సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎన్నికల సందర్భంగా రెండేళ్ల క్రితం జట్టు కట్టినప్పుడు టీడీపీ, బీజేపీ శ్రేణులు.. ‘కొత్త ప్రేమికుల్లా’ చెట్టపట్టాలు వేసుకుని తిరిగారు. అయితే అది అవసరార్థం తెచ్చిపెట్టుకున్న ప్రేమే తప్ప సైద్ధాంతిక సారూప్యం వల్లో, ప్రజలకు మేలు చేయూలన్న పరస్పర నిబద్ధతతోనే పెనవేసుకున్న బంధం కాదని అనతి కాలంలోనే తేలిపోయింది. ఇప్పటికీ సాంకేతికంగా రెండు పార్టీ లూ మిత్రపక్షాలుగానే ఉన్నా.. ఆ చెలిమి ఎడమొహం, పెడమొహం ప్రయూణంలా ఉంది. ముఖ్యంగా తమపట్ల టీడీపీ అనుసరిస్తున్న వైఖరి, ప్రదర్శిస్తున్న ఉదాసీనతలతో బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఎన్నికల్లో తమతో పొత్తువల్ల లబ్ధి పొందిన టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఒడ్కెక్కాక బోటు మల్లన్న బోడి మల్లన్న అయిన’ చందంగా వ్యవహరిస్తోందని బహిరంగంగానే బీజేపీవారు విమర్శలకు దిగుతున్నారు.
ఎన్నికల సమయంలో బీజేపీ డిమాండ్లను అయిష్టంగానే అంగీకరించిన చంద్రబాబు.. వాటిలో నెరవేర్చినవి తక్కువే. రాష్ట్రంలో తమ పార్టీ అగ్రనేతలకు న్యాయం జరిగినా జిల్లా, మండల, గ్రామ స్థాయిలో తమకు తీవ్ర అన్యాయమే జరుగుతోందని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్ కమిటీల నుంచి జన్మభూమి కమిటీల వరకూ తమకు దేనిలోనూ చోటు కల్పించకపోవడంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తమ పార్టీకి ఇచ్చిన హామీలను అటకెక్కించినట్లే.. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను సరిగా నెరవేర్చక ప్రజాదరణ కోల్పోతున్న టీడీపీతో కటీఫ్ చెప్పేస్తేనే మంచిదనే వాదన బీజేపీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. కాపు ఐక్యగర్జన సభ సమయంలో విధ్వంసం కేసుల్లో బీజేపీ వారినీ ప్రభుత్వం ఇరికించినా తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజువంటి నాయకులు కానీ ఖండించకపోవడం వారిలో మరింత నిస్పృహకూ, నిరసనకూ కారణమైంది.
మోదీ జనాకర్షణశక్తితో టీడీపీకే లబ్ధి..
ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలసి పోటీ చేసినా నరేంద్రమోదీ జనాకర్షణశక్తి వల్ల తమకన్నా టీడీపీనే ఎక్కువగా లబ్ధి పొందిందనే వాదన బీజేపీలో ఆదినుంచీ ఉంది. ఎన్నికల్లో మిత్రపక్షమైన బీజేపీకి కేవలం రాజమహేంద్రవరం నగర నియోజకవర్గాన్ని కేటాయించగా డాక్టర్ ఆకుల సత్యనారాయణ విజయం సాధిం చారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచీ జిల్లాలో టీడీపీ, బీజేపీల మధ్య ఆధిపత్యపోరు, పలు అంశాలపై విభేదాలు పొడసూపుతూనే ఉన్నాయి. రాజమహేంద్రవరం నగర నియోజకవర్గంలో గ్రామీణ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పెత్తనం చేయడం వారిమధ్య విభేదాలకు దారి తీసింది.
నగరంలో గోదావరి పుష్కరాల పనుల ఎంపిక, నిధులు కేటాయింపుల్లోనూ గోరంట్ల ఏకచ్ఛత్రాధిపత్యంతో వ్యవహరించడాన్ని ఆకుల పలుమార్లు తప్పుపట్టారు. పుష్కరాల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు బహిరంగంగా ధ్వజమెత్తడం, కార్పొరేషన్ సాక్షిగా అధికార పార్టీ నేతల అక్రమాలపై అధికారులను నిలదీయడం వంటి పరిణామాలతో రెండు పార్టీల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. అమలాపురంలో సైతం ఇరు పార్టీల నేతల మధ్య పోరు సాగుతోంది. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, బీజేపీ నేత, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు మధ్య గతంలో విభేదాలు ఇరు పార్టీల అగ్రనేతలు జోక్యం చేసుకునే స్థాయికి చేరాయి.
వారి పాపం.. వీరికి శాపం..
టీడీపీ ప్రభుత్వం అవినీతికి పర్యాయపదంగా మారడంతో ఆ పాపం తమకు చుట్టుకుంటోందన్న భావన బీజేపీ నేతలు, కార్యకర్తల్లో బలంగా ఉంది. జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వ పథకాల్లో టీడీపీ చోటామోటా నాయకులు, కార్యకర్తలు చొచ్చుకుపోతుండడం బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారింది. కేంద్రం నుంచి వస్తున్న పథకాలకు సైతం పచ్చరంగు పూస్తున్నారని బీజేపీ కార్యకర్తలు వాపోతున్నారు. వీటన్నింటికన్నా టీడీపీ అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజల్లో తమపై కూడా వ్యతిరేకత వస్తుందని ఆందోళ చెందుతున్నారు. డెల్టా రైతులకు శాపంగా మారిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం, గోదావరి పుష్కరాల్లో అవినీతి, ఇసుక ర్యాంపుల్లో దోపిడీ, అధికారపార్టీ నేతలు గ్రామస్థాయిల్లో సాగిస్తున్న అవినీతి పాపం తమకు చుట్టుకుంటుందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇవన్నీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లి టీడీపీతో తెగుతెంపులు చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో జనం మధ్యన తిరిగే అవకాశం ఉంటుందని, లేదంటే టీడీపీపై ఉన్న వ్యతిరేకతకు పార్టీని బలిపెట్టాల్సి వస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
తప్పుడు కేసులు పెట్టినా ఖండన కరువు..
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో చేపట్టిన కాపు ఉద్యమంతో టీడీపీ, బీజేపీల మధ్య ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను ధిక్కరించే ధైర్యంలేక టీడీపీలోని కాపు నాయకులు ఈ ఉద్యమానికి దూరంగా ఉన్నారన వాదన ఉంది. కానీ బీజేపీలోని కాపు నాయకులు చాలావరకూ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అయితే కాపు అనే కోటాలో పార్టీలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న సోము వీర్రాజు ఏమాత్రం స్పందించకపోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. తుని విధ్వంస ఘటనలను సాకుగా తీసుకుని బీజేపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టినా ఖండించకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ముందుగా టీడీపీ ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవాలనే బీజేపీ శ్రేణులు ఉన్నాయి.
నాడు వలపు.. నేడు వెగటు
Published Sun, Feb 14 2016 12:45 AM | Last Updated on Fri, Aug 10 2018 6:45 PM
Advertisement
Advertisement