చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా, ప్రజలు పడుతున్న సమస్యలను పక్కదారి పట్టించి మభ్యపెట్టేందుకే నవనిర్మాణ దీక్షలు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు.
నెల్లూరు సెంట్రల్ : చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా, ప్రజలు పడుతున్న సమస్యలను పక్కదారి పట్టించి మభ్యపెట్టేందుకే నవనిర్మాణ దీక్షలు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు నగరంలోని సీపీఎం కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరువు తాండవం చేస్తుంటే చంద్రబాబుకు నవనిర్మాణ దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
తక్షణమే కరువు చర్యలు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే జూన్ చివరి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ప్రజల సమస్యలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం అనేది లేకుండా చేసేందుకు చంద్రబాబు కట్రపన్నుతున్నారని ఆరోపించారు. 2050 వరకు టీడీపీయే అధికారంలో ఉండాలనడం చంద్రబాబు అత్యాశకు పరాకాష్ట అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చేస్తున్న పనులు, మరో పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు తీరుపై రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఛీదరించుకుంటున్నారన్నారు.