సాక్షి, విజయవాడ : సదావర్తి సత్రం భూములను రూ.22కోట్లకే కొట్టేయాలని తెలుగుదేశం పార్టీ యత్నించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ ఎమ‍్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి జోక్యంతో ప్రభుత్వానికి రూ.60కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. సక్రమంగా వేలం నిర్వహించి ఉంటే ప్రభుత్వ ధర రూ.350 కోట్ల ఆదాయం వచ్చేదని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం తమకేనని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నంద్యాల, కాకినాడలో టీడీపీ నేతలు డబ్బులిచ్చి ఓట్లు వేయించుకున్న దుస్థితి చంద్రబాబుదన్నారు. వంశధార నిర్వాసితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న రామకృష్ణ... నిర్వాసితుల పరామర్శకు వెళ్లిన సీపీఎం మధును అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో భూ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ వచ్చే నెల మూడ్రోజుల పాట భారీ ధర్నా చేపట్టనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు.