ఆదాయం కిక్కు..లక్కు ఎవరికి దక్కు | Crores of income from appilcations | Sakshi
Sakshi News home page

ఆదాయం కిక్కు..లక్కు ఎవరికి దక్కు

Published Mon, Jun 29 2015 2:22 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

ఆదాయం కిక్కు..లక్కు ఎవరికి దక్కు - Sakshi

ఆదాయం కిక్కు..లక్కు ఎవరికి దక్కు

- దరఖాస్తుల ద్వారానే రూ.24 కోట్ల ఆదాయం
- జిల్లాలో 294 వైన్ షాపులకు 6,995 టెండర్లు
- నగరంలో 8 షాపులకు సింగిల్ దరఖాస్తులు
- పెదఆవుటపల్లి షాపునకు అత్యధికంగా 162
- నేడు లాటరీ ద్వారా ఎంపిక
సాక్షి, విజయవాడ :
ఒకటి కాదు.. రెండు కాదు.. 294 వైన్‌షాపులకు ఏకంగా 6,995 దరఖాస్తులు. రూపాయి కాదు.. రెండు రూపాయలు కాదు.. ఏకంగా రూ.24కోట్లు. అది కూడా కేవలం దరఖాస్తుల స్వీకరణ ద్వారానే. దీంతో జిల్లాలో ఎక్సైజ్ శాఖకు మద్యం ఆదాయం ‘ఫుల్లుగా’ సమకూరింది. మద్యం లాటరీ ప్రక్రియ, షాపుల కేటాయింపులు జరగక ముందే ఇంత ఆదాయం వస్తే.. మొత్తం ప్రక్రియ పూర్తయితే ఎంత వస్తుందోనని అధికారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
 
150 శాతం అధిక ఆదాయం
జిల్లాలోని 294 వైన్‌షాపుల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం ముగిసింది. బందరులోని కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో ఈ షాపులకు 6,995 దరఖాస్తులు అందాయి. వీటి విక్రయం ద్వారానే రూ.24కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఇది దాదాపు 150 శాతం అధికం. గత ఏడాది రూ.9.20 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.
 
నేడు షాపుల కేటాయింపు
జిల్లాలో 335 వైన్‌షాపులు ఉండగా, 33 షాపులను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని నిర్ణయించింది. మిగిలిన 302 షాపులకు గజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే, 302లో 294 షాపులకు మాత్రమే దరఖాస్తులు అందాయి. మిగిలిన ఎనిమిది షాపులకు ఒక్క దరఖాస్తు కూడా అందలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత మళ్లీ ఎనిమిది షాపులకు గజిట్ విడుదల చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మచిలీపట్నంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లాటరీ ప్రక్రియ నిర్వహిస్తారు. పాసులు ఉన్న వారిని మాత్రమే కలెక్టరేట్‌లోకి అనుమతిస్తారు. తొలుత సింగిల్ దరఖాస్తులు వచ్చిన షాపులను పరిశీలించి వారికి లెసైన్స్‌లు కేటాయిస్తారు. ఆ తర్వాత గజిట్‌లో సీరియల్ నంబర్‌కు అనుగుణంగా లాటరీ ప్రక్రియ నిర్వహిస్తారు.
 
29 సింగిల్ దరఖాస్తులు
నగరంలో ఎక్సైజ్ వ్యాపారులు సిండికేట్ అయి ఎక్కువ దరఖాస్తులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో నగరంలోని ఎనిమిది షాపులకు సింగిల్ దరఖాస్తులే అందాయి. ఉయ్యూరులో మూడు, గుడ్లవల్లేరులో రెండు, సుల్తాన్‌బాద్‌లో రెండు షాపులకు సింగిల్ దరఖాస్తు రావటంతో వాటికి లాటరీ లేకుండా వారికే కేటాయించనున్నారు. అలాగే, 29 వైన్ షాపులకు సింగిల్ దరఖాస్తులే రావటంతో వారికి కూడా లాటరీ లేకుండానే కేటాయించనున్నారు.
 
పెదఆవుటపల్లి షాపునకు డిమాండ్
ఈ ఏడాది అత్యధికంగా పెదఆవుటపల్లి షాపునకు భారీగా దరఖాస్తులు అందాయి. గన్నవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఈ షాపునకు సమీపంలో జాతీయ రహదారి, ఎక్కువ రెస్టారెంట్లు, దాబాలు ఉండటంతో ఇక్కడ విక్రయాలు భారీగా సాగుతుంటాయి. దీంతో 162 మంది షాపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎక్సైజ్‌శాఖ ఇన్‌చార్జి డెప్యూటీ కమిషనర్ బాజ్జీరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ సోమవారం లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని, మంగళవారం నుంచి కొత్త లెసైన్స్‌ల కాలపరిమితి మొదలవుతుందని చెప్పారు. లాటరీ షాపు దక్కించుకున్న వారు దానికి అనుగుణంగా లెసైన్స్ ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement