కొత్తగూడెం, న్యూస్‌లైన్: కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కాంగ్రెస్, సీపీఐ నాయకుల ఆధిపత్య పోరుకు వేదికగా నిలిచింది. దీనికి తోడు సమస్యలు పరిష్కరించాలని వివిధ పార్టీల నాయకులు పట్టుబట్టడంతో అధికారులు హడావుడిగా కార్యక్రమాన్ని ముగించారు. మున్సిపల్ కమిషనర్ గుర్రం రవి అధ్యక్షతన జరిగిన ఈ సభ ప్రారంభంలోనే సీపీఐ నాయకుల నినాదాలు మిన్నంటాయి. భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు కమిషనర్ హామీ ఇవ్వడంతో శాంతించారు. అయితే ఆ తర్వాత సమైక్యాంధ్రకు మద్దతు పలుకుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో తొలగించాలని మళ్లీ పట్టుబట్టారు. ఇలా సీపీఐ, టీడీపీ నాయకులు వేదిక వద్దకు దూసుకురావడంతో కాసేపు గందరగోళం నెలకొంది.
సీపీఐ, కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం...
రచ్చబండ సభ ఆద్యంతం సీపీఐ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదాలతోనే సాగింది. రచ్చబండ కమిటీ సభ్యులైన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల ఉమారాణి, కాంగ్రెస్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎం.ఎ.రజాక్ మాట్లాడుతున్నంత సేపు సీపీఐ కార్యకర్తలు నినాదాలు చేయడంతో అసహనం వ్యక్తం చేసిన రజాక్ తన ప్రసంగం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వేదికపైనే బైఠాయించారు. దీంతో సీపీఐ నాయకులు కూడా వేదిక వైపు దూసుకొచ్చారు. ఇలా సీపీఐ, కాంగ్రెస్ నాయకులు పరస్పరం నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు సీపీఐ కార్యకర్తలను వేదికపైనుంచి లాగి బయటపడేయగా, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జోక్యం చేసుకుని కాసేపు నిశ్శబ్దంగా ఉండాలని కార్యకర్తలను సముదాయించారు. అనంతరం రజాక్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను కొందరు సొమ్ము చేసుకుంటున్నారని, దీనిపై అధికారులు దృష్టి సారించాలని కోరారు.
క్రమబద్ధీకరణ పట్టాల కోసం ఆందోళన..
పట్టణంలో క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గతంలో ఇందిరమ్మ ఫేస్ -1, 2 ద్వారా మంజూరైన ఇళ్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన వార్డులలోనే ఇచ్చారని, మిగిలిన వార్డులకు ఇవ్వడం లేదని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కె.సాబీర్‌పాషా, నాయకులు బండి భాస్కర్, సలిగంటి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నాయకులు తాండ్ర నాగబాబు, లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు సాధిక్‌పాష, టీడీపీ మాజీ కౌన్సిలర్ రావి రాంబాబు ఆందోళన చేశారు. కాంగ్రెస్ వేదికగానే రచ్చబండ కార్యక్రమం రూపొందిందని ఆరోపించారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో వేదిక ప్రాంగణం వద్దకు దూసుకురాగా, పోలీసులు వారిని బయటకు తీసుకెళ్లారు.
ఇళ్ల స్థలాల కోసం సీపీఎం ఆందోళన...
పాత కొత్తగూడెంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలం లో వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఇలా అన్ని పార్టీలకు చెందిన ఆందోళనకారులతోనే వేదిక నిండిపోయింది. వెంటనే స్పందించిన కొత్తగూడెం ఆర్డీవో డి.అమయ్‌కుమార్ ఇళ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మరోవైపు దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజలు భారీగా రావడంతో ఆ ప్రాంగణమంతా గందరగోళం గా మారింది. అనంతరం దరఖాస్తులు తీసుకున్న అధికారులు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, బంగారుతల్లి పథ కం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు.
భారీ పోలీసు బందోబస్తు...
రచ్చబండను సజావుగా నిర్వహించేందుకు పోలీసు లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేదిక చుట్టూ రోప్‌పార్టీ బృందాలు పహరా కాశాయి. ట్రైనీ డీఎస్పీ రావిలాల వెంకటేశ్వర్లు, వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ సీఐలు ఎ.నరేష్‌కుమార్, వెంకటస్వామి, సాయిసుధాకర్ బందోబస్తును పర్యవేక్షించారు.
ఆందోళనల నడుమ సాగిన రచ్చబండ
Published Thu, Nov 21 2013 3:15 AM | Last Updated on Mon, Aug 13 2018 6:24 PM
Advertisement
Advertisement