ఉద్యమించాల్సిన తరుణమిదే
‘ఇప్పటికే మన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. తాగడానికి నీరు లేదు. తినడానికి తిండి లేదు.. రబీ సీజన్ కూడా మోసం చేసింది.. చంద్రబాబు సీఎం అయితే ఆయనతో పాటు కరువు కూడా వస్తుందని నిరూపించారు. ఇలాంటి సమయంలో చేతులు కట్టుకొని ఉండకూడదనుకున్నాను.. ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది’.. అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. గాలేరు-నగరి, సర్వరాయసాగర్ పనులు తక్షణం పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలని మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో ఆదివారం ఆయన నిరవధిక
నిరాహార దీక్ష చేపట్టారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో పాటు జిల్లా, మండల నాయకులు దీక్షా ప్రాంగణానికి హాజరై తమ సంఘీభావం తెలిపారు.
వీరపునాయునిపల్లె/ కమలాపురం: సాగు, తాగునీటికోసం తాను చేపట్టిన ఈ పోరాటం అంతం కాదని.. ఇది ఆరంభం మాత్రమేనని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. నిరవధిక నిరాహార దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కటీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా, రైతు రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. విదేశాల్లో అయితే వాగ్ధానాలు ఇచ్చి అమలు చేయకపోతే ఉరిశిక్ష విధిస్తారని, గల్ఫ్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపుతారని, అలాంటి చట్టాలు ఇండియాలో లేకనే చంద్రబాబును ప్రజలు వదిలేశారని స్పష్టం చేశారు.
అందుకే త్వరలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో నైనా అవసరమైన నిధులు కేటాయించి జీఎన్‌ఎస్‌ఎస్‌ను పూర్తి చేయాలనే డిమాండ్‌తో నిరాహార దీక్ష చేస్తున్నానన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి నాయకులు ఉంటే ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని, కాని ప్రస్తుతం భవిష్యత్ తరాల కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్కరూ ఉద్యమించక తప్పదని ఆయన పిలుపునిచ్చారు. రవీంద్రనాథ్‌రెడ్డి దీక్షకు డీసీసీబీ ఛెర్మైన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ మాజీ ఛైర్మన్ తులసిరెడ్డి సంఘీభావం ప్రకటించారు.
నేడు నాయకుల రాక
వీరపునాయునిపల్లె: కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి వీరపునాయునిపల్లెలో ఆదివారం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు సోమవారం పలువురు నాయకులు రానున్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు ఎం.వి మైసూరారెడ్డి, సీపీఐ నేత నారాయణ, కార్మిక నాయకుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి తదితరులు హాజరవుతారని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రఘునాథరెడ్డి తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి
కరువుతో అల్లాడుతున్న ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. బడ్జెట్ సమావేశాల్లో జీఎన్‌ఎస్‌ఎస్‌కు నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేపట్టడం శుభ పరిణామం. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇప్పటికైనా నిధులు కేటాయించాలి. అఖిలపక్షం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను సందర్శించినప్పుడు అక్కడ పనులన్నీ వైఎస్ హయాంలో జరిగినవేనని రైతులు చెబుతున్నారు. 80 శాతం పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు వైఎస్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఏ మాత్రం నిధులు విడుదల చేయలేదు.
- వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎంపీ
నిరాహార దీక్ష చేయడం అభినందనీయం
మరో నాలుగేళ్ల వరకు ఎలాంటి ఎన్నికలు లేక పోయినా ప్రజలు, రైతుల తాగు-సాగు నీటి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేయడం అభినందనీయం. జీఎన్‌ఎస్‌ఎస్ పథకానికి శిలాఫలకం వేసింది ఎన్‌టీఆర్ అయితే ఆ పనులను ప్రారంభించింది మాత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. వైఎస్‌ఆర్ కేవలం మూడేళ్ల కాలంలోనే జీఎన్‌ఎస్‌ఎస్‌కు రూ.4వేల కోట్లు కేటాయించారు. ప్రతి ప్యాకేజీలో పనులు చాలా వరకు పూర్తి అయ్యాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడపలో ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు మాత్రమే ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఆ తర్వాతే గండికోటకు సీఎం వచ్చి వెళ్లారు. సర్వరాయసాగర్ పూర్తి అయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది.
- ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు