నష్టం అనంతం | Crop loss in Anantapur district | Sakshi
Sakshi News home page

నష్టం అనంతం

Published Sun, Oct 15 2017 3:14 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM

Crop loss in Anantapur district - Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: వరుణుడి ధాటికి పంటలు వర్షార్పణం అయ్యాయి. నష్టం కూడా ‘అనంతం’.  నెలరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వ్యవసాయ, ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. పదేళ్ల తర్వాత ఈయేడు చేతికొస్తాయనుకుంటున్న పంటలు కళ్లెదుటే దెబ్బతింటుంటే రైతుకు కన్నీరే మిగులుతోంది. అధిక వర్షాలతో పంటనష్టపోయి విలవిల్లాడుతున్న రైతులను పరామర్శించి భరోసా కల్పించడంలో మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం విఫలమైంది.

20 రోజుల్లో 220 మి.మీ వర్షపాతం:
సెప్టెంబర్‌ 25న మొదలైన వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. 20 రోజుల్లో ఏకంగా 220 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. గతనెల 25న 6.3 మి.మీ, 26న 10 మి.మీ, 27న 3.7 మి.మీ, 28న 11.3 మి.మీ, 29న 10.5 మి.మీ, 30న 4.1 మి.మీ సగటు నమోదు కాగా... ఇక ఈ నెల ఒకటోతేదీ నుంచి వరుణుడు మరింత విరుచుకుపడ్డాడు. 2న 34.4 మి.మీ, 4న 11.9 మి.మీ, 5న 10.5 మి.మీ, 8న 13.8 మి.మీ, 9న 35 మి.మీ, 10న 14 మి.మీ, 12న 20 మి.మీ, 14న 14.6 మి.మీ వర్షపాతం నమోదైంది.  360 రోజుల వార్షిక వర్షపాతం 552 మి.మీ కాగా గత 20 రోజుల్లోనే 220 మి.మీ వర్షపాతం నమోదైంది. జూన్, జూలై ముగిసేనాటికి 32 శాతం లోటు వర్షపాతం నమోదైన జిల్లాలో సెప్టెంబర్, అక్టోబర్‌ వర్షాలకు ప్రస్తుతం 32 శాతం లోటు పూడ్చుకుని 33 శాతం అధికంగా వర్షపాతం నమోదు కావడం విశేషం.

వేరుశనగ, పత్తి పంటలకు భారీ నష్టం:
జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వేరుశనగ, పత్తి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. వరి, పెసర, ఆముదం పంటలకు కొంత నష్టం కలుగుతోంది.  జూన్‌లో వేసిన 1.50 లక్షల ఎకరాల వేరుశనగ తొలగించడానికి సిద్ధంగా ఉండగా వర్షాలు పట్టుకోవడంతో ఇబ్బందిగా మారింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 20 వేల ఎకరాల్లో పంట తొలగించడంతో పొలాల్లోనే కుళ్లిపోయింది. మిగతా ప్రాంతాల్లో కాయల నుంచి మొలకలు వస్తున్నాయి. వేరుశనగ రైతులకు రూ.250 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. అలాగే పామిడి, పెద్దవడుగూరు, గుత్తి, యల్లనూరు, పుట్లూరు, కనేకల్లు తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పత్తి పంట నీటముని రూ.90 కోట్ల వరకు నష్టం జరిగే పరిస్థితి.

‘వరి’ంచని ఆశలు :
బోరుబావుల కింద సాగు చేసిన వరి పంటలు కూడా వర్షానికి దెబ్బతిన్నాయి. వరి, ఇతర పంటలకు కూడా రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు నష్టం ఉంటుందని అంచనా. తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరు, పామిడి, పెద్దపప్పూరు, గోరంట్ల, కనగానపల్లి, ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి తదితర 25 నుంచి 30 మండలాల పరిధిలో చీనీ, దానిమ్మ, ద్రాక్ష, అరటి, బొప్పాయి, ఆకుతోటలు, కళింగర, కర్భూజా, దోస, టమాట, వంగ, బెండ తదితర పంటలు 17 వేల నుంచి 20 వేల ఎకరాల్లో దెబ్బతినడంతో రైతులకు రూ.300 నుంచి రూ.320 కోట్ల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి. ఇలా ఇప్పటివరకు జిల్లాలో పంట నష్టం రూ.700 కోట్ల వరకు ఉంటుందని లెక్కలు వేశారు.

పత్తా లేని ప్రజాప్రతినిధులు: భారీ వర్షాలతో  పంటలు వర్షార్పణమై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నా ప్రజాప్రతినిధులు పత్తాలేకుండా పోయారు. పరామర్శకు వెళితే పరిహారం అడుగుతారని పాలకులు పొలాలవైపు తిరిగి చూడడం లేదు. అధికారులు కూడా మొక్కుబడిగా నష్టం అంచనాలు వేస్తున్నారు. దీంతో కచ్చితమైన పంటనష్టం లెక్కలు తేలడంలేదు. అపార నష్టం వాటిల్లినా తమ గ్రామాన్ని ఇప్పటికీ ఎవరూ సందర్శించలేదని పామిడి పక్కనే ఉన్న కొత్తపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చాలా గ్రామాల్లో  నష్టం వివరాలు సేకరించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమవుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు తమ ఆక్రోశాన్ని వెల్లగక్కుతున్నారు.

ధర్మవరం డివిజన్‌లో కుంభవృష్టి
అనంతపురం అగ్రికల్చర్‌:  ధర్మవరం డివిజన్‌పై శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకువరణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. తాడిమర్రి మండలంలో 111.6 మి.మీ కుండపోత నమోదైంది. బత్తలపల్లి 84.2 మి.మీ, నార్పల 66.2 మి.మీ, ధర్మవరం 64.7 మి.మీ, కంబదూరు 61.3 మి.మీ, రామగిరి 54.1 మి.మీ, మడకశిర 48.6 మి.మీ, సోమందేపల్లి 39.9 మి.మీ, చెన్నేకొత్తపల్లి 36.9 మి.మీ, పరిగి 35.4 మి.మీ, కనగానపల్లి 28.7 మి.మీ, రామగిరి 27.8 మి.మీ, రొద్దం 26.4 మి.మీ, కుందుర్పి 25.9 మి.మీ, యాడికి 14.7 మి.మీ, గుడిబండ 14.1 మి.మీ, అమడగూరు 12.9 మి.మీ, తాడిపత్రి 12.4 మి.మీ, రొళ్ల 11.7 మి.మీ, లేపాక్షి 10.4 మి.మీ వర్షం కురిసింది. కనేకల్లు, బొమ్మనహాల్‌ మినహా అన్ని మండలాల పరిధిలో 14.6 మి.మీ సగటు నమోదైంది. అక్టోబర్‌ నెల సాధారణ వర్షపాతం 110.7 మి.మీ కాగా ఇప్పటికే 172.3 మి.మీ నమోదైంది.జూన్‌ ఒకటి నుంచి ఇప్పటి వరకు 404 మి.మీ గానూ 33 శాతం అధికంగా 537.7 మి.మీ నమోదైంది. ఎడతెరపి లేని వర్షాలకు వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతుండగా చాలా చెరువులు నిండి మరువలు పారాయి. వందలాది చెరువుల్లోకి భారీగా వర్షపు నీరు చేరంది. వేరుశనగ, పత్తి, వరి, పండ్లతోటలు, కూరగాయల పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement