తాడేపల్లి రూరల్: రాజధాని శంకుస్థాపన పేరుతో ల్యాండ్ పూలింగ్‌కు సహకరించని రైతుల పొలాల్లో పంటను శుక్రవారం అర్ధరాత్రి డోజర్ల సహాయంతో నాశనం చేశారు. వీవీఐపీలు వచ్చేందుకు కట్ట కింద భాగంలో ఉండవల్లి చిన్న డొంక నుంచి ఉద్దండరాయునిపాలెం వరకు అధికారులు రాత్రికి రాత్రి మెలికలు తిప్పుతూ పంట పొలాల్లో నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టారు. వెంకటపాలేనికి చెందిన మొవ్వా భీమయ్య అనే రైతు ఒక ఎకరంలో అరటి పంట చేతికొచ్చింది.
రెండు మూడు రోజుల్లో గెలలు తరలించనున్నాడు. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రి ప్రభుత్వం పంటను ధ్వంసం చేసింది. శనివారం వేకువజామున వచ్చి పంటను చూసిన రైతు పొక్లెయిన్‌కు అడ్డంగా పడుకున్నాడు. సమాచారం తెలుసుకున్న వెంకటపాలెం గ్రామస్తులు అక్కడకు చేరుకుని యంత్రాలను వెంటనే పొలం నుంచి తీసేయూలని డిమాండ్ చేశారు. దీంతో పొక్లెరుున్ నిర్వాహకులు వెనుదిరిగారు.
నోటికాడ కూడు లాగేశారు
450 అరటి చెట్లను భూస్థాపితం చేసి, పిలకలను డోజర్లతో పక్కకు నెట్టి ..మట్టి కప్పారు. దీంతోపాటు 450 వెదురు బొంగులను నాశనం చేశారు. మొత్తం రూ. 1.50 లక్షల మేర పంట నష్టం వాటిల్లినట్లు భీమయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. పక్కనే ఉన్న మరో రైతు దొండ చేనును ధ్వంసం చేశారు. ఏడాదిపాటు కాపునిచ్చే దొండ పంట పాడవడంతో రైతుకు రూ.2.50 లక్షల నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు.
పెనుమాకలో బ్రహ్మయ్య లాండ్ పూలింగ్‌కు తన పొలాన్ని ఇచ్చాడు. రెండు రోజుల క్రితం చెక్కు తీసుకున్నాడు. ఈ సమయంలో తన పొలంలో పంట తరలించాకే భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులను కోరగా..వారు అనుమతించారు. ఇప్పుడు అరటి తోట మొత్తం నాశనం చేసి..అక్కడ డ్రిప్ పైపులను పగలగొట్టారు. దీంతో సుమారు రూ. 2.50 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నష్టాన్ని ఎవరిస్తారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఉండవల్లి పరిధిలోని డొంక వద్ద పొక్లెయిన్ పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు.
శంకుస్థాపన ప్రాంతంలో స్థలం చదును
తాడికొండ: మండలంలోని ఉద్దండరాయునిపాలెంలో కరకట్ట అవతలివైపు గ్రామానికి చెందిన జూజాల మురహరిరావు, తాడికొండ ఓంకార్‌బాబు, శ్రీధర్‌బాబు పొలాల మధ్య శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాస్తు ప్రకారం ఉద్దండ్రాయినిపాలెం గ్రామానికి పూర్తిగా ఈశాన్యంలో కృష్ణానది ఒడ్డున శంకుస్థాపన అనుకూలంగా భావించి చేపట్టారు.
దీని కోసం చుట్టుపక్కల దాదాపు 40 ఎకరాల పొలాలను చదును చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 8 ఎకరాలకు సంబంధించి కౌలు పరిహారం చెక్కులు రైతులకు అందించలేదు. దీంతో శనివారం చదును చేసేందుకు వచ్చిన యంత్రాలను రైతులు అడ్డుకున్నారు.
గతంలో భూసమీకరణలో తమ భూములు తీసుకున్నారని రైతులు మీరావలి, శివ రైతులు తెలిపారు. కౌలు పరిహారం అడిగితే రెవెన్యూ రికార్డుల్లో లేదని సాకులు చెబుతున్నారని ఆరోపించారు. ఎంజాయ్‌మెంటులో ఉన్నప్పటికీ కౌలు పరిహారం ఇవ్వకుండా చదును చేయటం సరికాదన్నారు. దీంతో వారి భూములు వదిలేసి మిగిలిన పొలాన్ని చదును చేస్తున్నారు. శంకుస్థాపన ప్రాంగణం నుంచి 250 మీటర్ల దూరంలో ఈ పనులు సాగుతున్నాయి.
రాత్రికి రాత్రే పంటలు ధ్వంసం
Published Sun, Oct 11 2015 2:09 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement