ఇటు క్రికెట్ మ్యాచ్‌లు.. అటు పరీక్షలు
ఇప్పుడు వరల్డ్ కప్, ఆపై ఐపీఎల్
విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన
పలమనేరు: వరల్డ్ కప్ క్రికెట్ పుణ్యమా అని విద్యార్థుల తల్లిదండ్రులకు టెన్షన్ పట్టుకుంది. విద్యార్థులకేమో క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఓవైపు క్రికెట్ మ్యాచ్‌లు.. మరోవైపు పరీక్షలు విద్యార్థులకు సవాల్‌గా మారాయి. ఇప్పటికే వరల్డ్‌కప్ పోటీలు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ పోటీలు ముగియగానే ఐపీఎల్ పోటీలు ప్రారంభం కానున్నాయి. మొత్తం మీద టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు పూర్తయ్యే వరకు క్రికెట్ సీజన్ సాగనుంది. దీంతో తల్లిదండ్రులతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు సైతం తీవ్రంగా కలత చెందుతున్నాయి. విద్యార్థులకొచ్చే ర్యాంకుల ఆధారంగా వ్యాపారాన్ని చేసుకొనే ప్రైవేటు కళాశాలలకు క్రికెట్ పెద్ద తలనొప్పిగా మారింది. టీవీలు, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోతున్న విద్యార్థుల దృష్టిని పరీక్షల వైపు మళ్లించడం తల్లిదండ్రులకు సవాల్‌గా మారుతోంది.
క్రికెట్‌తోనే పరీక్షలంతా ముగిసిపోతాయి
ఇప్పటికే వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. లీగ్ దశ పోటీలు వచ్చేనెల 15 వరకు జరగనున్నాయి. ఆపై సెమీస్, మార్చి 29న జరిగే ఫైనల్‌తో ఇవి ముగుస్తాయి. ఇలా ఉండ గా ఐపీఎల్-8 పోటీలు ఏప్రిల్ 8 నుంచి మే 17 వరకు కొనసాగుతాయి. మే 24న జరిగే ఫైనల్‌తో ఇవి ముగుస్తాయి. ఇక పదో తరగతి పరీక్షలు మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రీఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్చి 11 నుంచి ప్రాక్టికల్స్‌తో పాటు ఫైనల్ పరీక్షలు మార్చి 30 వరకు జరగనున్నాయి. డిగ్రీ విద్యార్థులకు మార్చి 28 నుంచి ఏప్రిల్ ఆఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. ఆ లెక్కన క్రికెట్ సీజన్‌లోనే ఈ పరీక్షలన్నీ జరగ నున్నాయి. దీంతో క్రికెట్ ప్రభావం అందరు విద్యార్థుల మీద పడే అవకాశాలున్నాయి.
స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్న విద్యార్థులు
అసలే పరీక్షల సీజన్ కావడంతో ఇంట్లో టీవీలు చూడ్డానికి తల్లిదండ్రులు ససేమీరా ఒప్పుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లలో లైవ్ క్రికెట్ చూడ్డానికి ఆసక్తి చూపుతున్నారు. మొన్న జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా విద్యార్థుల్లో క్రికెట్ ఫీవర్ ఎలా ఉందో అర్థమైంది. అంతేగాక ఏ మాత్రం సమయం దొరి కినా విద్యార్థులు బ్యాట్, బాల్ చేతబట్టి క్రికెట్ ఆడేందుకు ఆసక్తిని చూపుతున్నారు. వరల్డ్‌కప్ మొదలయ్యాక సందుగొందులతో పాటు ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా ఆఖరుకు చెరువుల్లోనూ క్రికెట్ ఆడుతున్న విద్యార్థులే దర్శనమిస్తున్నారు.
తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిన సమయమిదే
విద్యార్థులకు క్రీడలకన్నా పరీక్షలే ముఖ్యం. అయితే క్రికెట్ ఇప్పుడు ఓ వైరస్‌లా మారింది. దీంతో విద్యార్థులకు ఎంతసేపూ క్రికెట్ స్కోరెంత.. ఎవరు గెలిచారు.. అనే ధ్యాసే పట్టిపీడిస్తోంది. వీరిని క్రికెట్ నుంచి పరీక్షల వైపునకు మరల్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఇప్పటికే కొందరు మానసికంగా క్రికెట్ మ్యాచ్‌లకుబానిసలైపోయారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అసలైన సమయమిదే.
-ఎన్.బి. సుధాకర్ రెడ్డి, సైకాలజిస్ట్,
తిరుపతి.
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం
ముఖ్యంగా టెన్త్ పిల్లలకు ఫైనల్ పరీక్షలే అసలైన భవిష్యత్తు. క్రికెట్ పోటీల కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ద చూపేలా బడిబస అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయులు టెన్త్ పిల్లల ఇళ్ల వద్దకెళ్లి వారు చదువుకుంటున్నారా లేదా టీవీలు చూస్తున్నారా అని గమనించి తల్లిదండ్రులను మేల్కొల్పుతున్నాం.
-వాసుదేవనాయుడు, డివైఈవో, చిత్తూరు
ఈ పరీక్షలు పిల్లలకు కాదు..పెద్దలకే
క్రికెట్ పోటీల కారణంగా విద్యార్థులు రాయాల్సిన పరీక్షలు వారి తల్లిదండ్రులకు పరీక్షలుగా మారాయి. వారు ధ్యాసతో చదవాలంటే తొలుత తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. ఇళ్లలో వారు సీరియల్స్ చూసుకుంటూ కుర్చొంటే పిల్లలు మరో చోట క్రికెట్ చూస్తుంటారు. కాబట్టి పూర్తిగా టీవీలను కట్టిపెట్టి
పిల్లలపై శ్రద్ధ చూపాలి.
- బాలాజీ, రచయిత, పలమనేరు.
పరీక్షలను విస్మరిస్తే భవిష్యత్తు అంధకారమే
వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో ఇండియా నాలుగేళ్లకోసారి ఆడుతూనే ఉంటుంది. కానీ విద్యార్థులకు ప్రతి సంవత్సరం వచ్చే ఫైనల్ పరీక్షలు మళ్లీరావు. ఒక్కసారి ఫెయిలైతే మళ్లీ కట్టి రాసుకోవాల్సిందే. కాబట్టి క్రికెట్ కంటే విద్యార్థులు జీవితమే ముఖ్యమని తెలుసుకోవాలి. దీనిపై తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- క్రిష్ణమూర్తిరెడ్డి, మధు కళాశాల కరస్పాండెంట్, పలమనేరు
క్రికెట్ ఫీవర్!
Published Sat, Feb 21 2015 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement