటనపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. స్వతంత్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలి. వైఎస్ జగన్‌పై దాడి చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలి. వైఎస్ జగన్ హత్యాయత్నం వెనుక ఎవరున్నారో నిగ్గుతేల్చాలి. సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు వైఎస్ జగన్ హత్యాయత్నం కేసులో ఎందుకు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నార’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment