
‘కోరంగి’ భూముల్లో ఉద్రిక్తత
- ఆందోళనకారులపై లాఠీచార్జి
- 50 మంది అరెస్టు
తాళ్లరేవు : కోరంగి కంపెనీకి చెందిన భూములను పేదలకు పంచాలని కోరుతూ సీపీఎం పార్టీ చేస్తున్న భూ పోరాటం గురువారం తీవ్ర ఉద్రిక్తతగా మారి లాఠీచార్జికి దారి తీసింది. ఈ సందర్భంగా పలువురు నాయకులతో పాటు సుమారు 50 మంది గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ తూర్పుపేట గ్రామంలో వివాదాస్పదంగా మారిన కోరంగి కంపెనీ భూముల వద్ద గలాటా జరిగింది. వివరాలిలా ఉన్నాయి. వివాదాస్పద భూముల్లో కొంత భాగాన్ని ఇటీవల సీపీఎం స్వాధీనం చేసుకుని వరి సాగు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ భూములు యానాంకు చెందిన బులుసు సత్యనారాయణ మూర్తి, వెంకాయమ్మలకు చెందనవిగా కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భూ యజమానులు ఆయా భూముల్లో వరిసాగు పనులు చేపట్టారు.
దీనిని భూ పోరాటం చేస్తున్న నాయకులు, గ్రామస్తులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. తమ భూముల్లో పనులు చేసుకోకుండా పలువురు అడ్డుకుంటున్నారని భూ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చే శారు. కాకినాడ రూరల్ సీఐ పవన్ కిషోర్‌తో పాటు కాకినాడ 1 టౌన్ ఎస్సై బాలాజీ, కరప ఎస్సై వీరప్రతాప్, పెదపూడి ఎస్సై సుమంత్‌తో పాటు 40 మంది పోలీసుల బృందం ఆ ప్రాంతం వద్ద మోహరించింది. పోలీసుల సమక్షంలో భూ యజమానులు ట్రాక్టర్‌తో దమ్ము చేసేందుకు ప్రయత్నించగా ఆ పనులను పలువురు అడ్డుకున్నారు.
తమకు ఆర్డీఓ నుంచి ఎటువంటి సమాచారం అందలేదని, ఆ భూములు ప్రభుత్వానికే చెందినవంటూ వారు ఆందోళన చేపట్టారు. పలువురు నాయకులు, గ్రామస్తులు వరిచేలో ట్రాక్టర్‌తో చేపట్టిన పనులు నిలుపు చేసేందుకు యత్నించారు. డ్రైవర్ ట్రాక్టర్‌ను ఆపకపోవడంతో వారు దాడికి పాల్పడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. కొందరు ఎదురు తిరగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.సుమారు 50 మందిని అరెస్ట్ చేసి కోరంగి పోలీస్ స్టేషన్‌కు తరలించి దౌర్జన్యం కేసు నమోదు చేశారు. అరెస్ట్ అయిన వారిలో సీపీఎం మండల కార్యదర్శి టేకుమూడి ఈశ్వరరావు, నాయకుడు దుప్పి అదృష్టదీపుడు తదితరులు ఉన్నారు.
అక్రమ అరెస్ట్‌లు దారుణం
భూ పోరాటం చేస్తున్న సీపీఎం నాయకులు, గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని పార్టీ జిల్లా నాయకుడు దువ్వా శేషుబాబ్జీ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కేఎస్ శ్రీనివాస్, బేబీరాణి ఆరోపించారు. కోరంగి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నాయకులు, కార్యకర్తలను వారు పరామర్శించారు. తూర్పుపేట గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు దడాల బుజ్జిబాబు, డి.జగదీశ్వరరావు, పిల్లి సత్తిబాబు తదితరులు ఖండించారు. అన్యాయంగా అరెస్టు చేయడం తగదని వారు పేర్కొన్నారు.
దౌర్జన్యం చేసినందుకే అరెస్టులు : సీఐ
యానాంకు చెందిన బులుసు సత్యనారాయణమూర్తికి చెందిన భూముల్లో సీపీఎం నాయకులు అక్రమంగా ప్రవేశించారని కాకినాడ రూరల్ సీఐ పవన్‌కిషోర్ పేర్కొన్నారు. అక్కడ పనులు చేస్తున్న వారిపై దాడికి పాల్పడిన నేపథ్యంలో సీపీఎం నాయకులు, గ్రామస్తులను అరెస్టు చేశామని సీఐ తెలిపారు.