బాబూ...నీకు రాజకీయ సమాధి తప్పదు
రైతుల ఉసురు పోసుకున్న ఏ రాజకీయ నాయకుడు బాగు పడలేదు ... రుణమాఫీ పేరుతో రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడూ నీకు రాజకీయ సమాధి కాక తప్పదంటూ ఎర్రదండు హెచ్చరించింది. సీపీఎం జిల్లా పదకొండో మహాసభల
సందర్భంగా ఒంగోలులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న వక్తలు బాబు పాలనపై నిప్పులు చెరిగారు.
ఒంగోలు టౌన్: సీపీఎం జెండాలతో ఒంగోలు నగరం ఎర్రబారింది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ నాయకులు, కార్యకర్తలు ఎర్రదండులా ముందుకు కదిలారు. సీపీఎం జిల్లా 11వ మహాసభల ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం ఈ దృశ్యాలు కనిపించాయి. స్థానిక సంతపేట వద్దగల విద్యుత్ ఎస్‌ఈ కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రదర్శన నెల్లూరు బస్టాండు, ప్రకాశం భవనం, మిరియాలపాలెం సెంటర్, ట్రంకురోడ్డు, పాత కూరగాయల మార్కెట్, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ మీదుగా సభాస్థలి అయిన అద్దంకి బస్టాండు వరకు సాగింది.
ఆకట్టుకున్న కళాప్రదర్శనలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాస్క్‌లను ధరించిన కళాకారులు వారి వ్యవహారశైలి ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రద ర్శనలు చే పట్టారు. మతోన్మాద ముసుగు ధరించిన వ్యక్తికి చిరుత పులి మాస్క్, కార్పొరేట్ శక్తులకు కుక్క మాస్క్ ధరింపజేసి వారి మధ్యలో ప్రధాని చిద్విలాసంతో కూడిన మాస్క్ ధరించిన వ్యక్తి ముందుకు సాగాడు. రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని ఎండగడుతూ చేసిన ప్రదర్శన ఆకట్టుకొంది. కర్రకు రుణమాఫీ డబ్బు సంచి వేలాడదీశారు. దానిని రైతు అందుకునే సమయంలో చంద్రబాబు వేషధారణలో ఉన్న వ్యక్తి దానిని అందకుండా చేశాడు. సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి. శ్రీనివాసరావు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
పదకొండు మంది మహిళలు
సీపీఎం జిల్లా 11వ మహాసభల సందర్భంగా పదకొండు మంది మహిళలు పార్టీ జెండాలు, ఎర్ర చీరలు ధరించి ఒకే వరుసలో ముందుకు కదిలారు. కోలాట ప్రదర్శన, డప్పుల నృత్యంతో ప్రజానాట్యమండలి కళాకారులు అలరించారు. బహిరంగ సభ వేదికపై మెజీషియన్ బి. రాములు తెల్లని పేపరుపై మ్యాజిక్ చేస్తూ స్వాగతం పలికారు. ఖాళీ ఫ్రేమ్‌పై సీపీఎం మాజీ ఎమ్మెల్యే తవనం చెంచయ్య చిత్రపటం రావడం.. పోరాటాల్లో కమ్యూనిస్టులు చిందించే ఎర్రటి రక్తం ద్వారా పూలు రావడం వంటి ప్రదర్శనలు అబ్బుర పరిచారుు.
చంద్రబాబు రాజకీయ సమాధి కాక తప్పదు
రుణమాఫీ పేరుతో రైతుల జీవితాలతో చెలగాటం అడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ సమాధి కాక తప్పదని సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి. శ్రీనివాసరావు అన్నారు. కార్పొరేట్ జపం చేస్తున్న చంద్రబాబును వారు కూడా అదేవిధంగా చేస్తారన్నారు. స్థానిక అద్దంకి బస్టాండు సెంటర్‌లో జరిగిన సీసీఎం జిల్లా మహాసభల బహిరంగ సభలో ప్రసంగించారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు అసలు రూపం ప్రమాణ స్వీకారం రోజున బయటపడిందన్నారు. కౌలు రైతుల రుణమాఫీ గురించి మాట్లాడటంలేని మండిపడ్డారు. రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ఇంజినీరింగ్ నిరుద్యోగులున్నారని, రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం వెచ్చించే సమయంలో ఒక్క శాతం నిరుద్యోగులకు కేటాయిస్తే వారి సమస్య తీరుతుందన్నారు. మహాసభకు సీపీఎం జిల్లా కార్యదర్శి జాలా అంజయ్య అధ్యక్షత వహించారు.
భూమి ఉంటేనే రైతుకు ఆత్మగౌరవం
వ్యవసాయ భూమి ఉంటేనే రైతుకు ఆత్మగౌరవం ఉంటుందని, అలాంటిది రాజధాని పేరుతో చంద్రబాబు రైతుల నుంచి బలవంతంగా భూమి లాక్కొని వారు.. భిక్షం ఎత్తుకునేలా చేస్తున్నారని శ్రీనివాసరావు విమర్శించారు. భూసేకరణ చట్టాన్ని భూ సమీకరణ చట్టంగా మార్చిన ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం రాజధాని పేరుతో ముప్పై వేల ఎకరాలు సేకరిస్తున్నారన్నారు. గతంలో నారాయణ అన్న మాటను స్మరిస్తే భక్తులకు మోక్షం కలిగేదని, ప్రస్తుతం చంద్రబాబు క్యాబినెట్‌లో ఉన్న మంత్రి నారాయణ పేరు తలచుకుంటే పాపాలు అంటుకుంటాయని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రజలకు ఏమి సేవ చేశారని అంత ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో మాఫియా కేంద్రంగా చేయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రధానమంత్రి ఇక్కడి ప్రజల కోసం కాకుండా విదేశీయుల కోసం స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నారన్నారు. సామాజికంగా అన్ని వర్గాల వారిని అణచివేసేవిధంగా ఆర్‌ఎస్‌ఎస్ వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఏప్రిల్‌లో విశాఖపట్నంలో జరగనున్న సీపీఎం జాతీయ మహాసభల్లో భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తామని చెప్పారు. దేశ ప్రజలకు వామపక్షాలు తప్పితే మరో ప్రత్యామ్నాయం లేదనే విధంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా నాయకులు పూనాటి ఆంజనేయులు, ముప్పరాజు కోటయ్య, ఎన్.ప్రభుదాస్, సయ్యద్ హనీఫ్, జి. రమేష్, దామా శ్రీనివాసులు, బి. వెంకట్రావు పాల్గొన్నారు.