సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుంచి ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. వరుసగా సాగు విస్తీర్ణం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు నీరు–ప్రగతి పేరుతో భూగర్భ జలాలను పెంచుతున్నామని, తద్వారా అదనపు ఆయకట్టు వచ్చిందని ప్రభుత్వం చెబుతుండగా అదే సర్కారు జిల్లా కలెక్టర్ల సదస్సుకు రూపొందించిన నివేదిక మాత్రం 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ వరకు సాగు విస్తీర్ణం తగ్గిపోయినట్లు స్పష్టం చేసింది. నీరు–ప్రగతి కింద చెరువుల్లో పూడిక తీయడం, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, ఫాం పాండ్స్, ఇతర నీటి నిల్వ నిర్మాణాలు, చెరువుల సామర్థ్యం పెంపు పేరుతో గత మూడేళ్లలో అంటే 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు మొత్తం రూ.9,906.88 కోట్లు వ్యయం చేశారు. ఇందులో జలవనరుల శాఖ రూ.2009.92 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖ రూ.7896.96 కోట్లు వ్యయం చేసినట్లు జిల్లా కలెక్టర్ల సదస్సు నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు 2014–15 ఆర్థిక సంవత్సం ఖరీఫ్, రబీ కలిపి 155.24 లక్షల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉండగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో 7.69 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. అలాగే 2016–17 ఆర్థిక సంవత్సరంలో 2.93 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. గత ఖరీఫ్‌తో పోల్చి చూస్తే ప్రస్తుత ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం ఏకంగా 16.51 లక్షల ఎకరాలు తగ్గిపోవడం గమనార్హం.
నీరు–ప్రగతి పేరుతో దోపిడీ
నీరు–ప్రగతి పేరుతో ప్రభుత్వం గత మూడేళ్లలో చేసిన వ్యయం చూస్తుంటే కళ్లు తిరుగుతున్నాయని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కొత్తగా ఆయకట్టును సాగులోకి తీసుకొస్తుంటే సాగు విస్తీర్ణం ఎందుకు తగ్గిపోతోందో పాలకులు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ల్యాండ్ రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవడానికి కూడా గత మూడేళ్లుగా సాగు విస్తీర్ణం తగ్గిపోవడమే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. నాగార్జున సాగర్ కింద కూడా గత మూడేళ్లుగా ఆయకట్టు తగ్గిపోయిందని, దీంతో ల్యాండ్ రెవెన్యూపై ప్రభావం పడిందని రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. నీరు–ప్రగతి పేరుతో పనులన్నీ కూడా నామినేషన్‌పై చేశారని, అంటే ఈ మొత్తం నిధులన్నీ దుర్వినియోగం అయినట్లేనని సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. నీరు–ప్రగతికి చేసిన వ్యయం ఒక పెద్ద సాగునీటి ప్రాజెక్టుకు వ్యయం చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేదని, లేదా ఆ మొత్తం నిధులను రాజధానిలో పరిపాలన భవనాల నిర్మాణాలు, రహదారుల నిర్మాణాలకు వ్యయం చేస్తే ఆ నిధులు సద్వినియోగం అయ్యేవని ఆ అధికారి వ్యాఖ్యానించారు. నీరు–ప్రగతి పనుల పేరుతో నిధులను అధికారికంగా ఖజానా నుంచి దోచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Published Sun, Sep 24 2017 3:44 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement