peddavadugur
-
Peddavadugur: గాంధీజీ మెచ్చిన ఊరు
అనంతపురం జిల్లా గుత్తికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పెద్ద వడుగూరు’ గ్రామం స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించింది. ఆ ఊళ్లో గొప్ప పారిశ్రామికవేత్త కె. చిన్నారప రెడ్డి. ఎన్నో ఆదర్శ భావాలు కలిగినవాడు. ఆయన పనిపై మద్రాస్ వెళుతూ ఉండేవారు. 1934లో ఒకరోజు ఆయన మద్రాసు మెరీనా బీచ్‌లో మహాత్మాగాంధీ ఉపన్యాసం విన్నారు. ఆ రోజు గాంధీ ఉపన్యసిస్తూ స్వాతంత్ర పోరాటానికి నిధులు కొరతగా ఉన్నాయనీ, దాతలు సహాయం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. ఆ మాటలు నారపరెడ్డిని ఆలోచనలో పడవేశాయి. తమ ఊరికి రావాలని గాంధీజీని సంప్రదించారు. స్వాతంత్రోద్య మానికి రూ. 12 వేల నిధి ఇస్తే వస్తానని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే బాపు 1934 సెప్టెంబర్ 21న మద్రాసు నుండి రైలులో ఉదయం 7 గంటలకు గుత్తి రైల్వేస్టేషన్లో దిగారు. ప్రజలు పెద వడుగూరుకు ఘన స్వాగతం పలికారు. చిన్నారప రెడ్డే గాంధీకి వసతి చేకూర్చారు. తిరుపతిరావు అనే వ్యక్తి గాంధీజీని తన భుజస్కంధాలపై ఎత్తుకొని వేదికపైకి చేర్చాడు. హిందీ పండిట్ సత్యనారాయణ... గాంధీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. నిధులు అందించి స్వాతంత్ర పోరాటాన్ని విజయవంతం చేయాలని అక్కడ చేరిన ప్రజలను కోరారు గాంధీ. అందరూ కలిసి దాదాపు రూ. 27 వేలు ఇచ్చారు. సభాస్థలికి 11 కిలోమీటర్ల దూరం నుంచి విచ్చేసిన భూస్వామి హంపమ్మ రూ. 1,116 అంద జేశారు. ఆమె అంతటితో ఆగకుండా మరో అరగంట గడుస్తుండగా తన ఒంటిపై ఉన్న బంగారు నగలన్నీ విరాళంగా ఇచ్చేశారు. అలా ఒకరికొకరు పోటీలు పడుతూ దాదాపు 5 కేజీల బంగారాన్ని గాంధీకి ఇచ్చారు. ఈ ఊరిని కేంద్రంగా చేసుకుని గాంధీ అనేక గ్రామాలు సందర్శించారు. ఉరవకొండ, హిందూపురం, కదిరి సమావేశాల్లో కూడా ప్రసంగించారు. రాత్రి అయ్యే సరికి తిరిగి పెద్ద వడుగూరులోని తన విడిది గృహానికి చేరుకునేవారు. ఈ నాలుగు రోజులూ గాంధీ చిన్నారప రెడ్డి కారులోనే తిరిగేవారు. ఆఖరు రోజున చిన్నారప రెడ్డి తనకున్న 32 ఎకరాల పొలాన్ని, తన కారును కూడా విరాళంగా ప్రకటించి గొప్ప మనసును చాటుకున్నారు. గాంధీజీని గ్రామానికి పిలవద్దని కూడా అప్పట్లో బ్రిటిష్‌వాళ్లు ఆయనను బెదిరించారు. అయినా ఆయన భయపడకుండా ధైర్యంగా నిలబడి తన నిర్ణయాన్ని అమలుపరిచారు. ఇక్కడ ఇల్లూరి కేశమ్మ అనే మహిళను కూడా మనం స్మరించుకోవాలి. ఇల్లూరు కేశమ్మ పోలీసుల బెదిరింపులకు భయపడకుండా గ్రామ గ్రామం తిరిగి, గాంధీ సభలకు రావాల్సిందిగా వేసిన కరపత్రాలు పంచింది. ఆమెను ఒకసారి అరెస్టు కూడా చేశారు. అయినా జడవక విడుదల కాగానే తిరిగి ప్రచారం మొదలు పెట్టింది. గాంధీ వెంట నారాయణమ్మ, సుభద్రమ్మ అనే మహిళలు సైతం 4 రోజులు తిరిగారు. ఆరోజు గాంధీ సభకు తోరణాలు కట్టి, అలంకరణ చేసి అందరికీ మంచినీళ్లు అందించిన వెంకటరెడ్డి వయసు నేడు 110 ఏళ్లు. ఆ గ్రామానికి 3 దశాబ్దాలు సర్పంచ్‌గా సేవలందించిన శరభా రెడ్డి కూడా ఆ కాలంలో గాంధీకి రూ. 1,116 విరాళంగా ఇచ్చారు. ఆయన కొడుకు సూర్యనారాయణరెడ్డి (88 ఏళ్ళు)... గాంధీ తమ ఊరికి వచ్చినపుడు తాను చిన్న పిల్లవాడిననీ, అప్పటి విశేషాలు ఎన్నో తన మనసులో దాగివున్నాయనీ పూస గుచ్చినట్లు వివరించారు. 1947 ఆగస్టు 15న గ్రామమంతా పండుగ చేసుకున్నామనీ, అందరికీ పిప్పరమెంట్లు, బోరుగులు పంచామనీ చెప్పుకొచ్చారు. గాంధీజీ పెద వడుగూరును ప్రశంసిస్తూ తన డైరీలో ప్రత్యేకంగా రాసుకున్నారనీ ఆయన అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆనాటి కోట్లాదిమందిని స్మరిస్తూ, జీవించివున్న స్వాతంత్య్ర సమరయోధులకు పాదాభివందనాలు తెలియజేద్దాం. (క్లిక్: ఉద్యమ వారసత్వమే ఊపిరి) - డాక్టర్ సమ్మెట విజయ్‌కుమార్ సామాజిక శాస్త్రవేత్త -
పెటాకులైన ఫేస్బుక్ ప్రేమ పెళ్లి
►తనకు భర్త కావాలంటూ యువకుడి ఇంటి వద్ద నిరసన పెద్దవడుగూరు : అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల పరిధిలోని ఆవులాంపల్లి గ్రామానికి చెందిన సుదర్శన్ గార్లదిన్నెకు చెందిన అరుణశ్రీ ఏడాది క్రితం ఫేస్బుక్ లో పరిచయం అయ్యారు. వీరి పరిచయం కాస్త వివాహానికి దారితీసింది. దీంతో ఇరువురు తల్లితండ్రులకు తెలియకుండా కర్నూల్ జిల్లా బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయం లో మార్చి 10న ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ కుమారుడు కనిపించక పోవడంతో సుదర్శన్ తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు ప్రేమ జంటను పట్టుకుని స్టేషన్‌కు పిలిపించారు. అప్పటికే వారు వివాహం చేసుకుని నాలుగు రోజులు గడిచింది. తాము మేజర్లమని ఇష్టపూర్వకంగా పెళ్ళిచేసుకున్నామని వారు చెప్పడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ నేపధ్యంలో కొత్త జంట అరుణశ్రీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళారు. తమకు ఇష్టంలేని పెళ్ళి చేసుకున్నందుకు అరుణశ్రీ తల్లిదండ్రులు వారిని తిరస్కరించి ఇంట్లోకి రానివ్వలేదు. దాంతో పునరాలోచనలోపడిన సుదర్శన్ పామిడిలో బంధువుల ఇంటిలో ఫంక్షన్ ఉంది... ఇద్దరం వెళ్దామని అందుకోసం దుస్తులు కొందామని అరుణశ్రీని నమ్మించి షాపుకు పిలుచుకు వెళ్లాడు. తప్పించుకునేందుకు ఇదే అదనుగా భావించిన సుదర్శన్ ఇక్కడే ఉండు నేను బయటకు వెళ్ళి వస్తానని అరుణశ్రీతో చెప్పి అక్కడి నుండి పరారయ్యాడు. ఎంత సేపటికీ సుదర్శన్ రాకపోవడం... ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో అనుమానం వచ్చిన అరుణశ్రీ యువకుని స్వగ్రామం అయిన ఆవులాంపల్లికి వెళ్ళి సుదర్శన్ గురించి వాళ్ల ఇంట్లో వాకబుచేసింది. సుదర్శన్ తల్లిదండ్రులు సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. మీరిద్దరూ అప్పుడే వెళ్ళిపోయారుకదా... మాకేం తెలుసు.. అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దాంతో కన్నీరు మున్నీరైన అరుణశ్రీ మీ అబ్బాయిని మీరే ఏమో చేశారని ఆరోపిస్తూ ఇంటి ముందు నిరసనకు దిగింది. దాంతో సుదర్శన్ కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు. విధిలేక అరుణశ్రీ పెద్దవడుగూరుకు వెళ్ళిపోయింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ తంతంగం గ్రామంలో చర్చనీయాంశం అయింది. పెద్దవడుగూరు వెళ్ళిన అరుణశ్రీ మళ్ళీ రాకపోవడంతో డబ్బు కోసమే ఆ యువతి ఇలా చేసిందని సుదర్శన్ తల్లిదండ్రులు చెబుతున్నారు. సుదర్శన్ ఆచూకి ఇంతవరకూ లేదు. ఈ ఫేస్ బుక్ ప్రేమ కథ ఎలా ముగుస్తుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. -
'దత్త' పుత్రులు.. 'ఉత్త' మాటలు
గ్రామాలను దత్తత తీసుకున్న ప్రజాప్రతినిధులు, ప్రముఖులు రూపురేఖలు మార్చేస్తామంటూ గొప్పలు తర్వాత కన్నెత్తి చూడని వైనం ‘శ్రీమంతుల’ తీరుపై పల్లెవాసుల పెదవివిరుపు ఇది నల్లచెరువు మండలం పల్లెవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల. ఈ ఊరు స్వయాన మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్వగ్రామం. అంతేకాదు..ఈ గ్రామాన్ని మంత్రివర్యులు దత్తత కూడా తీసుకున్నారు. పాఠశాల మూతపడి రెండేళ్లకు పైగా అవుతున్నా..తిరిగి తెరిపించలేకపోతున్నారు. ప్రస్తుతమిది గొర్రెలు, మేకలకు నిలయంగా మారింది. ఇక గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. వీధిలైట్లు, సిమెంట్ రోడ్లు లేవు. మంచినీరూ కరువైంది. ఇక మా ‘పల్లె’ను మార్చేదెవరని గ్రామస్తులు అడుగుతున్నారు. ఒక్క పల్లెవాండ్లపల్లి మాత్రమే కాదు...జిల్లాలోని చాలా దత్తత గ్రామాల పరిస్థితి ఇదేవిధంగా ఉంది. దత్తత తీసుకునే సమయంలో రూపురేఖలు మార్చేస్తామంటూ గొప్పలు చెప్పిన ‘శ్రీమంతులు’ ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. అనంతపురం: ప్రభుత్వం చెప్పిందనో..మరొకరు చేస్తున్నారనో.. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు జిల్లాలోని అనేక గ్రామాలను దత్తత తీసుకున్నారు. సొంత డబ్బు వెచ్చించి పల్లెల ప్రగతికి బాటలు వేస్తామంటూ ఘనంగా ప్రకటించారు. ఇక తమ ఊళ్ల రూపురేఖలే మారిపోతాయని స్థానికులు కూడా ఆశించారు. వారి ఆశలు అడియాసలు కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘దత్తపుత్రులు’ ప్రకటనలతో తమ పని అయిపోయినట్లు భావించి.. తర్వాత గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదు. వీరిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. వీరంతా ముఖం చాటేయడంతో ‘ఉత్తుత్తి శ్రీమంతులతో’ తమకు ఒనగూరేదేమీ లేదనే భావనకు పల్లెవాసులు వచ్చారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో అనంతపురం జిల్లాది రెండోస్థానం. జిల్లాలోని పల్లెల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవు. బిందెడు నీటి కోసం కిలోమీటర్లు నడిచివెళ్లే గ్రామాలు...ప్రభుత్వ నీటి ట్యాంకరు వచ్చేదాకా ఎదురుచూసే పల్లెలు...రోడ్డు సౌకర్యం లేక అల్లాడుతున్న ప్రాంతాలు చాలానే ఉన్నాయి. జిల్లాలోని 1003 పంచాయతీల్లో దాదాపు 3,500 ఆవాస ప్రాంతాలున్నాయి. వీటిలో దాదాపు 80శాతం గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. మాటలు సరే...చేతలేవీ? గ్రామాలను దత్తత తీసుకునే సంప్రదాయం దేశంలో రెండేళ్ల కిందట మొదలైంది. ఈ పరంపరలో ‘అనంత’ నేతలు కూడా దత్తతపై ఆసక్తి చూపారు. కొందరు స్వగ్రామాలను, ఇంకొందరు వారికి నచ్చిన పల్లెలను దత్తత తీసుకున్నారు. ఇంకొందరు అధికారుల సలహా తీసుకుని వెనుకబడిన గ్రామాలపై దృష్టిసారించారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆయన స్వగ్రామం పల్లెవాండ్లపల్లిని దత్తత తీసుకున్నారు. ఈయన మంత్రిపదవిలో ఉండటమే కాకుండా.. ఆర్థికంగా కూడా ఉన్నవారు. అయినప్పటికీ స్వగ్రామం అభివృద్ధిపై చిత్తశుద్ధి చూపడం లేదన్న విమర్శలున్నాయి. బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ కనగానపల్లి మండలంలోని ముత్తువకుంట్లను దత్తత తీసుకున్నట్లు జనవరిలో జిల్లాకు వచ్చిన సందర్భంగా ప్రకటించారు. తర్వాత ఒకసారి మాత్రమే ఆ గ్రామాన్ని సందర్శించారు. సిమెంట్‌రోడ్లు, సోలార్లైట్లు వేయించడం మినహా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి గొట్లూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దీని పరిస్థితే అంతే! ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఏకంగా మడకశిర మునిసిపాలిటీని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందులో ఇప్పటి వరకూ ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పెద్దవడుగూరును దత్తత తీసుకున్నారు. జేసీ ప్రకటన చేయగానే తాడిపత్రి స్థాయిలో తమ ఊరు అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు భావించారు. కానీ అలాంటి పరిస్థితేమీ కన్పించలేదు. చిన్నపాటి వర్షమొచ్చినా పెద్దవడుగూరు రోడ్లన్నీ మురికికూపాలుగా మారుతున్నాయి. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి నగరంలోని రాజీవ్‌కాలనీని దత్తత తీసుకున్నా.. ఇక్కడింకా అభివృద్ధికి బీజం పడలేదు. ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డి దత్తత గ్రామమైన గుమ్మఘట్ట మండలం బేలోడును సందర్శించిన ప్రతిసారీ హామీలు గుప్పించడం తప్ప ఒక్కటీ ఆచరణలో పెట్టలేదు. వీరే కాకుండా, ఇలా చాలామంది ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకున్నా.. తర్వాత వాటి అభివృద్ధిని విస్మరించారు. -
ఎంత పని చేశావమ్మా..
శుక్రవారం రాత్రి 8 గంటలు.. పెద్దవడుగూరు మండలం కాసేపల్లిలో అంతా హడావుడి.. మూడు గ్రామాల ఆధ్వర్యంలో జరిగే బండిశిల తిరుణాల కావడంతో పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు.. ఏడు జతల ఎద్దులతో బండిశిల రథం లాగిస్తున్నారు.. ఒక్క సారిగా అరుపులు కేకలు.. హాహాకారాలు.. ఏం జరిగిందో తెలుసుకునే లోగా పైనున్న విద్యుత్ తీగలు మృత్యుపాశాలై అక్కడున్న వారిని చుట్టుకున్నాయి.. అంతా చీకటి. కరెంటు తీగలు తెగి ఎద్దులపై, జనం పైన పడ్డాయి.. అంతలోనే తొక్కిసలాట.. ఎవరికి తోచిన వైపు వారు పరుగు తీయడంతో పిల్లలు, మహిళలు, వృద్ధులు కింద పడిపోయారు.. సుంకులమ్మ తిరుణాలలో జరిగిన ఈ విషాద ఘటనలో నలుగురు మృత్యు ఒడికి చేరగా.. బండిశిలను లాగుతున్న మూడు ఎద్దులు ప్రాణాలు కోల్పోయాయి. పెద్దవడుగూరు, కాశేపల్లి, రామరాజుపల్లిలో విషాదం నెలకొంది. కాశేపల్లిలో రథం దగ్ధమైంది. గ్రామం అంధకారమయమైంది. పెద్దవడుగూరు/పామిడి/గుత్తి, గుత్తి రూరల్ న్యూస్‌లైన్ : పెద్దవడుగూరు మం డలం కాశేపల్లిలో బండి శిల రథం విద్యుదాఘాతానికి గురైందన్న వార్తతో చుట్టుపక్కల గ్రామాల్లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటం కలవరపాటుకు గురి చేసింది. కాశేపల్లి, గుత్తి అనంతపురం, పామిడి మండలం రామరాజు పల్లిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ మూడు గ్రామస్తుల సమక్షంలో ఈ నెల 7న సుంకులమ్మ బండిశిల తిరుణాల ప్రారంభమైంది. శుక్రవారం రామరాజుపల్లి నుంచి గుత్తి అనంతపురం శివారులోని సుంకులమ్మ ఆలయం వద్దకు బండిశిలను ఏడు జతల ఎద్దులతో తీసుకుని బయలుదేరారు. రాత్రి 8.20 గంటలకు కాశేపల్లికి చేరుకున్నారు. అక్కడ పైనున్న 220 కేవీ విద్యుత్ తీగలను బండిశిల తాకడంతో ఒక్కసారిగా తీగలు తెగిపడ్డాయి. అవి ఎద్దులు, భక్తులపై పడడంతో వారు భయంతో పరుగుతీశారు. అంతలో గ్రామంలో పూర్తిగా అంధకారం నెలకొంది. అరుపులు, కేకలు మిన్నంటాయి. అంతలోనే తొక్కిసలాట జరిగడంతో కాశేపల్లికి చెందిన ముత్యాలరెడ్డి (40) అక్కడికక్కడే మృతి చెందారు. మార్గం మధ్యలో రామాంజులరెడ్డి (30), మాణిక్యాచారి (20), లక్ష్మినారాయణ (50) మృతి చెందారు. పవన్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సుధీర్, లక్ష్మిరెడ్డి, బాబురెడ్డి, శ్రీరామరెడ్డి, ప్రవీణ్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 అంబులెన్సుల్లో గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన సుమారు 30 మందికి గుత్తి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో కాశేపల్లిలో విషాదం నెలకొంది. క్షతగ్రాతులను జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, వైఎస్ఆర్సీపీ అనంతపురం ఎంపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి, రాయదుర్గం, అనంతపురం అసెంబ్లీ అభ్యర్థులు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గుంతకల్లు తాజా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా పరామర్శించిన అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
ఓటర్లను ప్రలోభపెడుతున్న జేసీ వర్గీయులు అరెస్ట్
అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో ఓటర్లను టీడీపీ ప్రలోభపెడుతుంది. ఆదివారం ఓటర్లను డబ్బు పంపిణీ చేస్తున్న మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.60 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును సీజ్ చేసి, ముగ్గురు జేసీ వర్గీయులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు. అలాగే చిత్తూరు జిల్లా సదూం మండలం జోగివారిపల్లిలో తమ పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్ల కు నగదు పంచుతున్న ముగ్గురు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.75 వేలు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా సంజామల మండలం రాంరెడ్డిపల్లిలో ఓటర్లకు డబ్బు పంచుతున్న టీడీపీ చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. -
వైఎస్ఆర్ సీపీతోనే పేదల అభ్యున్నతి
పెద్దవడుగూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీతోనే పేదల అభ్యున్నతి సాధ్యమని అనంతపురం ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి మునిసిపాలిటీ మాజీ చైర్మన్ పేరం నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గూడూరు సూర్యనారాయణరెడ్డి, కన్వీనర్ ఎద్దుల శరభారెడ్డి తదితరులతో కలసి ఆయన గురువారం క్రిష్టిపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతోపాటు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టనున్న అమ్మఒడి, డ్వాక్రా రుణాల మాఫీ తదితర పథకాలను వివరించారు. వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్న జెడ్పీటీసీ అభ్యర్థి మేడిమాకుపల్లి చితంబరరెడ్డి, ఇతర ఎంపీటీసీ సభ్యులను గెలిపించాలని కోరారు. సింగిల్‌విండో అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, భాస్కర్‌రెడి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా 400 మంది పార్టీలో చేరారు. మండల నాయకులు కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సమస్యలు పరిష్కారం కావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, ఆయనను గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు.