Ravidranath reddy
-
పిల్లలిలా చనిపోతుంటే ఏం చేస్తున్నారు?
పెండ్లిమర్రి : ‘ఎం.ఏరాసుపల్లె గ్రామంలో దాదాపు నెల రోజుల నుంచి విషజ్వరాలు వస్తున్నాయి. 15 రోజుల వ్యవధిలోనే ముగ్గురు చనిపోయారు. ఇలానే కోనసాగితే గ్రామస్తులు ఊరు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చేటట్లుంది. గ్రామస్తులు భయం గుప్పిట్లో ఉన్నారు. పరిస్థితి ఆలాగుంటే మీరేం చేస్తున్నార’ని వైద్యాధికారులపై ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. ఏరాసుపల్లె గ్రామంలో శుక్రవారం డెంగీ లక్షణాలతో నరసింహరెడ్డి(14) అనే బాలుడు మృతి చెందాడు. విష జ్వరాలతో చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ఫ్రగాడ సానూభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడారు. గ్రామస్తులు భయంతో వణికి పోతున్నారని, జ్వరాలు రాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారని డీఎంహెచ్ఓ నారాయణ నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కొత్తగా జ్వరం కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో పాడుబడిన బావిని పూడ్చివేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మాచునూరు చంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పసల భాస్కర్, ఎంపిపి భర్త రామమోహన్‌రెడ్డి, రైతు కన్వీనర్ నాగమల్లారెడ్డి, ఎంపీడీవో వెంకటసుబ్బయ్య, తహశీల్దార్ అంజనేయులు, వైద్యాధికారి మధుసూదన్‌రెడ్డి, ఈఓపిఆర్డి రఘనాధ్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, డెంగీ లక్షణాలతో చనిపోయిన నరసింహారెడ్డి మృతదేహాన్ని టీడీపీ నియోకవర్గ ఇన్చార్జి పుత్తా నరసింహరెడ్డి పరిశీలించి వారి కుటుంబ సభ్యులకు ఫ్రగాడ సానూభూతి తెలిపారు. -
ఉద్యమించాల్సిన తరుణమిదే
‘ఇప్పటికే మన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. తాగడానికి నీరు లేదు. తినడానికి తిండి లేదు.. రబీ సీజన్ కూడా మోసం చేసింది.. చంద్రబాబు సీఎం అయితే ఆయనతో పాటు కరువు కూడా వస్తుందని నిరూపించారు. ఇలాంటి సమయంలో చేతులు కట్టుకొని ఉండకూడదనుకున్నాను.. ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది’.. అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. గాలేరు-నగరి, సర్వరాయసాగర్ పనులు తక్షణం పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలని మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో ఆదివారం ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో పాటు జిల్లా, మండల నాయకులు దీక్షా ప్రాంగణానికి హాజరై తమ సంఘీభావం తెలిపారు. వీరపునాయునిపల్లె/ కమలాపురం: సాగు, తాగునీటికోసం తాను చేపట్టిన ఈ పోరాటం అంతం కాదని.. ఇది ఆరంభం మాత్రమేనని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. నిరవధిక నిరాహార దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కటీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా, రైతు రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. విదేశాల్లో అయితే వాగ్ధానాలు ఇచ్చి అమలు చేయకపోతే ఉరిశిక్ష విధిస్తారని, గల్ఫ్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపుతారని, అలాంటి చట్టాలు ఇండియాలో లేకనే చంద్రబాబును ప్రజలు వదిలేశారని స్పష్టం చేశారు. అందుకే త్వరలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో నైనా అవసరమైన నిధులు కేటాయించి జీఎన్ఎస్ఎస్ను పూర్తి చేయాలనే డిమాండ్‌తో నిరాహార దీక్ష చేస్తున్నానన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి నాయకులు ఉంటే ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని, కాని ప్రస్తుతం భవిష్యత్ తరాల కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్కరూ ఉద్యమించక తప్పదని ఆయన పిలుపునిచ్చారు. రవీంద్రనాథ్‌రెడ్డి దీక్షకు డీసీసీబీ ఛెర్మైన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ మాజీ ఛైర్మన్ తులసిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. నేడు నాయకుల రాక వీరపునాయునిపల్లె: కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి వీరపునాయునిపల్లెలో ఆదివారం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు సోమవారం పలువురు నాయకులు రానున్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు ఎం.