విజయనగరం: పట్టణంలో ఆదివారం నుంచి కర్ఫ్యూ విధించనున్నారు. విజయనగరంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో కర్ఫ్యూను విధించనున్నట్లు ఐజీ ద్వారకతిరుమలరావు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో విజయనగరంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో లాఠీఛార్జి దిగారు. సమైక్య వాదులు మరింత రెచ్చిపోయి పోలీసులు రాళ్లు రువ్వడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ఐజీ వెల్లడించారు.
తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లాలో జరుగుతున్న ఉద్యమం శనివారం కూడా ఉద్రిక్తతంగా పరిస్థితులకు దారి తీసింది. ఉద్యమ కారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. కోట జంక్షన్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యమకారులు వారితో ఘర్షణకు దిగారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆస్తులపై ఉద్యమకారులు దాడి చేశారు. పరిస్థితి ఎంతకూ అదుపులోకి రాకపోవడంతో కర్ఫ్యూను విధించనున్నారు.