‘జంతారా’ మంతర్‌.. ఖాతాల్లో నగదు ఖాళీ | Cyber criminals frauds across the country | Sakshi
Sakshi News home page

‘జంతారా’ మంతర్‌.. ఖాతాల్లో నగదు ఖాళీ

Published Thu, Nov 21 2019 5:18 AM | Last Updated on Thu, Nov 21 2019 5:18 AM

Cyber criminals frauds across the country - Sakshi

బుధవారం కేసు వివరాలను వెల్లడిస్తున్న సీపీ సజ్జనార్‌

సాక్షి, సిటీబ్యూరో: పెరుగుతున్న సాంకేతికతతో పాటే సైబర్‌ నేరగాళ్లూ మోసాల్లో ఆరితేరుతున్నారు. మొన్నటి వరకు విషింగ్‌ కాల్స్‌ (బ్యాంకు ప్రతినిధులమంటూ ఫోన్‌ చేసి ఏటీఎం కార్డు వివరాలు, ఓటీపీలు తెలుసుకుని మోసం చేయడం)తో చెలరేగిపోయిన నేరగాళ్లు ఇప్పుడు ఫిషింగ్‌ గూగుల్‌ లింక్స్‌ (ఆయా బ్యాంకుల ఆన్‌లైన్‌ చిరునామాలను పోలి ఉండే లింక్‌లను పంపి ఎర వేయడాన్ని ‘ఫిషింగ్‌’గా వ్యవహరిస్తున్నారు)తో అమాయకులను నిండా ముంచుతున్నారు. ఇలా వివిధ బ్యాంక్‌ వినియోగదారుల సెల్‌ఫోన్లకు ఫిషింగ్‌ లింక్‌లు పంపి ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ తదితర క్రెడెన్షియల్స్‌ తస్కరించి, ఆ ఖాతాల్లోని నగదును మొబైల్‌ వ్యాలెట్లకు బదిలీ చేసి షాపింగ్‌ చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

దేశవ్యాప్తంగా వందల మందిని మోసగించిన జార్ఖండ్‌ రాష్ట్రం జంతారాకు చెందిన ఈ ముఠా గుట్టు సైబరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ వైద్యురాలి ఫిర్యాదుతో రట్టయ్యింది. ప్రధాన సూత్రధారి సంజయ్‌ కుమార్‌ మండల్‌ అలియాస్‌ బబ్లూ తప్పించుకోగా, ముఠాలోని ఐదుగురు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.2,66,000 నగదు, 12 గ్రాముల బంగారు గొలుసు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్‌తో కలిసి సీపీ సజ్జనార్‌ మీడియాకు బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. 

ఇలా ఎర వేస్తారు
ఆయా బ్యాంకుల నుంచి ఖాతాదారుల్ని అలర్ట్‌ చేస్తూ వివిధ మెసేజ్‌లు వస్తుంటాయి. జంతారా ముఠా.. ఈ మెసేజ్‌లను పోలిన లింకులను తయారుచేసి బల్క్‌గా బ్యాంక్‌ ఖాతాదారుల సెల్‌ఫోన్లకు పంపిస్తోంది. ‘మీ బ్యాంకు లావాదేవీల క్లోజింగ్‌ స్టేట్‌మెంట్‌ పూర్తి కాలేదు. ముంబైలోని ఆర్‌బీఐకి నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) తనిఖీ వివరాలు రాకపోవడంతో మీ డెబిట్‌ కార్డు అక్టోబర్‌ 21న బ్లాక్‌ అవుతుంది. ఈ కింది లింక్‌ క్లిక్‌ చేసి వివరాలు వెంటనే సబ్మిట్‌ చేయండి’ అంటూ పలువురికి ఫిషింగ్‌ గూగుల్‌ లింక్‌ పంపించింది. దేశవ్యాప్తంగా పలువురు ఇది నిజమేనని నమ్మి తమ బ్యాంక్‌ ఖాతా, ఇంటర్నెట్‌ క్రెడెన్షియల్‌ వివరాలను ఆ లింక్‌ అడ్రస్‌కు పంపారు.
పోలీసులకు పట్టుబడిన ముఠా సభ్యులు 

మోసాలు ఇలా..
ఖాతాదారుల నుంచి అందిన వివరాల ఆధారంగా వారి ఖాతాల్లోని డబ్బులను పేటీఎం, ఫోన్‌పేతో పాటు వివిధ మొబైల్‌ ఈ–వ్యాలెట్లకు ముఠా బదిలీ చేస్తోంది. ముఠా సూత్రధారి సంజయ్‌ కుమార్‌ మండల్‌.. తన ముఠా సభ్యులతో ఈ–వ్యాలెట్ల ద్వారా తనిష్క్, బిగ్‌బజార్‌ స్టోర్స్‌లో ఆన్‌లైన్‌లో గిఫ్ట్‌ వోచర్లు కొనుగోలు చేయిస్తున్నాడు. ఈ గిఫ్ట్‌ ఓచర్లతో ముఠా సభ్యులు ఆయా షోరూంలలో బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ కొనుగోలు చేస్తున్నారు. ఆపై వాటిని బయట అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

ముఠాలో ఎవరెవరిది ఏ పాత్ర?
సంజయ్‌ కుమార్‌ మండల్‌: ముఠా సూత్రధారి. సైబర్‌ నేరాల్లో ఎప్పటికప్పుడు ‘అప్‌డేట్‌’ అవుతూ 2016 నుంచి మోసాలకు పాల్పడుతున్నాడు.
రామ్‌కుమార్‌ మండల్‌:వివిధ బుకింగ్‌ యాప్‌ల్లో నమోదయ్యే వారి కార్డు వివరాలు సేకరించి క్లోనింగ్‌ కార్డులు తయారు చేస్తుంటాడు.
జామ్రుద్దీన్‌ అన్సారీ: ‘ఫిషింగ్‌ లింక్‌’ల ద్వారా అమాయకుల ఖాతాల్లోని నగదును ఈ–వ్యాలెట్లలోకి బదిలీ చేస్తూ.. పంజాబ్‌లో తనకు తెలిసిన వారి ద్వారా వివిధ సంస్థల గిఫ్ట్‌ వోచర్స్‌ను కొనుగోలు చేయించేవాడు. ఇందుకు వారికి కొంత కమీషన్‌ ఇచ్చి డబ్బులు తీసుకునేవాడు. 
జితేంద్ర మండల్‌: సోదరుడు రాజేంద్ర మండల్‌తో కలిసి 2016 నుంచి ఈ–వ్యాలెట్‌ మోసాలకు పాల్పడుతున్నాడు.
బిరేందర్‌ కుమార్‌ మండల్‌: ముంబైలో కారు డ్రైవర్‌. ఐదు శాతం కమీషన్‌ తీసుకొని రామ్‌కుమార్‌ మండల్‌ ఈ–వ్యాలెట్‌లో బదిలీ చేసిన వాటితో దాన్‌బడ్, బొకారాలోని తనిష్క్‌ జ్యువెలరీ స్టోర్‌లో గిఫ్ట్‌ వోచర్లు (తనిష్క్‌ దుకాణాల్లో ఎక్కడైనా బంగారం కొనుగోలు చేసే కూపన్లు) కొని అతనికిచ్చేవాడు. 
రోహిత్‌ రాజ్‌: బిహార్‌ రాష్ట్రం సొహ్‌సరైలో మొబైల్‌ ఫోన్‌ దుకాణం నడుపుతున్న ఇతను ఐదు శాతం కమీషన్‌ తీసుకొని గిఫ్ట్‌ వోచర్లు ఇస్తుంటాడు. 

వైద్యురాలి ఫిర్యాదుతో గుట్టు రట్టు
అక్టోబర్‌ 21న ఈ ముఠా పంపిన ఫిషింగ్‌ గూగుల్‌ లింక్‌ నగరానికి చెందిన ప్రముఖ వైద్యురాలికి వచ్చింది. అది నిజమేనని నమ్మి బ్యాంక్‌ ఖాతా, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలను ఆమె పొందుపరిచారు. దీంతో ఆమె ఖాతాలోని రూ.5,29,000 నగదు వివిధ మొబైల్‌ ఈ–వ్యాలెట్లకు బదిలీ అయ్యాయి. వెంటనే గుర్తించిన ఆమె అదే నెల 23న సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలు సంపాదించిన పోలీసులు జంతారాకు వెళ్లి వారం పాటు మాటు వేశారు. అనంతరం ముఠాలోని రామ్‌కుమార్‌ మండల్, జామ్రుద్దీన్‌ అన్సారీ, జితేంద్ర మండల్, బిరేందర్‌ కుమార్‌ మండల్, రోహిత్‌ రాజ్‌ను పట్టుకుని ట్రాన్సిట్‌ వారంట్‌పై బుధవారం నగరానికి తీసుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement