పెరిగిన నేరాలు
మనిషిలో నేర ప్రవర్తన పెరుగుతోంది. చిన్నచిన్న విషయాలకు హత్యలకు పాల్పడుతున్నాడు. కొందరు మృగాల్లా మారి కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూ తుళ్లపై లైంగిక దాడులు చేస్తూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. పరిగి సర్కిల్ పరిధి లో గతేడాదితో పోల్చుకుంటే ప్రధాన నేరాలు కాలంతో పాటు పెరిగిపోయి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈయేడు చోటుచేసుకున్న ప్రధాన నేరాలకు సంబంధించిన కథనం.
న్యూస్‌లైన్, పరిగి
సభ్య సమాజం తలదించుకుంది..
కుల్కచర్ల మండల కేంద్రంలో కన్నతండ్రే పశువులా మారిపోయాడు. వావివరసలు మరచిపోయి సభ్య సమాజం తలదించు కునేలా కన్న కూతురుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తో జనం నివ్వెరపోయి కంట తడి పెట్టారు. అదే గ్రామం లో.. క్రమ శిక్షణకు మారుపేరైన జవాన్ కళ్లు కామంతో మూసుకుపోయాయి. మానసిక వికలాంగురాలిని గర్భవతిని చేశాడు.
చౌడాపూర్‌లో గిరిజన మహిళపై సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టిన సంఘటన మహిళలను భయభ్రాంతులకు గురిచేసింది. కుల్కచర్ల మండలం బండవెల్కిచర్లలో.. భారంగా మారిందని ఓ వ్యక్తి ప్రియురాలిని కడతేర్చి నిప్పంటించాడు. గండేడ్ మండలం కంచన్‌పల్లిలో ఓ వ్యక్తి పశువులా మారాడు. కామవాంఛ తీర్చలేదని వారం రోజుల బాలింతను గొంతు నులిమి చంపేశాడు. మహ్మదాబాద్‌లో.. ప్రేయసితో వివాహానికి నిరాకరించిందనే కార ణంతో ఓ యువకుడు నవమాసాలు మోసి కని పెంచిన తల్లినే మట్టుబెట్టాడు. దోమ మం డలం బొంపల్లి తండాలో బాలికపై బలత్కారం జరిగింది. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలో డిగ్రీ కళాశాల విద్యార్థినిపై ఓ కార్మికుడు అత్యాచార యత్నం చేశాడు. ప్రతిఘటించడంతో పాశవిక దాడి చేసి పరారయ్యాడు. మాదారంలో.. ఆస్తి కోసం పెంచి పెద్ద చేసిన అవ్వను కడతేర్చారు మనవడు, మనవరాలు. బసిరెడ్డిపల్లిలో నగల కోసం ప్రియురాలిని కడతేర్చిన ఓ మృగాడు. ఇలా చెప్పుకుంటూ చాలా ఘటనలే ఉన్నాయి. ఈ ఏడాది పరిగి సర్కిల్‌లో జరిగిన నేరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నా యి.
పెరిగిన ప్రధాన నేరాలు..
గతేడాదితో పోలిస్తే 2013లో పరిగి సర్కిల్‌లో ప్రధాన నేరాలు పెరిగిపోయాయి. 2012లో 11 హత్యలు జరిగాయి. పోలీసులు ఏడింటిని ఛేదించారు. ఈఏడాది 17 హత్యలు చోటుచేసుకోగా ఒక్కటి మినహా పోలీసులు మిగతా వాటిని ఛేదించి నిందితులను కటకటాల వెనక్కి పంపారు. గతేడాది 7 హత్యాయత్నాలు జరగ్గా.. ఈ సంవత్సరం 12 హత్యాయత్నాలు చోటుచేసుకున్నాయి. 2012లో తొమ్మిది లైంగిక దాడులు, 16 అత్యాచార యత్నాలు.. ఈ సంవత్సరం ఆరు లైంగిక దాడులు, 14 అత్యాచార యత్నాలు జరిగాయి. గతేడాది ముగ్గురు మహిళలు కట్న దాహానికి బలైపోయారు. అదే ఈసారి వాటికి సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి.
నేరాల్లో మారిన పంథా..
గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నేరాలు పెరిగాయి. అదే సమయంలో నేరాలకు పాల్పడిన తీరు కూడా మారిపోయింది. గత రెండేళ్లలో వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే ఎక్కువ హత్యలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది నిందితులు చిన్నచిన్న కారణాలకు హత్యలకు పాల్పడ్డారు. హత్యలు జరిగిన కారణాలను విశ్లేషిస్తే శాంతి భద్రతలలో పాటు సామాజికపరమై కోణాలు ఉన్నాయి. వీటి నివారణకు సమాజంలో అవగాహన, కౌన్సెలింగ్ ఎంతైనా అవసరం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.