సిలిం‘డర్’.. | cylinders | Sakshi
Sakshi News home page

సిలిం‘డర్’..

Published Wed, Jun 25 2014 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM

సిలిం‘డర్’..

సిలిం‘డర్’..

సాక్షి, ఒంగోలు: సామాన్య, మధ్యతరగతి కుటుంబీకుడు ఈనెల నుంచి ఇంటి బడ్జెట్‌లో రూ.5 అదనంగా లెక్కవేసుకోవాలి. గ్యాస్‌సిలిండర్ బిల్లు పెంచేందుకు కేంద్రం నడుంకట్టింది. ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట చమురు మంత్రిత్వశాఖ గ్యాస్ సిలిండర్‌పై రూ.5 పెంచాలని కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో త్వరలోనే ఎన్డీఏ ప్రభుత్వం గ్యాస్‌సిలిండర్ ధరపెంపుపై ప్రకటన జారీ చేయనుంది. దీంతోపాటు దిగువ స్థాయి పేదలు వినియోగించే కిరోసిన్ ధరను పెంచనున్నట్లు కేంద్రం సూచన ప్రాయంగా మంగళవారం మీడియాకు సమాచారమిచ్చింది. కిరోసిన్ లీటర్‌కు రూ.1 పెరగనున్నట్లు తెలిసింది.

ప్రధానిగా నరేంద్రమోడీ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇటీవల రైల్వేచార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే.. తాజాగా గ్యాస్‌ధర పెంచనున్నట్లు చెప్పడం జిల్లావాసుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. అసలే, నింగినంటుతోన్న నిత్యావసరాల ధరలతో మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు నడుపుకునేందుకు నానాకష్టాలు పడుతున్నాయి. అన్ని ఖర్చులు కలుపుకుని నెలవారీ బడ్జెట్‌ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్నారు.  
 
రూ.30 లక్షలకు పైగా భారం..
జిల్లాలో 57 గ్యాస్ ఏజెన్సీలుండగా, వీటి పరిధిలో మొత్తం 6,69,571 మంది గ్యాస్ కనెక్షన్‌లు పొందిన వినియోగదారులున్నారు. వీరిలో సింగిల్ సిలిండర్ వినియోగదారులు 2,87,696 మంది ఉండగా, డబుల్ సిలిండర్లు ఉన్న వారు 2,41,671 మంది  ఉన్నారు. వీరుకాకుండా దీపం పథకం కింద 1,30,322 మంది లబ్ధిదారులు నెలనెలా సిలిండర్లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రాయితీతో కలుపుకుని ఒక్కో సిలిండర్ ధర రూ.445.50 కు వినియోగదారునికి పంపిణీ చేస్తున్నారు.

అయితే, తాజాగా కేంద్రం పెంచనున్న రూ.5 అదనపు ధరతో రూ. 450.50   చెల్లించాల్సి వస్తుంది. ఈమేరకు సుమారు జిల్లాలోని గ్యాస్ కనెక్షన్‌దారులు నెలకు రూ.30 లక్షలకు పైగానే అదనపు భారాన్ని భరించాల్సి వస్తుంది. మురికివాడల్లోని పూరిపాకల్లో బతికే పేదలు విద్యుత్ కనెక్షన్‌లకు నోచుకోక.. కిరోసిన్ బుడ్డిదీపాలనే ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా గ్యాస్‌పొయ్యి కనెక్షన్‌కు నోచుకోని పేదలు కూడా కిరోసిన్ వాడుతుంటారు.

అలాంటి పేదలు పెరిగిన కిరోసిన్ భారంతో ఇబ్బందులు పడక తప్పదు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం సిలిండర్‌పై రూ.50 పెంచగా..దాన్ని రాష్ట్రప్రభుత్వమే భరించి పేదలపై భారం పడకుండా చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కేంద్రం వడ్డించే వడ్డింపులకు తానాతందానా.. అనడం మినహా పేదల పక్షాన నిలవకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement