మునగాల, న్యూస్‌లైన్: నల్లగొండ జిల్లా మునగాల మండ లం నర్సింహులగూడెంకు చెందిన సీపీఎం సర్పంచ్‌ను కొందరు దుండగులు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. గురువారం ఉదయం సర్పంచ్ జూలకంటి పులీందర్‌రెడ్డి(38) తన సహచరుడు అబ్రహంతో కలసి బైక్‌పై కోదాడకు బయలుదేరారు. కారులో వచ్చిన ఆరుగురు వ్యక్తులు మార్గమధ్యలో వీరి బైక్‌ను ఢీకొట్టడంతో వారిద్దరూ కిందపడిపోయారు. అనంతరం ప్రాణభయంతో చెరోవైపు పరుగెత్తారు. సర్పంచ్‌ను అర కిలోమీటరు వెంబడించిన దుండగులు దారుణంగా నరికారు. దీంతో ఎడమచేయి తెగిపోయింది. అనంతరం దుండగులు పరారయ్యారు.
ప్రత్యక్ష సాక్షులు పోలీసులు, 108కి సమాచారం అందించారు. ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న పులీందర్‌రెడ్డిని కోదాడ ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. గత ఏడాది జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పులీందర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిపై 369 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.