సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రభుత్వ ఉపాధ్యాయుల అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. ఆదర్శంగా ఉండాల్సిన వారే అడ్డదారులు తొక్కిన వైనం విస్మయపరుస్తోంది. నకిలీ వైద్య బిల్లులు సమర్పించి లక్షల రూపాయలు రీయింబర్స్‌మెంట్ కింద పొందిన 18మంది ఉపాధ్యాయులపై ఇటీవల క్రిమినల్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బోగస్ సర్టిఫికెట్లు సమర్పించి విద్యాశాఖను తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలకు రంగం సిద్ధమైంది. వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు.
2009 సంవత్సరంలో 9మంది ఎస్‌జీటీలు బోగస్ సర్టిఫికెట్లతో స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)లుగా పదోన్నతి పొందేందుకు ప్రయత్నించి విద్యాశాఖ అధికారులకు దొరికిపోయారు. తాజాగా డీఎస్‌ఈ ఆదేశాలతో వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. 2009 సంవత్సరంలో ఉపాధ్యాయులకు పెద్ద సంఖ్యలో పదోన్నతులిచ్చారు. ఈ క్రమంలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల్లో కోర్సులు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించారు. అయితే వాటిలో చాలావరకు నకిలీవని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. దీంతో వారికి పదోన్నతులు ఇవ్వకుండా పక్కనబెట్టారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇదేతరహాలో అక్రమార్కులు ఉండడంతో కేసును సీఐడీకి అప్పగించారు. దీంతో వారు విచారణ ప్రక్రియ మొదలుపెట్టారు.
ఇదిలా ఉండగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు 9మందిని గుర్తించిన విద్యాశాఖ అధికారులు వివరాలను రాష్ట్ర అధికారులకు సమర్పించారు. ఇందులో ఏడుగురు వినాయక మిషన్‌కు చెందినవారు కాగా, జేఆర్‌ఎన్ యూనివర్సిటీకి చెందన వారు ఇద్దరున్నారు. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు అందాయి. దీంతో జిల్లా విద్యాశాఖ వారిపై కేసుల నమోదుకు సీఐడీకి లేఖ రాసింది. ఇందులో భాగంగా ముందుగా వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ సహాయ సంచాలకులు గోవర్ధన్ వెల్లడించారు.
క్రిమినల్ కేసులు!
Published Sat, Nov 9 2013 12:24 AM | Last Updated on Thu, Jul 26 2018 1:37 PM
Advertisement
Advertisement