ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి బ్యూరో : ఆటబొమ్మల పేరుతో చైనా నుంచి మనదేశంలోకి భారీగా డ్రోన్లు, సెల్‌ఫోన్లు స్మగ్లింగ్ చేస్తున్న రాకెట్ బాగోతం బయటపడింది. పక్కా సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) బృందాలు తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. డీఆర్‌ఐ వర్గాలు అనధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...
కొన్నేళ్లుగా పెరిగిన చైనా దిగుమతులు..
చైనా నుంచి కృష్ణపట్నం పోర్టుకు కొన్నేళ్లుగా ఆట వస్తువులు భారీగా దిగుమతి అవుతున్నాయి. అయితే పిల్లల ఆట వస్తువుల పేరుతో సెల్‌ఫోన్లు, కెమెరా కలిగిన డ్రోన్లు అక్రమంగా దిగుమతి అవుతున్నట్లు హైదరాబాద్‌లోని డీఆర్‌ఐ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వారు ఇచ్చిన సమాచారంతో విజయవాడలోని డీఆర్‌ఐ ప్రాంతీయ ఆపరేషన్స్ విభాగం అధికారులు ఈనెల 3, 4వ తేదీల్లో కృష్ణపట్నం పోర్టులో తనిఖీలు చేశారు. ఆటవస్తువుల పేరుతో దిగుమతి అయిన కంటైనర్లను తనిఖీ చేయడంతో విషయం బట్టబయలైంది.
హైదరాబాద్ తరలించేందుకే?
చైనా నుంచి వచ్చిన కంటైనర్లలో భారీ సంఖ్యలో సెల్‌ఫోన్లు, డ్రోన్లు ఉన్నట్లు గుర్తించారు. ఓ కంటైనర్‌లో దాదాపు 5,500 సెల్‌ఫోన్లు, 5 ఫాంటమ్ 4 డ్రోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలున్నాయి. వీటి విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇతర కంటైనర్లలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. డ్రోన్లు అక్రమంగా దిగుమతి కావడం ఆందోళనకరమైన అంశమని అధికారవర్గాలు చెబుతున్నాయి. డ్రోన్లను కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీలపై డీఆర్‌ఐ కేంద్ర కార్యాలయానికి నివేదించిన అనంతరం అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇలా స్మగ్లింగ్ చేసిన వాటిని వారంటీ, గ్యారంటీ లేకుండా తక్కువ ధరకు విక్రయిస్తున్నారని అధికారులు చెప్పారు. వీటివల్ల దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు.
అక్రమ డ్రోన్లు ఎవరి కోసం?
చైనా నుంచి అక్రమంగా దిగుమతి చేస్తున్న సెల్‌ఫోన్లు, డ్రోన్లు ఎక్కడికి తరలిస్తున్నారనే అంశంపై డీఆర్‌ఐ వర్గాలు ఆరా తీస్తున్నాయి. డ్రోన్ల వినియోగానికి పోలీసుల అనుమతి తప్పనిసరి. విచ్ఛిన్నకర శక్తులు సంఘ విద్రోహ కార్యకలాపాలకు వీటిని వినియోగించే ప్రమాదం ఉండటంతో డ్రోన్ల వాడకంపై స్పష్టమైన విధివిధానాలను రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment