కరెన్సీ కష్టాలు కంటిన్యూ
పెద్ద నోట్లు రద్దయి 15 రోజులు గడుస్తోంది. ఇంకా ప్రజల కష్టాలు తీరలేదు. ఆర్బీఐ కొత్త నిబంధనలతో ఖాతాదారుల తల బొప్పి కడుతోంది. బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా సొమ్ము డ్రా చేసుకోవడానికీ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులు మూతపడ్డాయి. జిల్లాలోని ఏటీఎం కేంద్రాలు పూర్తి స్థాయిలో తెరుచుకోవడం లేదు. అవసరాలకు తగ్గట్టు బ్యాంకులకు నగదు రాక.. చేతిలో చిల్లిగవ్వలేక ప్రజలు తలలుపట్టుకుంటున్నారు.
తిరుపతి (అలిపిరి) :పెద్ద నోట్ల రద్దు ప్రభావం జిల్లా ప్రజలను వీడడం లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పెద్ద నోట్లు రద్దయి 15 రోజులు గడిచిపోయింది. ఇంకా జిల్లా ప్రజలకు కరెన్సీ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నా యి. ఉదయం నిద్రలేచిన మొదలు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. సామాన్యులు పెద్ద నోట్లు చేతబట్టి నగదు మార్పిడికి అవస్థలు పడుతున్నారు.
అరకొర నిధులు
ఆర్బీఐ నుంచి అరకొర నిధులు జిల్లాకు వస్తుండడంతో నగదు కొరత ఏర్పడింది. బ్యాంకులకు వచ్చే ఖాతాదారులందరికీ పూర్తి స్థాయి సేవలందించలేక బ్యాంకు అధికారులు చేతులెత్తేశారు. ఒక వైపు ఆర్బీఐ మాత్రం ప్రజలకు సరిపడా నగదు బ్యాంకులకు అందిస్తున్నామంటూ చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో 593 బ్యాంకు శాఖలు ఉంటే అందులో 50 శాతం కూడా ప్రజలకు సేవలందించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు పూర్తిగా మూతపడ్డాయి. తిరుపతి, మదనపల్లె, చిత్తూరు వంటి ప్రముఖ ప్రాంతాల్లోనూ బ్యాంకు సేవలు పేలవంగా ఉన్నాయి.
తెరుచుకోని ఏటీఎంలు
జిల్లాలో 708 ఏటీఎం కేంద్రాలు ఉండగా అందులో 20 శాతం కూడా తెరుచుకోవడం లేదు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసిన అరకొర ఏటీఎంలు పనిచేస్తున్నాయి. అయితే అక్కడ నిమిషాల వ్యవధిలో క్యాష్ ఖాళీ అవుతోంది. ఏటీఎం కేంద్రాలకు వస్తున్న ఖాతాదారులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఏటీఎంలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తే బ్యాంకులకు వచ్చే ప్రజల రద్దీ తగ్గే అవకాశం ఉంది.
పెంపు సరే.. నగదెక్కడ?
ఖాతాదారులు విత్‌డ్రా పరిమితిని రూ.24 వేల నుంచి రూ.50వేలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. జిల్లాలో పలు ప్రధాన శాఖల్లో నగదు కొరత కారణంగా ఖాతాదారుల విత్‌డ్రాలకు సంబంధించి రూ.4వేల నుంచి రూ.5 వేలు వరకే ఇవ్వగలుగుతున్నారు. తాజాగా ఆర్బీఐ విత్‌డ్రా పెంపు స్వాగతించే విషయమే అయినా ఖాతాదారులకు పూర్తి స్థాయి సేవలు అందించాలంటే జిల్లాకు పంపుతున్న నగదు పరిమితిని పెంచాల్సి ఉంటుంది. అలాకాకుండా విత్‌డ్రా పరిమితి పెంపు అంటే ఎటుంటి ఉయోగమూ ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.