మచిలీపట్నం వద్ద తీరాన్ని దాటిన 'హెలెన్'
మచిలీపట్నం :
రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాలన్నింటినీ వణికించిన హెలెన్ తుఫాను కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో తీరం దాటిందని జిల్లా కలెక్టర్ రఘునందన్ ప్రకటించారు. తుఫాను తీరం దాటిందని, ఇప్పటివరకు దాని ప్రభావం వల్ల కృష్ణా జిల్లాలో రెండు మరణాలు సంభవించాయని ఆయన తెలిపారు. మరో ఆరు గంటల పాటు అధికారులంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
తుఫాను తీరం దాటే సమయంలో దాని ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, గంటకు 70 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలంతా ప్రయాణాలు మానుకుని ఇళ్లవద్దే ఉండాలని కలెక్టర్ సూచించారు. మచిలీపట్నం వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుపాను ప్రభావంతో కృష్ణాజిల్లాలో అత్యధికంగా 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఇక మంగినపూడి వద్ద సముద్రం 700 మీటర్లు ముందుకు వచ్చింది.
తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తుఫాను కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీరం వెంబడి సముద్రంలో అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. మచిలీపట్నం, బంటుమిల్లి, బందర్, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండడంతో తీరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కాకినాడలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పాడ - కాకినాడ బీచ్ లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుపాను దృష్ట్యా ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, విశాఖ, గంగవరం, భీమిలి, కళింగపట్నం ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు ఎగురవేశారు. ఇక తీరప్రాంతంలో ఉన్న పాఠశాలలకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ సెలవు ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.... సెలవులో ఉన్న సిబ్బంది తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. జిల్లా అధికారులతో కలెక్టర్ సిద్దార్ధ జైన్ సమావేశమై పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఎనిమిది మండలాల పరిధిలో 37 గ్రామాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఇక గుంటూరు జిల్లా పైన కూడా తుపాన్ ప్రభావం నెలకొంది. 39 గ్రామాలకు తుపాన్ ప్రభావం ఉంది. అలాగే నెల్లూరు జిల్లాపై కూడా హెలెన్ తుపాను ప్రభావం చూపుతోంది.
హెలెన్ తుపాను హెల్ప్లైను నంబర్లు
కాకినాడ: 0884 - 2365506
ఏలూరు: 08812 - 230050
నరసాపురం: 08814 - 27699
కొవ్వూరు: 08813 - 231488
జంగారెడ్డిగూడెం: 08812 - 223660
మచిలీపట్నం: 08672 - 252572, 1077
విజయవాడ: 0866 - 2576217
విశాఖ: 1800 - 42500002
శ్రీకాకుళం: 08942 - 240557, 9652838191
నెల్లూరు: 0861- 2331477, 2331261