జీఓ ప్రతులను దహనం చేస్తున్న సీపీఎస్ ఉద్యోగులు
చిత్తూరు కలెక్టరేట్ : సీపీఎస్ రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో చేస్తున్న కాలయానను సహించేది లేదని ఏపీసీపీఎస్‌ఈఏ సంఘం జిల్లా అధ్యక్షుడు సమీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి స్థానిక గాంధీ విగ్రహం వద్ద సీపీఎస్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. సమీర్ మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసేందుకు కమిటీలను నియమిస్తున్నామని జీఓను విడుదల చేసి చేతులు దులుపుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు సీపీఎస్ ఉద్యోగులకు చేసిన మోసం చాలని, ఇకపై మళ్లీ మోసం చేయాలనుకోవడం మానుకోవాలన్నారు. తెలంగాణ మహాకూటమి ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబునాయుడుకు ఏపీలో ఉద్యోగులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
తగిన గుణపాఠం తప్పదు
వైద్యఆరోగ్య శాఖ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగుల నగదును ప్రభుత్వం షేర్ మార్కెట్‌లో పెట్టిందని ఎద్దేవా చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌చేశారు. లేకపోతే త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. త్వరలో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. సీపీఎస్ అసోసియేషన్ నాయకులు నోబెల్ మాట్లాడుతూ సీపీఎస్ విధానంతో ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఈనెల 28న ప్రభుత్వం జారీచేసిన సీపీఎస్ కమిటి జీఓ 2052 ను ఆ సంఘ నాయకులుం దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు అమర్, రాజేశ్, రజియా, సుబ్బలక్ష్మీ, జయశ్రీ, బాలాజీ, దేవ, బాషా, గణేశ్, అరుళ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment