పంచాయతీల అధికారాలకు కత్తెర
‘వీజీటీఎం’పై పురపాలక తాజా ఉత్తర్వులు 826 గ్రామాల్లోనూ నిలిచిపోనున్న భవన నిర్మాణాల అనుమతులు
రాజధాని నిర్మాణంలో భాగంగానే నిర్ణయమని సర్కారు వెల్లడి
ఇప్పటికే లేఔట్ అనుమతులు, రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్: విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీజీటీఎం ఉడా) పరిధిలో గ్రామ పంచాయతీలు ఇకపై ఎలాంటి అభివృద్ధి పనులకు అనుమతులు మంజూరు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం కట్టడి విధించింది. భవనాలు, కట్టడాలకు సంబంధించి అనుమతులిచ్చే అధికారం గ్రామ పంచాయతీల నుంచి తొలగించి వీజీటీఎంకు బదలాయించింది. విజయవాడ పరిసరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన నేపధ్యంలో.. ఉడా పరిధిలో కొత్త లేఔట్లకు అనుమతి ఇవ్వకుండా నిలిపివేస్తూ ఇటీవలే సర్కారు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. వీజీటీఎం పరిధిలో భూములకు సంబంధించిన ఎలాంటి క్రయవిక్రయాలు ఉండకూడదని రిజిస్ట్రేషన్ల శాఖకూ ఆదేశాలు వెళ్లాయి. తాజాగా ఉడా పరిధిలోని గ్రామ పంచాయతీల అధికారాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాజధాని నిర్మాణ అవసరాల నిమిత్తం ఈ జీవో జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఉడా పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతాల్లోని పంచాయతీల గ్రామ కంఠాల ప్రాంతాలన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఈ గ్రామాల్లో అభివృద్ధి, భూముల వినియోగం, భవనాల నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాల్లో పంచాయతీలకు అధికారాలు ఉండవని తెలిపారు. ఇకపై అక్కడి భూముల వ్యవహారాలను ఉడా పర్యవేక్షిస్తుంది. 2009లో వీజీటీఎం ఉడా పరిధిలోని గ్రామాలకు కొన్ని అధికారాలను బదలాయించారు. ఇప్పుడు ఆ అధికారాలను మళ్లీ వెనక్కు తీసుకున్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి భూములు సేకరించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆంధ్రప్రదేశ్ అర్బన్ డెవలప్‌మెంట్ యాక్ట్ 1975 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఈ నెల 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు.
మొత్తం 826 గ్రామాలకు కత్తెర...
వీజీటీఎం పరిధిలో అంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 52 మండలాల్లో మొత్తం 826 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయా గ్రామ పంచాయతీలే నిర్ణయించేవి. అధికారాల్లో భాగంగా.. 3,000 చదరపు గజాల లోపు లేఔట్లకు అనుమతులు పంచాయతీలే నిర్ణయించేవి. బైఫర్‌కేషన్ ఆఫ్ ల్యాండ్.. అంటే ఉదాహరణకు 400 గజాల లోపు స్థలం ఒకరి పేరు మీదనే ఉంటే దాన్ని రెండుగా విభజించి అనుమతులు ఇచ్చే అధికారం ఉండేది. 1,000 చదరపు మీటర్ల లోపు స్థలాలకు రెండస్థుల (జీ ప్లస్ టు) వరకూ భవనాలకు పంచాయతీలే అనుమతులు ఇచ్చేవి. ఇకపై ఈ అధికారాలకు కత్తెర పడింది. రాజధాని నిర్మాణానికి భూసేకరణ పూర్తయి, ఉడా తిరిగి అధికారాలు బదిలీ చేసేవరకూ ఆయా పంచాయతీల్లో ఎలాంటి అభివృద్ధి పనులకూ నిర్ణయాలు తీసుకోలేరు. కేవలం వీజీటీఎం ఉడా పరిధిలో మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయంతో పంచాయతీల పరిధిలోనూ భవన నిర్మాణాల అనుమతులు, లేఔట్ల అనుమతులు భారీగా ఆగిపోనున్నాయి. ఓవైపు అధికారాలు వికేంద్రీకరించాలని, పంచాయతీలకు మరిన్ని అధికారాలను కట్టబెట్టి వాటి బలోపేతానికి కృషి చేయాలని కేంద్రం చెప్తోంది. అయితే వీజీటీఎం పరిధిలో గ్రామాల్లో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నాయని, వాటికి ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలు భవన నిర్మాణాలకు గానీ, లేఔట్లకు గానీ అనుమతులు ఇస్తే రాజధాని నిర్మణానికి ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.