వి మైసూరారెడ్డి, సీపీఐ నేత నారాయణ, కార్మిక నాయకుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి తదితరులు హాజరవుతారని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రఘునాథరెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి కరువుతో అల్లాడుతున్న ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. బడ్జెట్ సమావేశాల్లో జీఎన్ఎస్ఎస్కు నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేపట్టడం శుభ పరిణామం. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇప్పటికైనా నిధులు కేటాయించాలి. అఖిలపక్షం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను సందర్శించినప్పుడు అక్కడ పనులన్నీ వైఎస్ హయాంలో జరిగినవేనని రైతులు చెబుతున్నారు. 80 శాతం పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు వైఎస్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఏ మాత్రం నిధులు విడుదల చేయలేదు. - వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎంపీ నిరాహార దీక్ష చేయడం అభినందనీయం మరో నాలుగేళ్ల వరకు ఎలాంటి ఎన్నికలు లేక పోయినా ప్రజలు, రైతుల తాగు-సాగు నీటి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేయడం అభినందనీయం. జీఎన్ఎస్ఎస్ పథకానికి శిలాఫలకం వేసింది ఎన్టీఆర్ అయితే ఆ పనులను ప్రారంభించింది మాత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. వైఎస్ఆర్ కేవలం మూడేళ్ల కాలంలోనే జీఎన్ఎస్ఎస్కు రూ.4వేల కోట్లు కేటాయించారు. ప్రతి ప్యాకేజీలో పనులు చాలా వరకు పూర్తి అయ్యాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కడపలో ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు మాత్రమే ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఆ తర్వాతే గండికోటకు సీఎం వచ్చి వెళ్లారు. సర్వరాయసాగర్ పూర్తి అయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. - ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
చక్కెర ఫ్యాక్టరీ తెరవాలి
చెన్నూరు: రైతులు, కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్న చెన్నూరు సహకార చెక్కర ఫ్యాక్టరీని తెరిపించాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. మంగళవారం చక్కెర ఫ్యాక్టరీని పరిశీలించిన భరద్వాజ కమిటీకి ఈ మేరకు ఆయన వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలోని సహకార చెక్కర ఫ్యాక్టరీల్లో ఏర్పడుతున్న నష్టాలకు కారణాలు, ఖాయిలా పడ్డ పరిశ్రమలకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, పరిష్కారమార్గాలు సూచించేందుకు నియమించిన భరద్వాజ కమిటీ సభ్యులు మంగళవారం ఫ్యాక్టరీని పరిశీలించి కార్మికులు, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిటీని కలిసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫ్యాక్టరీని సహకార రంగంలోనే నడిపి ైరె తులను, కార్మికులను ఆదుకోవాలని కోరారు. రైతులు, కార్మికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర విభజనతో ప్రత్యేక ప్యాకేజి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచాలని డిమాండు చేసిన ఎన్డీఏ దానిని అమలులోకి తెచ్చి కరువు సీమలో ఉన్న ఫ్యాక్టరీలకు అవసరమైన నిధులిచ్చి ఆదుకోవాలని ఎమ్మెల్యే కోరారు. యంత్రాలను పరిశీలించిన కమిటీ కమిటీ బృందం ప్రతినిధి భరద్వాజ్ కమిటీ సభ్యులు వెంకట్రావు, రవీంధర్‌రావు, గురువారెడ్డి ఫ్యాక్టరీలోని రికార్డులు, యంత్రాలు, వాటి సామర్థ్యం, నీటి, భూ వనరులు, స్థితి గతులను పరిశీలించారు. రైతులు, కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులు తాము చెరుకు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ప్రణాళిక ప్రకారం సాగుకు విత్తనం, ఎరువులు, చెరుకును ప్యాక్టరీకి తరలించేందుకు కూలీలు, గిట్టుబాటు ధర, బిల్లులు చెల్లింపులు సక్రమంగా ఉంటే ఎంతైనా సాగు చేసి చెరుకు పండిస్తామన్నారు. 1977 నుంచి చూస్తున్నామని సమస్యల వల్ల ఎప్పుడూ నష్టాలేనని, తమకు రావాల్సిన అలెవెన్సులు, బకాయిలు చెల్లిస్తే తాము బయటకు వెళ్లిపోతామని కార్మికులు అన్నారు. 36 నెలలుగా వేతనాలు, బకాయిలు అందక, చిక్కి శల్యమై ఆత్మహత్యలకు సిద్ధంగా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల, కార్మికుల, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను, ఇక్కడ ఉన్న వాస్తవాలను ప్రభుత్వానికి మార్చిలోపు నివేదిస్తామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు చీర్ల సురేష్‌యాదవ్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జి.ఎన్. భాస్కర్‌రెడ్డి, నాయకులు పొట్టిపాటి ప్రతాప్‌రెడ్డి, పెడబల్లె రామమనోహర్‌రెడ్డి, పుల్లారెడ్డి, మన్నెం వెంకటసుబ్బారెడ్డి, అబ్దుల్బ్,్ర నరసింహారెడ్డి, వీరారెడ్డి, కార్మిక నాయకులు పి.క్రిష్ణ, పెంచల్‌రెడ్డి, రసూల్, రైతులు పాల్గొన్నారు. -
బ్యాంకు రుణాలు కట్టొద్దు
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను క ట్టవలసిన అవసరం లేదని కడప మాజీ మేయర్, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యమని, అప్పుడు మహిళల బ్యాంకు రుణాలను మాఫీ చేస్తారని స్పష్టం చేశారు. గురువారం అనంతపురం నగరంలోని మునిసిపల్ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని తూర్పారబట్టారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న విధి విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయన్నారు. వైఎస్ పాలన 25 ఏళ్ల అభివృద్ధి దిశగా సాగితే.. ప్రస్తుత కిరణ్ సర్కార్ పాలన 30 ఏళ్ల అభివృద్ధిని వెనక్కినెట్టిందని పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని, మహానేత వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలతోపాటు వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలు తప్పకుండా అమల్లోకి వస్తాయని హామీ ఇచ్చారు. వ్యవసాయమే దండగన్న బాబు.. రైతులకేం చేస్తారు? ఒకప్పుడు వ్యవసాయమే దండగన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ రైతులను ఆదుకుంటామని చెబుతున్నారని, అది సాధ్యమయ్యే విషయం కాదని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. తొమ్మిదేళ్లు ప్రజలను వంచించిన ఘనత ఆయనదేనన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతు రుణాలు మాఫీ చేస్తామని చెబుతూ.. మళ్లీ మోసం చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వమే రుణాలు మాఫీ చేయాలంటే కష్టమని చెబుతుంటే ఆచరణ సాధ్యం కాని హామీలివ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రూ.1.27 లక్షల కోట్ల రైతు రుణాలున్నాయని, ఏపీ బడ్జెట్ రూ. లక్షన్నర కోట్లపైన ఉందన్నారు. ఇక రుణమాఫీ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. వైఎస్ జగన్ చెప్పినట్లు రాష్ట్రంలో 30 ఎంపీ సీట్లు సాధిస్తే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతులకు మేలు చేస్తామన్న హామీ నమ్మదగినదిగా ఉందన్నారు. టీడీపీ విశ్వసనీయత కోల్పోయిందని, రాబోయే రోజుల్లో ప్రజలు తప్పక బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ, పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త సానిపల్లి మంగమ్మ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పామిడి వీరాంజనేయులు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.