చంద్రబాబు దావోస్‌ టూర్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి: అరుణ్‌కుమార్‌ | YSRCP MLC Mondithoka Arun Kumar Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దావోస్‌ టూర్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి: అరుణ్‌కుమార్‌

Published Sat, Jan 25 2025 5:14 PM | Last Updated on Sat, Jan 25 2025 7:05 PM

YSRCP MLC Mondithoka Arun Kumar Comments On Chandrababu

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దావోస్‌ పర్యటనపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డాక్టర్‌ మొండితోక అరుణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. దావోస్‌ పర్యటన పేరుతో చంద్రబాబు బృందం పెద్ద ఎత్తున ప్రజాధనంను దుర్వినియోగం చేసిందని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన మండిపడ్డారు. కనీసం ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి పెట్టుబడిగా తీసుకురాలేక పోయారని ఆక్షేపించారు.

చంద్రబాబు, నారా లోకేష్‌ ప్రచార ఆర్భాటానికే దావోస్‌ పర్యటన పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్‌ పర్యటనకు ఎంత ఖర్చు చేశారు? ఎందరు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు? ఎన్ని కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి? అన్న వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

దావోస్‌ పర్యటనకు కొత్త అర్థం:
సీఎం దావోస్‌ పర్యటనపై ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూశారు. ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నారు?. ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తల ముందు ఎలా ప్రజెంట్‌ చేశారోనని ఎదురు చూశారు. కానీ, తీరా దావోస్‌ నుంచి తిరిగి వచ్చిన సీఎం, మీడియా ముందు మాట్లాడింది చూసి ప్రజలు అవాక్కయ్యారు. దావోస్‌ అంటే కేవలం పెట్టబడులు కావు. నెట్‌ వర్కింగ్‌. పది మందిని కలవడం. అందరితో మాట్లాడటం. కాఫీలు తాగడం. అందరితో ఫోటోలు దిగి వాటిని మీడియాకు విడుదల చేయడం.. అంటూ చంద్రబాబు చెప్పడం నివ్వెర పరుస్తోంది. దావోస్‌ పర్యటన అంటే పెట్టుబడులు మాత్రమే కాదు, నెట్‌ వర్కింగ్‌ అని కొత్త అర్ధం చెబుతున్నారు.  

చంద్రబాబు వల్లనే..:
14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అనేకసార్లు దావోస్‌ వెళ్లారు. ఈసారి పర్యటనలో ఒక్క పారిశ్రామికవేత్తతో అయినా ఎంఓయూ చేసుకోలేకపోయారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణాలో 2 లక్షల కోట్లు, మహారాష్ట్రలో ఏడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. కానీ, చంద్రబాబు బృందం మాత్రం ఒక్కటంటే ఒక్క ఒప్పందం కూడా చేసుకోలేక పోయింది. కేవలం చంద్రబాబు సీఎంగా ఉండడం వల్లే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదా? దావోస్‌ పర్యటనపై చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. టీవీ ఛానల్స్‌కు కోట్ల రూపాయలు ఇచ్చారు. యథేచ్ఛగా ప్రజాధనంతో పెయిడ్‌ మార్కెటింగ్‌ చేసుకున్నారు. ఇంత చేసినా చంద్రబాబు పాలనపై పారిశ్రామికవేత్తలు విశ్వాసం వ్యక్తం చేయలేదు. ఒక్కరు కూడా ఏపీలో పెట్టుబడులకు సాహసించ లేదు.

లోకేష్‌ ప్రమోషన్‌ కోసమే..:
నారా లోకేష్‌ను రాజకీయ వారసుడుగా, కాబోయే సీఎంగా ప్రచారం చేసుకునేందుకే చంద్రబాబు దావోస్‌ పర్యటన. పారిశ్రామికవేత్తలతో 32 సమావేశాల్లో  పాల్గొన్నామని చంద్రబాబు చెబుతుంటే, కాదు 38 మీటింగ్స్‌లో పాల్గొన్నట్లు లోకేష్‌ చెబుతున్నారు. అందులో 20 కంపెనీలు మనదేశానికి చెందినవే. మరో ఎనిమిది కంపెనీలు హైదరాబాద్‌కు చెందినవి. ఆయా కంపెనీలతో సమావేశాలకు దావోస్‌ దాకా వెళ్ళాలా?.

జగన్‌ తమ హయాంలో ఒకేసారి దావోస్‌ వెళ్ళారు. ఏకంగా రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. గ్రీన్‌ ఎనర్జీ, ఇథైనల్‌ ఫ్యాక్టరీల వంటివి తీసుకువచ్చారు. అయినా ఆనాడు ఎల్లో మీడియా నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తూ, కథనాలు రాసింది. ఇప్పుడు అదే చంద్రబాబు, ఈసారి దావోస్‌ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణలో పూర్తిగా విఫలం కావడంతో.. ఆ టూర్‌కు ఆయన పూర్తిగా కొత్త అర్ధం చెబుతున్నారు. తన మీద నమ్మకం లేక పారిశ్రామికవేత్తలు ముందుకు రాకపోయినా, దానిపై ప్రజల దృషి మరల్చేందుకు ఏవేవో కొత్త బాష్యాలు చెబుతున్నారు.

చంద్రబాబు ఘోర వైఫల్యం:
దావోస్‌లో చంద్రబాబు బృందం ఎవరితో తమ మొదటి సమావేశం నిర్వహించిందని చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. హైదరాబాద్‌ సోమాజీగూడలోని స్టోన్‌ క్రాఫ్ట్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ప్రతినిధులతో మొదటి సమావేశం జరిగింది. 150 ఎకరాల భూమి ఇస్తే దానిలో గోల్ఫ్‌ కోర్ట్‌ పెడతామనే అంశంపై చర్చించారు. దీన్ని బట్టి చంద్రబాబు బృందం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

దావోస్‌లోని అంతర్జాతీయ వేదికపై నుంచి మన రాష్ట్రంలోని వనరులు, మానవ నైపుణ్యాలు, ప్రగతిదాయకమైన ఆర్థిక విధానాలు, ఉత్తమ పాలన, పారిశ్రామిక ప్రోత్సాహక పాలసీలను గురించి మాట్లాడి ప్రపంచ దేశాల పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలి. కానీ దీనికి బదులుగా రాష్ట్ర ఐటీ మంత్రి దావోస్‌ వేదికపైన మాట్లాడుతూ మా భవిష్యత్‌ నేత నారా లోకేష్, ఆయన సీఎంగా రావాలని కోరుకుంటున్నాం అంటూ మాట్లాడటాన్ని పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యంతో విన్నారు. పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ప్రోత్సాహకాలను ఇస్తామో చెప్పకుండా తమను తాము పొగుడుకుంటూ మాట్లాడిన మాటలను చూసి అందరూ నవ్వుకున్నారు. చివరికి దావోస్‌ వేదికపై నుంచి జగన్‌గారిపై విమర్శలు చేశారు.

దావోస్‌ పర్యటనలపై చంద్రబాబు గొప్పలు:
రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ఎటువంటి వ్యూహాత్మక ప్రణాళికలను అనుసరించాలని నిర్ధేశించాల్సిన ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ కేవలం ప్రచారం ఎలా చేసుకోవాలి అనే దానిపైనే దృష్టి పెట్టింది. సీఎంగా దావోస్‌ వెళ్లిన ప్రతిసారి చంద్రబాబు ఒక కొత్త విషయాన్ని ప్రజలకు చెబుతుంటారు. ఆనాడు ఐటీకి తానే ఆరాధ్యుడిని అన్నారు. ఇప్పుడు ఎఐకి ప్రాముఖ్యతను కల్పించింది తానే అని చెప్పుకుంటున్నారు.

తాను దావోస్‌ వెళ్తుండడం చూసి మిగిలిన సీఎంలు కూడా తనను అనుసరించారని, ఆనాటి కర్ణాటక సీఎం ఎస్‌ఎం కృష్ణ తనను చూసే దావోస్‌ వచ్చారని చెబుతున్నారు. అలాంటప్పుడు బెంగుళూరు ఐటీ హబ్‌గా దేశంలోనే ఒక ప్రత్యేకతను సాధించింది. బెంగుళూరుతో పోలిస్తే హైదరాబాద్‌ ఎందుకు వెనుకంజలో ఉందో చంద్రబాబు చెప్పాలి. దావోస్‌ వెళ్ళినప్పుడు హైదరాబాద్‌ అంటే పాకిస్తాన్‌లోని హైదరాబాదా అని అడుగుతుండేవారు అని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒక సీఎం హోదాలో ఉండి ఇలాంటి పనికిమాలిన మాటలు చెప్పి ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారా?

ఎప్పుడూ ఆర్భాట ప్రకటనలే..వచ్చింది లేదు:
2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దావోస్‌ పర్యటన సందర్భంగా 2016లో దావోస్‌లో 32 ఎంఓయులపై సంతకాలు చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు. రూ.4.78 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ప్రచారం చేశారు. కానీ వాస్తవానికి అందులో 95 శాతం ఎంఓయులన్నీ నకిలీవే. 2017లో మళ్ళీ దావోస్‌ వెళ్ళి ఏపీని సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాను చేస్తానని చెప్పారు. వైజాగ్‌లో ఫిన్‌టెక్‌ వ్యాలీలో రూ.4,550 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. తీరా చూస్తే అది ఒక డెడ్‌ ప్రాజెక్ట్‌ అయింది. 2018లో దావోస్‌ వెళ్ళి అమరావతిని స్కిల్‌ హబ్‌ చేస్తానని చెప్పారు.

కానీ, రూ.371 కోట్ల స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంకు పాల్పడ్డారు. 2017లో దావోస్‌ వెళ్ళి వచ్చి అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నాను, పారిశ్రామికవేత్తలు అమరావతికి రావాలని ఆహ్వానించారు. తీరా అవరావతి ల్యాండ్‌ పూలింగ్‌ స్కాంలో ఇరుక్కుపోయారు. 2019లో రెన్యూబుల్‌ ఎనర్జీ గురించి మాట్లాడారు. గతంలో తన ప్రభుత్వంలో ప్రతిఏటా ఏదో ఒక అంశంపై మాట్లాడి ప్రచారం చేసుకున్నారు.

ఇప్పుడు 2024లో దావోస్‌కు వెళ్ళి వచ్చి బ్లూ ఎకానమీ, గ్రీన్‌ ఎనర్జీ, పునరుత్పాదక ఇంథన వనరులు అని మాట్లాడుతున్నారు. మీ కంటే ముందే గత ప్రభుత్వంలో సీఎం వైఎస్‌ జగన్‌ 2019–24 వరకు బ్లూ ఎకానమీ, గ్రీన్‌ ఎనర్జీ గురించి మాట్లాడటమే కాదు పారిశ్రామికవేత్తలను ఒప్పించి రాష్ట్రానికి ప్రాజెక్ట్‌లు కూడా తీసుకువచ్చారు. ఆదానీ గ్రూప్‌తో రూ.20 వేల కోట్లతో గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌ ప్రారంభించాం. రూ.37 వేల కోట్లతో గ్రీన్‌ కో సంస్థతోగ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌ ప్రారంభించాం. ఇదే ప్రాజెక్ట్‌ను ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పరిశీలించి అద్భుతమైన ప్రాజెక్ట్‌ ఇది అని కొనియాడారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. పనులు:
వాటర్‌ వేస్, బ్లూ ఎకనామీ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఏపీకి సుదీర్ఘమైన సముద్రతీరం ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా పోర్టుల నిర్మాణంపై దృష్టి పెట్టింది. రామాయపట్నంలో 19 బెర్త్‌లతో 138 బిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కార్గో రవాణా లక్ష్యంగా పనులు చేశాం. ఇక మచిలీపట్నం పోర్ట్‌లో నాలుగు బెర్త్‌ల్లో మొదటి రెండు దశలు పూర్తి చేశాం. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్ట్, కాకినాడ గేడ్‌ వే పోర్ట్‌ పనులు కూడా మా హయాంలోనే చేశాం.

ఇవి కాకుండా పది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులను ప్రారంభించాం. మొదటి దశలో ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ పనులను ప్రారంభించాం. జువ్వలదిన్నెలో 88 శాతం పనులు పూర్తిచేశాం. నిజాంపట్నంలో 70 శాతం పనులు పూర్తి చేశాం. రెండోదశలో ఊడుగంట్లపాలెం, పుడిమాడిక, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప వంటి హార్బర్ల పనులు ప్రారంభించాం.

మార్కెటింగ్‌ ఏజెంట్‌గా..:
అన్ని పనులు చేసిన మేము, ఏనాడూ రాష్ట్రంలో బ్లూ ఎకానమీ గురించి మీలాగా ప్రచారం చేసుకోలేదు, ఆచరణలో చూపించాం. జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ ద్వారా 3350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్, వైఎస్సార్‌ జిల్లా చక్రాయిపాలెం వద్ద 400 మెగావాట్ల ప్రాజెక్ట్, సత్యాసాయి జిల్లా ముదిగుంపు వద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనకానపల్లి, రాప్తాడ్‌ లో 1050, బొమ్మనహళ్ళలో 850 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేసింది కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే. జగన్‌ చేసిన పనులను చెప్పుకునేందుకు మీరు దావోస్‌ వెళ్లారని అర్థం చేసుకోవాలి. గతంలో చంద్రబాబు తనను తాను సీఈఓ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అని చెప్పుకునేవారు. కానీ, ఇప్పుడు జగన్‌ ప్రగతిని ప్రచారం చేసే మార్కెటింగ్‌ ఏజెంట్‌గా మారిపోయారని ఎమ్మెల్సీ డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు దావోస్ పర్యటన ఫ్లాప్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement