చీరాల రూరల్: సైబర్ నేరగాళ్ల దెబ్బకు బ్యాంకు అకౌంట్లోని డబ్బులు కూడా క్షణాల్లో మాయమవుతున్నాయి. మూడు రోజుల క్రితం ఇటువంటి సంఘటన చీరాలలో ఒకటి వెలుగు చూసింది. త్వరలో బ్యాంకు అకౌంట్ క్లోజ్ కాబోతోంది.. అకౌంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అంటే ఆధార్ నంబర్, పాన్, ఏటీఎం పిన్ నంబర్ చెప్పాలంటూ ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ రావడంతో కంగారు పడిన బాధితుడు వారు అడిగిన పూర్తి సమాచారం టకటకా అందించాడు.
ఇంకేముంది క్షణాల్లో అతడి బ్యాంకు అకౌంట్ నుంచి రెండు దఫాలుగా రూ.95 వేలు మాయం చేశారు. బాధితుడు మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. టూటౌన్ సీఐ రామారావు కథనం ప్రకారం.. పేరాల భావనారుషి పేటలో నివాసం ఉండే మార్పు బాలమోషేకు అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాను హైదరాబాద్ యాక్సిస్ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పాడు.
త్వరలో నీ బ్యాంకు అకౌంట్ క్లోజ్ కాబోతోంది.. బ్యాంకు అకౌంట్‌కు సంబంధించిన ఏటీఎం పిన్ నంబర్‌తో పాటు పాన్‌కార్డు, ఆధార్ నంబర్ చెప్పాలని కోరాడు. ఇంకేముంది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అపరిచిత వ్యక్తి అడిగిన సమాచారాన్నంతా బాల మోషే చెప్పేశాడు. వివరాలు చెప్పిన కొద్దిసేపటికి మోషే సెల్‌ఫోన్‌కు ఒకసారి రూ.50 వేలు, మరోసారి రూ.45 వేలు నగదు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. బాధితుడు ఆందోళన చెంది బ్యాంకు మేనేజర్‌ను కలిసి జరిగిన విషయం వివరించాడు. మేనేజర్ సలహా మేరకు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment