
వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అనేది లేదని వైఎస్సార్ జిల్లా వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ఏపీలో ఎక్కడ చూసినా మహిళలపై దురాగతాలు, గంజాయి, పేకాట క్లబ్‌ల పాలనే సాగుతోందన్నారు. మట్టి నుంచి ఇసుక వరకూ దోచుకు తింటున్నారని ధ్వజమెత్తారు. ఇంతటి దుష్ట దుర్మార్గ పరిపాలన గతంలో ఎప్పుడూ చూడలేదన్న రవీంద్రనాథ్‌రెడ్డి.. దావోస్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu Naidu) ఏమి తెచ్చాడని ప్రశ్నించారు.
దావోస్(Davos)నే ఇక్కడకు తెస్తానంటూ ప్రగల్బాలు పలికిన చంద్రబాబు.. మైదుకూరు వ్యక్తికి కోటు వేసి చర్చలు జరపారని ఎద్దేవా చేశారు. వీళ్ల చేతగానితనానికి కూడా జగనే కారణమంటూ మాట్లాడటం విడ్డూరమన్నారు. ప్రజలందరికీ వీళ్ల చేతగానితనం, మోసం అర్థమవుతోందని, వైఎస్ జగన్ ఉంటే బాగుండేదని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు.
మత్స్యకార భరోసా, అమ్మ ఒడి వంటి అనేక పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం పంగనామాలు పెట్టిందని రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. కేవలం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం తప్ప వీళ్లు చేసింది ఏమీ లేదని విమర్శించారు. వీళ్ల పరిపాలనకు దావోస్ పర్యటన నిదర్శమని, అక్కడ కూడా రెడ్‌బుక్ రాజ్యాంగం తెలిసిపోయిందన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సినవి వచ్చే వరకూ తాము ప్రజాపోరాటాలు చేస్తామని రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు.