స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను క ట్టవలసిన అవసరం లేదని కడప మాజీ మేయర్, వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను క ట్టవలసిన అవసరం లేదని కడప మాజీ మేయర్, వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం తథ్యమని, అప్పుడు మహిళల బ్యాంకు రుణాలను మాఫీ చేస్తారని స్పష్టం చేశారు. గురువారం అనంతపురం నగరంలోని మునిసిపల్ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని తూర్పారబట్టారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న విధి విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయన్నారు. వైఎస్ పాలన 25 ఏళ్ల అభివృద్ధి దిశగా సాగితే.. ప్రస్తుత కిరణ్ సర్కార్ పాలన 30 ఏళ్ల అభివృద్ధిని వెనక్కినెట్టిందని పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని, మహానేత వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలతోపాటు వైఎస్ జగన్ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలు తప్పకుండా అమల్లోకి వస్తాయని హామీ ఇచ్చారు.
వ్యవసాయమే దండగన్న బాబు..
రైతులకేం చేస్తారు?
ఒకప్పుడు వ్యవసాయమే దండగన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ రైతులను ఆదుకుంటామని చెబుతున్నారని, అది సాధ్యమయ్యే విషయం కాదని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. తొమ్మిదేళ్లు ప్రజలను వంచించిన ఘనత ఆయనదేనన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతు రుణాలు మాఫీ చేస్తామని చెబుతూ.. మళ్లీ మోసం చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వమే రుణాలు మాఫీ చేయాలంటే కష్టమని చెబుతుంటే ఆచరణ సాధ్యం కాని హామీలివ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రూ.1.27 లక్షల కోట్ల రైతు రుణాలున్నాయని, ఏపీ బడ్జెట్ రూ. లక్షన్నర కోట్లపైన ఉందన్నారు. ఇక రుణమాఫీ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. వైఎస్ జగన్ చెప్పినట్లు రాష్ట్రంలో 30 ఎంపీ సీట్లు సాధిస్తే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతులకు మేలు చేస్తామన్న హామీ నమ్మదగినదిగా ఉందన్నారు. టీడీపీ విశ్వసనీయత కోల్పోయిందని, రాబోయే రోజుల్లో ప్రజలు తప్పక బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ, పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త సానిపల్లి మంగమ్మ, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పామిడి వీరాంజనేయులు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.