కొత్త టారిఫ్ ప్రకటించిన ఏపీఈఆర్‌సీ
ఐదు జిల్లాల ప్రజలపై రూ.366.66 కోట్ల భారం
ఈపీడీసీఎల్‌కు సమకూరనున్న ఆదాయం
డిస్కం ప్రతిపాదనల్లో 1శాతం మాత్రమే తగ్గించిన ఏపీఈఆర్‌సీ
200 యూనిట్లపైన 5 శాతం పెరిగిన చార్జీ
ఏప్రిల్ నుంచి అమలులోకి ...
విశాఖపట్నం: అనుకున్నంతా అయ్యింది..ప్రజలపై విద్యుత్ చార్జీల పిడుగు పడింది. 2015-16 ఆర్ధిక సంవత్సరానికి టారిఫ్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యు త్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) సోమవారం ప్రకటించింది. వచ్చే నెల మొదటి తేదీ నుంచి అమలులోకి రానున్న కొత్త చార్జీల వల్ల ఈపీడీసీఎల్‌కు దాదాపు రూ.366.66కోట్ల ఆదాయం ఏడాదికి సమకూరనుంది. ఆ మేరకు ప్రజలపై భారం పడనుంది. జిల్లాలోనే ఏడాదికి ఏపీఈపీడీసీఎల్ ప్రతిపాదించిన 2015-16 ఆర్ధిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ సరఫరా ధరల(ఎఆర్‌ఆర్, రిటైల్ సప్లై టారిఫ్)పై గత నెల 23,24 తేదీల్లో విశాఖలో ఏపీఈఆర్‌సీ ‘బహిరంగ విచారణ’ నిర్వహించింది. ఈపీడీసీఎల్ అధికారులు 6 శాతం విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రతిపాధించారు. సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల్లో 52.18 లక్షల విద్యుత్ వినియోగదారులున్నారు. ఈపీడీసీఎల్‌కు రానున్న ఆర్ధిక సంవత్సరంలో రూ.10,367కోట్ల ఆదాయం అవసరం కాగా అన్ని వనరుల నుంచి రూ.8,021కోట్లు వస్తుందని అంచనా వేశారు. విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల మరో రూ.440 కోట్లు ఆదాయం సమకూరే అవకాశం ఉందని, అయినా రూ.1905కోట్ల లోటు ఉంటుందని ఏపీఈఆర్‌సీకి ఇచ్చిన నివేదికలో తెలిపారు. చివరికి ఒక శాతం తగ్గించి 5 శాతం పెంచుతూ ఏపీఈఆర్‌సీ టారిఫ్ ప్రకటించింది. వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, చక్కెర, ఫౌల్టీ పరిశ్రమలకు చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు.
జిల్లాపై రూ.70 కోట్ల భారం:
జిల్లాలో 12 లక్షల విద్యుత్ వినియోగదారులున్నారు. వీరిలో 8.27లక్షలమంది గృహ విద్యుత్ వినియోగదారులున్నారు. 0-100 యూనిట్లు వాడే వారు 5.03లక్షల మంది, 101యూనిట్లు ఆపైనవాడే గృహ వినియోగ దారులు 3.24 లక్షల మంది ఉన్నారు. వందయూనిట్ల వినియోగించే వినియోగదారులు నెలకు 2.85కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీని వల్ల రూ.5.50కోట్ల ఆదాయం వస్తుంది. 101 యూనిట్లకు మించి 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వినియోగదారులు నెలకు 6.4కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీని వల్ల రూ.25కోట్ల ఆదాయం వస్తుంది. 200పైన విద్యుత్ వాడే వారి నుంచి మరో రూ.34.5 కోట్ల ఆదాయం వస్తోంది. హెచ్‌టీ సర్వీసులున్న వారి నుంచి రూ.170కోట్ల ఆదాయం వస్తుంది. ప్రస్తుత టారిఫ్‌లో 200 యూనిట్ల లోపు వినియోగంపై చార్జీలు యధాతధంగా ఉంచారు. ప్రస్తుతం నెలకు విశాఖ సర్కిల్‌కు రూ.235 కోట్ల ఆదాయం వస్తోంది. దీనికి 5 శాతం అదనంగా ఆదాయం సమకూరనుంది.
కరెంట్ పిడుగు
Published Tue, Mar 24 2015 2:50 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
Advertisement
Advertisement