సైబర్ టోపీ | Cyber ​​cap | Sakshi
Sakshi News home page

సైబర్ టోపీ

Published Fri, Aug 22 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM

సైబర్ టోపీ

సైబర్ టోపీ

  • ‘మీసేవా’ కేంద్రంలోనూ విచ్చలవిడిగా మోసాలు
  •  ఆర్‌బీఐ గవర్నర్ పేరుతో ఎన్‌ఆర్‌ఐలకు కుచ్చుటోపీ
  •  ఫారిన్‌ఫండ్ ట్రాన్స్‌ఫర్ పేరుతో ఈ-మెయిళ్లకు లెటర్లు
  •  లక్కీడ్రా పేరుతో సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు
  •  పేట్రేగిపోతున్న సైబర్ నేరాలు
  • కేవీబీ పురం మండలం ‘మీసేవా’ కేంద్రంలో ఇటీవల కొందరు ఆన్‌లైన్ మోసగాళ్లు నకిలీ పాస్‌పుస్తకాలు సంపాదించారు. వాటికి ‘వన్‌బీ నిజప్రతిని’ ‘మీసేవా’ ద్వారా తీసుకున్నారు. దాని ఆధారంగా శ్రీకాళహస్తి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రుణం ఇచ్చారు. తీరా చూస్తే పాస్‌పుస్తకాలు, వన్‌బీ అన్నీ నకిలీవే! విషయం తెలుసుకున్న రెవెన్యూ, బ్యాంకు అధికారులు కంగుతిన్నారు.
     
    అరుణ్‌ప్రసాద్ సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఓ ప్రముఖ కంపెనీ నిర్వహించిన లక్కీడ్రాలో రూ.70వేలు తగిలిందని, ట్యాక్స్ రూపంలో రూ.8వేలు డిపాజిట్ చేస్తే మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమవుతుందని అందులో ఉంది. అరుణ్‌ప్రసాద్ ఓ ఖాతాలో డబ్బులు జమచేశాడు. నెలలు గడుస్తోంది. తిరుమల హుండీలో వేసినట్లు రూ.8వేలు మినహా ఇప్పటి వరకూ ఆ రూ.70 వేల జాడేలేదు.
     
    వారం రోజుల కిందట విజయేంద్ర అనే ఎన్‌ఆర్‌ఐ ఈ మెయిల్‌కు ఓ లెటరు వచ్చింది. ఇందులో 2009-12 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి విజయేంద్ర ఖాతాలో రూ.5 లక్షలు ఇంకా జమకావాల్సి ఉందని, అందుకు రూ.12,362 చెల్లిస్తే మొత్తం సొమ్మును బ్యాంక్ ఖాతాలో జమచేసేందుకు ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ నిర్ణయం తీసుకున్నట్లు ఉంది. లెటర్‌లో ఉన్న మెయిల్‌కు లక్ష్మిరెడ్డి రూ.12,362 చెల్లించారు. ఇప్పటి వరకూ రూ.5లక్షల జాడే లేదు.
     
    సాక్షి, చిత్తూరు: ఆన్‌లైన్ మోసాలు ఇటీవల ఎక్కువయ్యాయి. లక్కీడ్రా తగిలిందని పలానా అడ్రస్‌కు రావాలని చెప్పడం, అక్కడకు పోతే వారి కంపెనీకి సంబంధించిన ఇన్సూరెన్స్ వివరాలపై గంటపాటు కౌన్సెలింగ్ ఇచ్చి బిజినెస్ చేసుకోవడం జరుగుతోంది. అలాగే లక్కీడ్రాలో డబ్బులు తగిలిందని మెసేజ్‌లు రావడం, బాధితులు మోసపోవడం రివాజుగా మారుతోంది. ఆర్థిక వ్యవహారాలు, లక్కీడ్రాల గురించి అవగాహన లేని వాళ్లు మోసపోవడం సహజం. అయితే నిత్యం ఫారిన్ కరెన్సీ ట్రాన్స్‌ఫర్లు చేస్తూ, సైబర్ నేరాలపై పూర్తి అవగాహన ఉండే ఎన్‌ఆర్‌ఐలే మోసపోతుంటే.., మోసం చేసేవాళ్లు పక్కాగా ఎలా ముంచేస్తున్నారో ఇట్టే తెలుస్తుంది.
     
    ఆర్‌బీఐ పేరుతో దగా
     
    ఇటీవల ఓ ఎన్‌ఆర్‌ఐ ఈ మెయిల్‌కు ఓ లెటరు వచ్చింది. అలాంటి ఇలాంటి లెటరు కాదు. ఏకంగా ఆర్‌బీఐ లోగో ఉన్న లెటర్ ప్యాడ్. ఆర్‌బీఐ అడ్రస్. ఆర్‌బీఐ కోఆర్డినేటర్ పేరు, రిజిస్ట్రేషన్ కోడ్...చూస్తే నిజంగా ఆర్‌బీఐ నుంచి లెటర్ వచ్చిందని ఎవ్వరైనా నమ్మాల్సిందే.! డీసీఎం(డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెన్సీ మేనేజ్‌మెంట్) సన్సద్‌బాద్ మార్గ్, న్యూఢిల్లీ అడ్రస్‌తో, ఆర్‌బీఐ ఫారిన్‌ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ డిపార్ట్‌మెంట్ కోఆర్డినేటర్ ఏంజిలినా డిసౌజా పేరుతో లెటరు వచ్చింది. దాని సారాంశం ఇలా ఉంది.

    ‘‘2009-12 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆర్‌బీఐ ఖాతాదారుల జాబితాకు సంబంధించిన ఫైలును సమీక్షించారు. లాటరీ, అన్‌పెయిడ్, అన్ డెలివరీ ఫండ్స్, పేమెంట్స్ ఫైలు(ఫైల్ నంబర్: ఆర్‌బీఐ/ఐడీ1033/09)ను పరిశీలిచించారు. అందులో మీకు రూ.5లక్షలు ఆర్‌బీఐ చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించి 2013 జనవరి 2న ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, సెనెట్‌ట్యాక్స్ ఆర్థిక వ్యవహారాల కమిటీతో ముంబయి బ్రాంచ్‌లో సమావేశమయ్యారు.

    ఇప్పటి వరకూ ఆర్‌బీఐ నుంచి చెల్లించాల్సిన దీర్ఘకాలిక పెండింగ్ మొత్తాలను వారివారి ఖాతాల్లోకి జమ చేయాలని రాజన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ మొత్తాలను సంబంధించిన ట్యాక్స్‌ను మాత్రం ఖాతాదారులే చెల్లించాలి. ఈ ట్యాక్స్‌ను రెండువారాల్లోపు చెల్లించి డబ్బు అందిందా లేదా? అనేది ఆర్‌బీఐ అధికారులతో నిర్ధారించుకోవాలి.

    ఇలా చెల్లించకపోతే మీకు రావల్సిన రూ.5లక్షలు నిలిచిపోతాయి. దీనికి పూర్తి బాధ్యత మీరే వహించాలి. ఆర్‌బీఐకి ఎలాంటి సంబంధమూ లేదు. అని ఉంది. ఈ మొత్తం లెటరును ఆర్‌బీఐ ఫారిన్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ డిపార్ట్‌మెంట్ కోఆర్డినేటర్ మేడమ్ ఏంజిలినా డిసౌజా పేరుతో వచ్చింది. ఇంత పక్కాగా లెటర్ వచ్చిన తర్వాత ఎవ్వరైనా ట్యాక్స్ మొత్తాన్ని చెల్లించాలనుకుంటారు. తీరా చెల్లించినా ఎలాంటి మొత్తం బాధితుల ఖాతాల్లో జమ కావడంలేదు. ఇలాంటి మోసాలు ఇటీవల అధికంగా జరుగుతున్నాయి.

    సెల్‌ఫోన్‌లు, ఈ మెయిల్స్‌కు వచ్చే మెసేజ్‌లు, లెటర్లతో అవి నిజమో కావో తెలుసుకోకుండా డబ్బు వస్తుందనే ఆశతో చాలామంది డబ్బులు చెల్లించి బలవుతున్నారు. ఇలాంటి సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉండి, మెసేజ్‌లు వచ్చిన వెంటనే పోలీసులను సంప్రదించి డబ్బులు చెల్లించాల్సిన ఖాతా నంబర్లు, అడ్రస్‌లపై బాధితులు ఫిర్యాదు చేయాలి. అప్పుడు వాస్తవంగా డబ్బులు వస్తుందా? లేక మోసమా? అనేది తేలుతుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement