అర్హులు ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని.. ఈ పరిస్థితి చూస్తుంటే కర్మపట్టి ప్రజలు చంద్రబాబును గెలిపించారనిపిస్తోందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామం వైఎస్సాఆర్ జిల్లా ఖాజీపేటలోని జెడ్పీ హైస్కూల్‌లో మంగళవారం నిర్వహించిన జన్మభూమి - మాఊరు గ్రామసభకు ఆయన హాజరయ్యారు.
అధికారులు వేదికపైకి ఆహ్వానించినా.. ఆయన ప్రజల మధ్య కూర్చొని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బడ్జెట్‌లో నిధులే కేటాయించనప్పుడు కొత్త ఇళ్లు ఎలా ఇస్తారని, పంట నష్టపరిహారం మాటేమిటని నిలదీశారు. జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పిన వారికి మాత్రమే ఇళ్లు కేటాయిస్తే, అర్హులైన మిగతా వారి సంగతేంటని ప్రశ్నించారు. కమిటీ సభ్యుల కాళ్లు పట్టుకుని బతిమాలుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ వ్యవసాయానికి రెండు విడతలుగా కాకుండా ఒకే విడత 7 గంటలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.