జోరుగా క్రికెట్ బెట్టింగ్ | Cricket betting is still under way | Sakshi
Sakshi News home page

జోరుగా క్రికెట్ బెట్టింగ్

Published Tue, Feb 17 2015 1:16 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Cricket betting is still under way

పట్టించుకోని పోలీసులు
 
విజయవాడ సిటీ: క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు నగర పోలీసులను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. వీరు  జోరుగా బెట్టింగ్‌లు సాగిస్తుండగా, నిలువరించాల్సిన పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో నగరం కేంద్రంగా చేసుకొని బుకీలు సోమవారం కూడా క్రికెట్ బెట్టింగ్‌లు భారీగా నిర్వహించారు. సోమవారం జరిగిన ఐర్లాండ్-వెస్టిండీస్ జట్లపై భారీగా బెట్టింగ్‌లు జరిగాయి. నగరంలో ప్రధాన బుకీలుగా వ్యవహరించే వారికి రాజకీయ, పోలీసుల అండదండలు ఉన్నాయి. తమకు సహకరించే వారితో సోమవారం ఉదయమే ప్రధాన బుకీలు సంప్రదింపులు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వారిచ్చిన భరోసాతో  ముందుకు సాగిన బుకీలు ఇళ్ల నుంచే మొబైల్ ఫోన్ల ద్వారా బెట్టింగ్ వ్యవహారాలను చక్కబెట్టినట్లు సమాచారం.

బెట్టింగ్‌ప్రణాళికలో భాగంగా బుకీలు ఏవిధంగా బెట్టింగ్‌లు నిర్వహించాలనేది ప్రాంతాల వారీగా తమ అనుచరుల(ఏజెంట్ల)కు ఆదేశాలు జారీ చేశారు. వీరు ఎప్పటి మాదిరిగానే పంటర్లకు టచ్‌లో ఉంటూ బెట్టింగ్‌లు కట్టించారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు వస్తారేమోనని పంటర్లు ముందుకు రాకపోవడంతో బుకీల అనుచరులే పందెగాళ్లకు పూర్తి భరోసా ఇచ్చినట్టు తెలిసింది. పోలీసులు ఎవరూ కూడా తమ జోలికి రారని, ఒకవేళ వచ్చిన తమ బాస్(బుకీ)లు చూసుకుంటారని  బెట్టింగ్‌రాయుళ్లకు అభయవివ్వడం గమనార్హం.  ఇందుకు అనుగుణంగానే పోలీసులు కూడా పెద్దగా దృష్టిసారించకపోవడంతో యధావిధిగానే బెట్టింగ్‌లు సాగాయి. 

హైదరాబాద్ పరిణామాలు కూడా ఇక్కడి బుకీలకు కాసుల వర్షం కురిపించినట్టు తెలిసింది. అక్కడి పోలీసులు ఆదివారం కొందరు బుకీలను అదుపులోకి తీసుకోవడంతో ఇక్కడి బుకీలకు డిమాండ్ పెరిగింది. అక్కడి పంటర్లు వీరి ద్వారానే బెట్టింగ్‌లు కట్టినట్టు సమాచారం. బుకీల పరిభాషలో ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లపై 20పైసల ఆట జరిగినట్లు సమాచారం. అంటే ఐర్లాండ్ గెలుపొందితే రూ.10వేలు ఇస్తారు. అలాగాక వెస్టిండీస్ జట్టు గెలుపొందితే రూ.2వేలు మాత్రమే ఇస్తారు.  వెస్టిండీస్ జట్టుతో పోల్చితే ఐర్లాండ్ జట్టు ఏమాత్రం పటిష్టమైనది కాదు. దీంతో పంటర్లు సహజంగానే వెస్టిండీస్‌పై భారీగా బెట్టింగ్‌లు కట్టారు. ఐర్లాండ్ గెలుపొందడంతో పంటర్లు తీవ్రంగా నష్టపోయినట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement