శుక్రవారం రాత్రి 8 గంటలు.. పెద్దవడుగూరు మండలం కాసేపల్లిలో అంతా హడావుడి.. మూడు గ్రామాల ఆధ్వర్యంలో జరిగే బండిశిల తిరుణాల కావడంతో పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు.. ఏడు జతల ఎద్దులతో బండిశిల రథం లాగిస్తున్నారు.. ఒక్క సారిగా అరుపులు కేకలు.. హాహాకారాలు.. ఏం జరిగిందో తెలుసుకునే లోగా పైనున్న విద్యుత్ తీగలు మృత్యుపాశాలై అక్కడున్న వారిని చుట్టుకున్నాయి.. అంతా చీకటి. కరెంటు తీగలు తెగి ఎద్దులపై, జనం పైన పడ్డాయి.. అంతలోనే తొక్కిసలాట.. ఎవరికి తోచిన వైపు వారు పరుగు తీయడంతో పిల్లలు, మహిళలు, వృద్ధులు కింద పడిపోయారు.. సుంకులమ్మ తిరుణాలలో జరిగిన ఈ విషాద ఘటనలో నలుగురు మృత్యు ఒడికి చేరగా.. బండిశిలను లాగుతున్న మూడు ఎద్దులు ప్రాణాలు కోల్పోయాయి. పెద్దవడుగూరు, కాశేపల్లి, రామరాజుపల్లిలో విషాదం నెలకొంది. కాశేపల్లిలో రథం దగ్ధమైంది. గ్రామం అంధకారమయమైంది.
పెద్దవడుగూరు/పామిడి/గుత్తి, గుత్తి రూరల్ న్యూస్‌లైన్ : పెద్దవడుగూరు మం డలం కాశేపల్లిలో బండి శిల రథం విద్యుదాఘాతానికి గురైందన్న వార్తతో చుట్టుపక్కల గ్రామాల్లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటం కలవరపాటుకు గురి చేసింది. కాశేపల్లి, గుత్తి అనంతపురం, పామిడి మండలం రామరాజు పల్లిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ మూడు గ్రామస్తుల సమక్షంలో ఈ నెల 7న సుంకులమ్మ బండిశిల తిరుణాల ప్రారంభమైంది. శుక్రవారం రామరాజుపల్లి నుంచి గుత్తి అనంతపురం శివారులోని సుంకులమ్మ ఆలయం వద్దకు బండిశిలను ఏడు జతల ఎద్దులతో తీసుకుని బయలుదేరారు. రాత్రి 8.20 గంటలకు కాశేపల్లికి చేరుకున్నారు. అక్కడ పైనున్న 220 కేవీ విద్యుత్ తీగలను బండిశిల తాకడంతో ఒక్కసారిగా తీగలు తెగిపడ్డాయి.
అవి ఎద్దులు, భక్తులపై పడడంతో వారు భయంతో పరుగుతీశారు. అంతలో గ్రామంలో పూర్తిగా అంధకారం నెలకొంది. అరుపులు, కేకలు మిన్నంటాయి. అంతలోనే తొక్కిసలాట జరిగడంతో కాశేపల్లికి చెందిన ముత్యాలరెడ్డి (40) అక్కడికక్కడే మృతి చెందారు. మార్గం మధ్యలో రామాంజులరెడ్డి (30), మాణిక్యాచారి (20), లక్ష్మినారాయణ (50) మృతి చెందారు. పవన్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సుధీర్, లక్ష్మిరెడ్డి, బాబురెడ్డి, శ్రీరామరెడ్డి, ప్రవీణ్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 అంబులెన్సుల్లో గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన సుమారు 30 మందికి గుత్తి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో కాశేపల్లిలో విషాదం నెలకొంది. క్షతగ్రాతులను జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం ఎంపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి, రాయదుర్గం, అనంతపురం అసెంబ్లీ అభ్యర్థులు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గుంతకల్లు తాజా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా పరామర్శించిన అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఎంత పని చేశావమ్మా..
Published Sat, May 10 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM
Advertisement