సాక్షి, గుంతకల్లు: రైల్ రోకో కేసులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు వారం రోజుల రిమాండ్ విధిస్తూ గుంతకల్లు రైల్వేకోర్టు స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ టి.వెంకటేశ్వర్లు తీర్పు చెప్పారు. రైతాంగ సమస్యలపై కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి 2008 జూలై 7న అనంతపురం రైల్వేస్టేషన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాటమయ్య, జాఫర్‌లు రైల్ రోకో చేశారు. ఈ ఘటనపై ఆర్‌పీఎఫ్ పోలీసులు రైల్వే యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.
గుంతకల్లు రైల్వే కోర్టు స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ కోర్టులో తొమ్మిదేళ్ల పాటు విచారణ కొనసాగగా..2017లో కాటమయ్య, జాఫర్‌ల పేర్లను న్యాయస్థానం కొట్టివేసింది. కేసు వాదనలు జరుగుతున్న సమయంలో రామకృష్ణ కోర్టుకు సక్రమంగా హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి 2017 జూన్ 15న నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దాన్ని కూడా రామకృష్ణ తీసుకోలేదు. ఈ క్రమంలో బుధవారం రైల్వేకోర్టులో రామకృష్ణ హాజరయ్యారు. ఆయన నిర్లక్ష్య వైఖరికి వారం రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రామకృష్ణను అనంతపురం సబ్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment