పెటాకులైన ఫేస్‌బుక్ ప్రేమ పెళ్లి
►తనకు భర్త కావాలంటూ యువకుడి ఇంటి వద్ద నిరసన
పెద్దవడుగూరు : అనంతపురం జిల్లా పెద‍్దవడుగూరు మండల పరిధిలోని ఆవులాంపల్లి గ్రామానికి చెందిన సుదర్శన్ గార్లదిన్నెకు చెందిన అరుణశ్రీ ఏడాది క్రితం ఫేస్‌బుక్ లో పరిచయం అయ్యారు. వీరి పరిచయం కాస‍్త వివాహానికి దారితీసింది. దీంతో ఇరువురు తల్లితండ్రులకు తెలియకుండా కర్నూల్ జిల్లా బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయం లో మార్చి 10న ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ కుమారుడు కనిపించక పోవడంతో సుదర‍్శన్ తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు ప్రేమ జంటను పట్టుకుని స్టేషన్‌కు పిలిపించారు. అప్పటికే వారు వివాహం చేసుకుని నాలుగు రోజులు గడిచింది. తాము మేజర‍్లమని ఇష‍్టపూర‍్వకంగా పెళ్ళిచేసుకున్నామని వారు చెప‍్పడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ నేపధ‍్యంలో కొత‍్త జంట అరుణశ్రీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళారు. తమకు ఇష‍్టంలేని పెళ్ళి చేసుకున‍్నందుకు అరుణశ్రీ తల్లిదండ్రులు వారిని తిరస‍్కరించి ఇంట్లోకి రానివ‍్వలేదు.
దాంతో పునరాలోచనలోపడిన సుదర‍్శన్ పామిడిలో బంధువుల ఇంటిలో ఫంక్షన్ ఉంది... ఇద‍్దరం వెళ్దామని అందుకోసం దుస్తులు కొందామని అరుణశ్రీని నమ్మించి షాపుకు పిలుచుకు వెళ‍్లాడు. తప్పించుకునేందుకు ఇదే అదనుగా భావించిన సుదర‍్శన్ ఇక్కడే ఉండు నేను బయటకు వెళ్ళి వస్తానని అరుణశ్రీతో చెప్పి అక్కడి నుండి పరారయ్యాడు.
ఎంత సేపటికీ సుదర‍్శన్ రాకపోవడం... ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో అనుమానం వచ్చిన అరుణశ్రీ యువకుని స్వగ్రామం అయిన ఆవులాంపల్లికి వెళ్ళి సుదర‍్శన్ గురించి వాళ‍్ల ఇంట్లో వాకబుచేసింది. సుదర‍్శన్ తల్లిదండ్రులు సరైన సమాధానం చెప‍్పకుండా దాటవేశారు. మీరిద‍్దరూ అప్పుడే వెళ్ళిపోయారుకదా... మాకేం తెలుసు.. అని నిర‍్లక్ష‍్యంగా సమాధానం చెప్పారు. దాంతో కన్నీరు మున్నీరైన అరుణశ్రీ మీ అబ్బాయిని మీరే ఏమో చేశారని ఆరోపిస్తూ ఇంటి ముందు నిరసనకు దిగింది.
దాంతో సుదర‍్శన్ కుటుంబసభ‍్యులు ఇంటికి తాళం వేసుకుని ఎక‍్కడికో వెళ్ళిపోయారు. విధిలేక అరుణశ్రీ పెద‍్దవడుగూరుకు వెళ్ళిపోయింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ తంతంగం గ్రామంలో చర‍్చనీయాంశం అయింది. పెద‍్దవడుగూరు వెళ్ళిన అరుణశ్రీ మళ్ళీ రాకపోవడంతో డబ్బు కోసమే ఆ యువతి ఇలా చేసిందని సుదర‍్శన్ తల్లిదండ్రులు చెబుతున్నారు. సుదర‍్శన్ ఆచూకి ఇంతవరకూ లేదు. ఈ ఫేస్ బుక్ ప్రేమ కథ ఎలా ముగుస్తుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.