నేరాలు, చోరీలకు చెక్ | Crime, theft in check | Sakshi
Sakshi News home page

నేరాలు, చోరీలకు చెక్

Published Mon, Feb 24 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM

Crime, theft in check

జగిత్యాల/టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్: వివిధ రకాలైన నేరాలతో పాటు బ్యాంకుల్లో, వ్యాపార సంస్థల్లో జరుగుతున్న చోరీలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు తెలిపారు. ఈమధ్య కాలంలో బ్యాంకులు, నగల దుకాణాల్లో జరుగుతున్న చోరీల్లో స్థానిక పోలీసుల వైఫల్యం ఉందన్నారు. ఇలాంటి నేరాలను అదుపు చేయడానికి కొత్తగా పబ్లిక్ యాక్ట్ తీసుకొచ్చామని చెప్పారు. ఇందులో భాగంగా ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
 
 బ్యాంకు లు, వ్యాపార సముదాయాల్లో సంఘటనలు జరిగినప్పుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అలారం మోగే ప్రక్రియకు రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. దీనికితోడు స్థానికంగా సెక్యూరిటీ విభాగాల్ని ప్రైవేట్, పోలీస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నారు. వీటన్నింటిని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తాయని ఆయన వివరించారు. జగిత్యా ల, గొల్లపల్లిలో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్ భవనాలను ప్రసాదరావు ఆదివారం ప్రారంభించారు.  అనంతరం పోలీస్‌హెడ్‌కార్వర్స్‌లో కంట్రోల్‌రూమ్‌ను ప్రారంభించారు. ఈ ఆయన సందర్భంగా మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని, అంతరాష్ట్ర సరిహద్దుల్లో హెలిక్యాప్టర్ ద్వారా జాయింట్ ఆపరేషన్‌కు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది పోలీసు సిబ్బంది భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, దశలవారీగా నియామకాలు జరుగుతాయని అన్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై సేవాదృక్పథంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజలు తమ సమస్యలు తీర్చాలని పోలీస్‌స్టేషన్‌కు వచ్చినపుడు మర్యాదపూర్వకంగా ఫిర్యాదు స్వీకరించి సమస్యను పరిష్కరించాలన్నారు. బాధితుడికి న్యాయం చేయడమే పోలీసుల కర్తవ్యం కావాలన్నారు. సివిల్ కేసులో పోలీసులు జోక్యం చేసుకోరాదని ఆదేశించారు. ఒకవేళ తలదూర్చితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
 
 తెలంగాణలో కరీంనగర్ అభివృద్ధి చెందాలి
 తాను పనిచేసినప్పటికీ, ఇప్పటికీ కరీంనగర్ జిల్లా బాగా ప్రగతి సాధించిందని డీజీపీ అన్నారు. వ్యవసాయ రంగంలో జిల్లా బాగా అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వనరులున్న కరీంనగర్ ఇండస్ట్రీయల్ హబ్‌గా ఎదగాలని ఆకాంక్షించారు.
 
 ఈ కార్యక్రమాల్లో జగిత్యాల ఎమ్మెల్యేల ఎల్.రమణ, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి, నార్త్‌జోన్ ఐజీ రవిగుప్తా, డీఐజీ భీమానాయక్, ఎస్పీ శివకుమార్, ఓఎస్డీ సుబ్బరాయుడు, అడిషనల్ ఎస్పీ జనార్దన్‌రెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల డీఎస్పీలు పరమేశ్వరెడ్డి, దామెర నర్సయ్య, సీఐ నరేష్‌కుమార్ తదితరులున్నారు.
 
 ఎస్పీ కృషి భేష్
 డీజీపీ ప్రశంస
 
 టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్: ఆధునిక సాంకేతిక టెక్నాలజీని వినియోగించుకోవడంలో ఎస్పీ శివకుమార్ కృషి ప్రశంసనీయమని డీజీపీ బి.ప్రసాద్‌రావు అన్నారు. ప్రజలకు మరింత చేరువై సేవలందించడంలో ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. కరీంనగర్ పోలీస్‌హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్, ఈ-శోధన టెక్నాలజీని ఆదివారం ఆయన ప్రారంభించారు. డీజీపీ మాట్లాడుతూ.. జిల్లాలో నేరాల అదుపు కోసం మూడు వందలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో అవాంఛనీయ సంఘటనలు జరిగి నప్పుడు వాటి రికార్డులు నేర పరిశోధనకు తోడ్పడుతాయన్నారు. ఈ-శోధన టెక్నాలజీలో పోలీసు సమాచారాన్ని పొందుపరచి, వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయడం వల్ల వివిధ రకాల సేవలు సత్వరం అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. కోర్టు కేసులు, పోలీసుల పనితీరు, ఆన్‌లైన్ వెరిఫికేషన్, పాస్‌పోర్ట్ దరఖాస్తుల విచారణ, స్టేషన్ల రిపోర్టును ఎప్పటికప్పుడు సరిచూసుకునే అవకాశం కలుగుతుందన్నారు. జిల్లాలో అరవై రక్ష క్ పెట్రోలింగ్ వాహనాలుండగా, జీపీఆర్‌ఎస్ సిస్టమ్ ద్వారా వాటిని అనుసంధానం చేయడం జరిగిందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement